మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర 

మంత్రి పేర్ని నాని

తాడేపల్లి: ఏపీలో మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర జరుగుతోందని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు.  రాజకీయ అవసరాల కోసం బీజేపీ  దిగజారి వ్యవహరిస్తోందని మంత్రి విమర్శించారు. అసలు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని బీజేపీ ఏం చేయదలుచుకుందని పేర్ని నాని ప్రశ్నించారు. సోమవారం తాడేపల్లి మీడియా పాయింట్ వ‌ద్ద మంత్రి పేర్ని నాని మాట్లాడారు.  ఏపీలో దేశ వ్యతిరేక శక్తుల్ని పుట్టిస్తున్నారని ప్రచారం చేస్తున్నారని,  కేంద్ర మంత్రి లాంటి వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేయడం తగునా అని ప్రశ్నించారు. 

 

 

మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ... ఏమన్నారంటే...

-  కేంద్ర మంత్రిగా బాధ్యత కలిగిన స్థానంలో ఉన్న ఒకాయన, రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడం కోసం.. రౌడీ చేష్టలు చేసి, ఉద్యోగస్తులు, పోలీసులు మీద దాడులు చేసిన ఓ ముద్దాయిని పరామర్శించడానికి జైలుకు రావడం అనేది రాజకీయ వ్యవస్థను ఏరకంగా భారతీయ జనతా పార్టీ దిగజార్చుతుంది.

- దేశ బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్రమంత్రి ఈ రకంగా జైలు తలుపులు తట్టడం సిగ్గుచేటు. ఒక రాజకీయ పార్టీగా ఎవరైనా పోరాటాలు, ఉద్యమాలు చేయవచ్చు, కానీ, ఈ రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేదానికి కాలుదువ్వి రౌడీయిజం చేసిన వ్యక్తిని బీజేపీ పరామర్శ చేయడం అనేది ఆ పార్టీ మార్గం ఏంటో తేటతెల్లమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ ఏం చేయదలచుకుందని అడుగుతున్నాం. బీజేపీ ఎంతగా దిగజారిపోయి, వారి రాజకీయ అవసరాల కోసం ఏవిధంగా ప్రవర్తిస్తున్నారో చూస్తుంటే... భారతదేశంలో వారి పరిపాలన లేనటువంటి ఏ రాష్ట్రాన్ని అయినా రావణ కాష్టంగా మార్చెయ్యాలనే ప్రయత్నం చేయడం అతి హేయమైన చర్యగా మేము ఖండిస్తున్నాం. 

- బాధ్యత గల కేంద్ర మంత్రి అయ్యి ఉండి, ఆయన మాట్లాడిన మాటలు వింటుంటే "ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశ వ్యతిరేక శక్తుల్ని పుట్టించేటటువంటి ప్రాంతంగా తయారైందని" మాట్లాడుతున్నారు. మీరన్నట్టుగా... దేశానికి నష్టం వాటిల్లే చర్యలే గనుక జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? ఎన్‌ఐఏ ఏం చేస్తుంది? రా ఏజెన్సీ ఏం చేస్తోంది? ఐబీ ఏం చేస్తోంది? వీళ్లంతా నిద్ర పోతున్నారా? కేంద్రంలోని మీ పాలనలో మీరు ఏం చేస్తున్నారు? ఒకవేళ మీ స్టేట్‌మెంటే నిజమే అయితే.. వాళ్లంతా నిద్రపోతుంటే మీరు మాత్రమే బాగా పనిచేయడానికి ఇక్కడకు వచ్చారా? అని అడుగుతున్నాం.

- మాట్లాడేటప్పుడు మనం ఏ స్థానంలో ఉన్నాం అని ఆలోచించాలి. దేశానికి ఒక విదేశాంగ వ్యవహార మంత్రిగా దేశ విదేశాల్లో దేశ ప్రతిష్టను నిలబెట్టాల్సిన మీరు పార్లమెంట్‌లో ప్రజాస్వామ్యాన్ని పెంపొందించాల్సిన మీరు ... ఇంత దిగజారి, తుచ్ఛమైన రాజకీయ అవసరాల కోసం, ఇంత హేయంగా ప్రవర్తించడం మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. రాజకీయాల కోసం ఇక్కడ మతాన్ని, మత విద్వేషాలను రెచ్చగొట‍్టడం కోసం భారతీయ జనతా పార్టీ ఏ స్థాయికి దిగజారుతున్నారో చూస్తుంటే.. ఇక, ఆ భగవంతుడే బీజేపీ బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడాల్సిన పరిస్థితి నెలకొంది. కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి కర్నూలులో ఉన్నటువంటి ముక్కంటేశ్వరుడు కచ్చితంగా ఇలాంటి దుర్మార్గమైన మనుషుల నుంచి ఆంధ్రప్రదేశ్‌ను కాపాడతారు. రాజకీయాల కోసం వారి దిగజారుడు మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం.

కాల్‌మనీ, చీటింగ్‌, మర్డర్‌ కేసుల్లో ముద్దాయిలతో నిజ నిర్థారణ చేస్తారా..?
- చంద్రబాబు నాయుడు రోజూ మీడియా ద్వారా చేస్తున్న ప్రచార హింసతో ప్రజలంతా ఇబ్బంది పడుతున్నాం. ఆయన ఇవాళ వ్యూహ కమిటీ అంటూ ఇంట్లో కూర్చుని జూమ్‌ మీటింగ్‌ పెట్టి రేపొద్దున పేపర్‌లో రాయిస్తాడు. ఏంటయ్యా అంటే కొడాలి నాని గారిని ఏదో చేయాలంటారు? ఏం చేయాలి కొడాలి నానిగారిని. నువ్వు ఏం చేయగలవు? ఏమి  కలలు గంటున్నావ్‌? ఈ రాష్ట్రానికి ఈ రచ్చ ఏంటి అసలు? మీకు పదవి ఉంటేనేమో రోజూ మీటింగ్‌లతో జనాలను చంపుతావు. పదవి పోతేనేమో.. ఏదో విషయాన్ని తీసుకుని రచ్చ చేస్తూ జనాలను మరోరకంగా హింసిస్తూ మానసికంగా కాల్చుకు తింటు వేధిస్తారు. 

- సంక్రాంతి పండుగకు ప్రజలంతా సంబురాలు చేసుకుంటుంటే.. పోలీసులు వద్దన్నా ప్రజలు మాత్రం కోడి పందేలు నిర్వహించుకున్నారు. అవి మీ ప్రభుత్వంలోనూ జరిగాయి. మా ప్రభుత్వంలో కూడా సంక్రాంతికి అక్కడక్కడా అనధికారికంగా కోడి పందేలు జరిగి ఉండవచ్చు. సంక్రాంతి సంబురాలు సాకుగా చూపించి.. 13వ తారీఖు నుంచి ఇవాళ 24 తారీఖు అయినా ఆ రచ్చ వదలకుండా టీవీ పెడితే చాలు మీరు, మీ మనుషులు దుర్మార్గంగా ప్రజలను మాసికంగా హింసిస్తున్నారు. అభూత కల్పనలతో, అసత్యాలతో, దొంగ వీడియోలతో రచ్చ, యాగీ చేయడం పద్ధతేనా అని అడుగుతున్నాం.

- కేసినో అని, నిజ నిర్థారణ కమిటీ అంటూ గుడివాడకు మీరు పంపించింది ఎవరిని అని చంద్రబాబును అడుగుతున్నాం? వాళ్ళంతా, కాల్‌మనీ కేసులో ముద్దాయి, చీటింగ్‌ కేసులో ముద్దాయి, మర్డర్‌ కేసులో ముద్దాయిలు అవునా, కాదా..? వీళ్లంతా ఎవరిని నిజ నిర్థారణ చేస్తారు? ఏమాత్రం ఉత్తమ పురుషులు వీళ్లు. నేర చరిత్ర లేనివారిని పంపించుకోవచ్చు కదా? అధికారం కోల్పోతే దుర్మార్గంగా, కిరాతకంగా ప్రవర్తించడం బాబుకు రివాజుగా మారింది.

- కొడాలి నానిగారి మీద చంద్రబాబుకు విపరీతమైన ద్వేషం. ఎప్పుడైతే ఆయన మీ దుర్మార్గాలను సహించలేక జగన్‌ గారి దగ్గరకు వస్తే ఆరోజు నుంచి మొదలుపెట్టి ఈరోజు వరకూ కొడాలి నాని అనే వ్యక్తిని మానసికంగా వేధించడం పరిపాటిగా మారింది. ఇకనైనా ఆపకపోతే... మీ వేధింపుల వల్ల ఆయన రోజురోజుకు ప్రజల గుండెల్లో సుస్థితరమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. ఇప్పటికైనా ఈ అభూత కల్పనలు, నాని మీద ద్వేషాన్ని కట్టిపెట్టి ప్రజా సమస్యలపై మీ కష్టం చూపించమని చెప్పి హితవు పలుకుతున్నాం.

ఉద్యోగస్తులతో చర్చలకు ప్రభుత్వం తలుపులు తెరిచే ఉంటాయి
 - ఉద్యోగస్తుల గురించి చంద్రబాబు నాయుడు ఇవాళ సానుభూతి మాటలు మాట్లాడటమంటే.. ఆయన హయాంలో ఏం జరిగిందో ఉద్యోగులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఉద్యోగస్తులకు నరకం చూపించి, వారిని మానసికంగా వేధించి, వారిని అవమానపరిచి, ఇవాళ వారి గురించి దొంగ సానుభూతి మాటలు మాట్లాడితే ఏరకంగా నమ్ముతారు? ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల నియామకం చేయలేదు. ఉద్యోగస్తులను నిత్యం మానసికంగా వేధించే పరిస్థితులు చంద్రబాబు హయాంలో జరిగాయి. ఇవాళ ఉద్యోగస్తుల గురించి సానుభూతి మాటలు మాట్లాడటం అంటే.. మొసలి కన్నీరు కార్చడమే. చేపలను వేటాడటం కోసం ఒంటి కాలు మీద కొంగ జపం చేస్తుంటే.. చేపలకు తెలియకపోవచ్చు కానీ, ఉద్యోగస్తులకు మాత్రం తెలుసు. చంద్రబాబు నైజం, తత్వం, వేధింపులను ఉద్యోగస్తులు ఎప్పటికీ మర్చిపోరు. మీరెంత దొంగ కన్నీరు కార్చినా, సానుభూతికోసం పాకులాడినా ఉద్యోగస్తుల మనసుల్లోకి వెళ్లలేరు.

- ఉద్యోగస్తులు సమ్మె నోటీసు ఇస్తారు? అయితే వాళ్లు జీవితాంతం సమ్మె చేయరు కదా? ఏదో ఒకరోజు ప్రభుత్వంతో చర్చలకు రావాల్సిందే కదా? వాళ్లూ ప్రభుత్వంలో భాగమే, మా వాళ్ళే, చర్చలకు రావాలని మేము ఆహ్వానిస్తున్నాం. ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాం. పీఆర్సీలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మీరు భావించిన హెచ్చుతగ్గులు ఏమున్నాయి అని ఉద్యోగులతో చర్చించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గారు అయిదుగురితో ఓ కమిటీని నియమించడం జరిగింది. చర్చలకు రాకుండా మీరు ఒక  అడుగు ముందుకు వేసినా.. ప్రభుత్వం దృష్టిలో, మా మనసుల్లో ఎప్పటికీ ఉద్యోగస్తులు మా బిడ్డల్లాంటివారే. మీ పట్ల ప్రేమపూర్వక అభిప్రాయం ఉంది కాబట్టి ప్రభుత్వం నియమించిన అయిదుగురు సభ్యుల కమిటీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. చర్చలకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం.

- ఏది చెప్పినా సమావేశానికి వచ్చి చర్చించండి. మా ఇంటికో, పొలానికో రమ్మనటం లేదు కదా? సచివాలయానికి రండి మాట్లాడదాం, అంటున్నాం. పార్టీ కార్యాలయానికి రండి చర్చించుకుందాం అంటే తప్పు పట్టవచ్చు. ఏ డిమాండ్లు అయినా చర్చలకు రావాల్సిందే కదా? మీడియాలో మాట్లాడటం, మీడియాలో మాట్లాడిందే ప్రభుత్వం తీసుకోవాలనుకోవడం ఎంతవరకూ ధర్మం అని అడుగుతున్నాం. టీవీలో మాట్లాడి ప్రభుత్వాన్ని స్పందించమనడం అనేది ఎవరికి ధర్మం, ఎలా ధర్మం? ఎలా ఉచితం అని అడుగుతున్నాం. మీడియా సమావేశాలు మీరు పెట్టుకుంటే అది ప్రభుత్వానికి ఎలా వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు అయిన వాళ్లు ప్రభుత్వంతో చర్చలకు రావచ్చు కాదా? వాళ్ల అభిప్రాయాలను చెప్పమనండి.

Back to Top