జగన్‌తో పేచీ..చంద్రబాబుతో లాలూచీ..ఇదే పవన్‌యిజం

చంద్రబాబు కోడ్‌ వచ్చిన తరువాత దీక్ష చేశారు

రాజకీయ అవసరాల కోసం ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు

దళితులను ఏమార్చి వారి భూములు దోచేశారు

రాజధానిలో లక్షల కోట్ల కుంభకోణం చేశారు

వైయస్‌ జగన్‌ను వ్యతిరేకించడమే పవన్‌ యిజం

స్క్రిప్ట్‌ చంద్రబాబుది..వాయిస్‌ పవన్‌ కళ్యాణ్‌ది

సంక్షేమ కార్యక్రమాలు చేయడం వల్ల రాష్ట్రం వెనుకబడిందా?

సుజనా చౌదరి బీజేపీలో ఎందుకు చేరారో చెప్పగలరా?

మంత్రి పేర్ని నాని

సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పేచీ పెట్టుకోవడం, చంద్రబాబుతో లాలూచీ పడటమే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పవన్‌ యిజమని మంత్రి పేర్ని నాని విమర్శించారు. సీఎంపై చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌, సుజనా చౌదరి చేసిన ఆరోపణలను పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజాధనాన్ని రాజకీయాలకు వాడుకున్నారని మండిపడ్డారు. పవన్‌ కళ్యాణ్‌ గతంలో ఎవరిని ప్రశ్నించారని నిలదీశారు. మోదీ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి చివరిలో డ్రామాలాడారని, మళ్లీ ఇప్పుడు మోదీతో పెట్టుకొని తప్పు చేశామని యాక్షణ్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. రోజూ ధర్మసూక్తులు చెప్పే చంద్రబాబు ఢిల్లీలో ఒక్క రోజు దీక్షకు రూ.10 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. టీటీడీ నిధులను కూడా దీక్షలకు వినియోగించారన్నారు. శుక్రవారం సచివాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు రాజకీయ కోణంతో దీక్షలు చేశారని పేర్ని నాని విమర్శించారు . ధర్మ ఫోరాట దీక్ష పేరుతో ప్రజాధనాన్ని వృథా చేశారని మండిపడ్డారు. సొమ్ము ప్రజలది..సోకు టీడీపీది అన్న చందంగా సాగిందన్నారు. చంద్రబాబు ఎన్నికల కోడ్‌ వచ్చిన తరువాత దీక్ష చేశారని పేర్కొన్నారు. రాజకీయ అవసరాల కోసం ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారని విమర్శించారు.

ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్టీ రామారావు ఫొటోను పెట్టుకున్నారని, గెలిచిన తరువాత రామారావు ఎవరని ఏకవచనంతో ఓ పత్రికాధిపతితో కలిసి దూషించాడని గుర్తు చేశారు. పిల్లనిచ్చిన మామ ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, ఆయన కుటుంబ సభ్యులను ఎన్టీఆర్‌కు దూరం చేశారన్నారు.  ఓట్ల కోసం మళ్లీ రామారావు ఫోటోకు దండేసి దండం పెట్టారని, గెలిచిన తరువాత మళ్లీ ఆయన పేరును పథకాలకు లేకుండా తీసేశారని తెలిపారు. 2004-2009 మధ్యలో మళ్లీ తాను మారానని, తప్పు చేశానని మన్నించాలని ఓట్లు వేయించుకున్నారని తెలిపారు. 2014లో నరేంద్రమోదీతో కాళ్లు పట్టుకొని, ఆయన బొమ్మ పెట్టుకొని ఓట్లు పొందిన చంద్రబాబు 2019 ఎన్నికల్లో తన బావమరిదితో వచ్చి రాని భాషలో తిట్టించారని, దేశమంతా తిరిగి మోదీ హఠావో అని నినదించాడని తెలిపారు. ఇప్పుడు మళ్లీ తప్పు అయిపోయిందని, ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చి తప్పు చేశానని చెప్పుకోవడం సిగ్గు చేటు అన్నారు. తప్పు చేసిన తరువాత ఒప్పుకొని, మళ్లీ సిగ్గు లేకుండా కలిసిపోవడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. తన మనుషులను బీజేపీలో చేర్పించి చంద్రబాబు నీచమైన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను బంగారు బాతు వంటి రాజధాని నిర్మిస్తే..వైయస్‌ జగన్‌ అడ్డుకుంటున్నారని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని తెలిపారు. మరోవైపు హైకోర్టు జడ్జి మాత్రం రాజధాని ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. కోర్టు భవనాలన్నీ కూడా 2018లోగా పూర్తి చేస్తానని చంద్రబాబు కోర్టుకు వెళ్లి అప్పిలు చేశారని తెలిపారు. చంద్రబాబును నమ్మి హైకోర్టును అమరావతికి మార్చితే..ఇక్కడ భవనాలు లేవన్నారు. దళితులకు పంచి పెట్టిన భూములను చట్టాలు మార్చి చంద్రబాబు దోచుకున్నారని వివరించారు. గజానికి రూ.10 వేలు ఖర్చు చేసిన తాత్కాలిక భవనాలు నిర్మించారని,  ఆ భవనాలు చిన్న వర్షానికే నీరు చేరుతోందన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో అమాయకుల భూములు బలవంతంగా గుంజుకున్నారని తెలిపారు.

వైయస్‌ జగన్‌ను వ్యతిరేకించడమే పవన్‌ కళ్యాణ్‌ సిద్ధాంతమన్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా..అధికారంలో ఉన్నా జగన్‌ను విమర్శించడమే పవన్‌ పనిగా పెట్టుకున్నారన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఎత్తి చూపకుండా ప్రతిపక్షాన్ని తిట్టారు. ఇప్పుడేమో ప్రతిపక్షాన్ని ఒక్క మాట కూడా అనకుండా, అధికార పార్టీని విమర్శిస్తున్నారని తెలిపారు. వైయస్‌ జగన్‌పై కేసులు ఉన్నాయి కాబట్టి ఎవరిని ప్రశ్నించలేకపోయారని పవన్‌ విమర్శించారని, పవన్‌పై కేసులు లేవు కదా ఆయన ఎవరిని ప్రశ్నించారని నిలదీశారు. 2014 ఎన్నికల సమయంలో నరేంద్రమోదీ, చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ..ఈ ముగ్గురు కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇవాళ వైయస్‌ జగన్‌పై ఎన్నికేసులు ఉన్నాయని, ఆయన కేసులు ఎవరు చెబితే పెట్టారని ప్రశ్నించారు. ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ ఎవరికి ఎక్కడెక్కడ సీట్లు ఇచ్చారో అందరికి తెలుసు అన్నారు. చంద్రబాబు చెప్పిన చోట్ల పవన్‌ తన అభ్యర్థులను నిలబెట్టారన్నారు.

లాలూచీ కార్యక్రమాలు పవన్‌ కళ్యాణ్‌ మార్చేస్తే బాగుంటుందన్నారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత కిడ్నీ పెషేంట్ల కోసం ఆసుపత్రులు ఏర్పాటు చేస్తే పవన్‌ అభినందించడని, అదే చంద్రబాబు ఏ ఘనకార్యం చేయకపోయినా ఆయనను శాలువాతో సత్కరించి అభినందిస్తారని విమర్శించారు. రాష్ట్రం రెండేళ్లు వెనక్కి వెళ్లిందని ప్రతిపక్ష సభ్యులు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. రైతు భరోసా, ఆటో డ్రైవర్లకు ప్రోత్సహకాలు, అమ్మ ఒడి కార్యక్రమాలు చేపట్టి ప్రజల అభిమానాన్ని చురగొంటే ఇవేవి కూడా వారికి కనిపించడం లేదన్నారు. సంస్కార హీనంగా కోడికత్తి కేసు అంటూ హేళనగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు, ఆయన పార్ట్‌నర్‌ మాట్లాడుతున్న తీరు బాధాకరమన్నారు.
బీజేపీ ముసుగు వేసుకున్న టీడీపీ నాయకులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, పార్టీ మారినా ..బుద్ధులు మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీలోకి ఎందుకు మారావో చెప్పే ధైర్యం ఉందా అని నిలదీశారు. కమలం కండువా కప్పుకున్నాక ఆ నేతలు పొద్దున లేచింది మొదలు జగన్‌..జగన్‌ అంటూ విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. సుజనా చౌదరి ఎందుకు బీజేపీలో చేరారో చెప్పగలరా అని ప్రశ్నించారు. మీరు చంద్రబాబు కోవర్టు కాదా అని నిలదీశారు.

Read Also: పచ్చి అబద్ధాలకు పరాకాష్ట ఈ వార్తలు..

Back to Top