రైతు ఉద్యమం అన్నది బూటకం

రాష్ట్ర  పంచాయతీరాజ్ శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  

 హైదరాబాద్ లో చేసిన తప్పునే.. అమరావతిలోనూ చేయాలని బాబు చూస్తున్నాడు

భూములు ధరలు పడిపోయేసరికి రోడ్ల మీదకు వచ్చి ఒకే రాజధాని అంటున్నారు

 ఆ  పార్టీల కలయిక అనైతికం

తిరుప‌తి:  అమరావతి ప్రాంతంలో వేల ఎకరాలు భూములు కొనుక్కొని, వాటిని కాపాడుకోవడం కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్న ఉద్యమమేకానీ, అది రైతుల ఉద్యమం కానేకాద‌ని రాష్ట్ర  పంచాయతీరాజ్ శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.  చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి, భూములు కొన్నవారు వాటిని పరిరక్షించుకోవడం కోసం యాత్రలు చేస్తున్నారు, సభలు పెడుతున్నారు. ఈరోజు ఆ భూముల ధరలు పడిపోయే సరికి రోడ్ల మీదకు వచ్చి ఒకే రాజధాని అంటున్నారు. పైగా న్యాయ స్థానం ఇస్తుందని చంద్రబాబే చెప్పకనే చెబుతున్నారు. అందుకే న్యాయస్థానం నుంచి దేవస్థానం అని ముందే ఒక డైరెక్షన్ ఇస్తున్నారు. వెంకటేశ్వర స్వామి కూడా మద్దతు ఇస్తున్నాడన్నట్టుగా మాట్లాడుతున్నారు. దేవుడు ఏమైనా పాదయాత్ర చేయమన్నాడా..?. పాదయాత్ర చేయమని చంద్రబాబే చెప్పాడు.

 అమరావతి రైతుల పేరుతో చేస్తున్న ఉద్యమంలో ... రైతులు ఎవరున్నారు.?. కేవలం ఆ ప్రాంతంలో భూములు కొన్నవారు, భూములు ఇచ్చినవారే ఉన్నారు. వారంతా భూముల ధరలు పడిపోయానన్న బాధతో బయటకు వచ్చి యాత్రలు చేస్తూ, సభలు పెట్టి,  గొంతు చించుకుని మాట్లాడుతున్నారు.  అమరావతిని పరిరక్షిస్తాను అని చంద్రబాబు తిరుపతి వచ్చి చెబుతున్నాడు. ఆయన ఏం పరిరక్షిస్తాడు, ఎవరి ప్రయోజనాలు పరిరక్షిస్తాడు..?

  అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులను అడ్డు పెట్టి, లక్ష కోట్లకో.. రెండు లక్షల కోట్లకో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు అని చంద్రబాబు కలలుగన్నాడు. 2019లో వైయస్ఆర్  కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో, తన వ్యాపారాన్ని జగన్ గారు అడ్డుకున్నారన్నదే ఆయన బాధ అంతా. 

  చంద్రబాబు అమరావతి మాత్రమే రాజధాని కావాలని కోరుకుంటున్నాడు. అది మీ విధానంగా మీరు చెప్పుకోండి. కానీ, మీరు ఎన్ని చెప్పినా, మిమ్మల్ని ఛీ కొట్టి, రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరగాలని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలన్న జగన్ మోహన్ రెడ్డిగారి విధానానికే ప్రజలు మద్దతు ఇచ్చి, ప్రతి ఎన్నికల్లోనూ గెలిపిస్తున్నారు. 

  ఆరోజు హైదరాబాద్ లో తప్పు చేసినట్టే..  అమరావతిలోనూ చేయాలని చంద్రబాబు భావించాడు. హైదరాబాద్ లో కూడా ఒక ప్రాంతంపైనే దృష్టి కేంద్రీకరించి, హైటెక్ సిటీని చూపించి, సైబరాబాద్ ను నిర్మిస్తున్నట్టు ప్రచారం చేసుకుని, దాని చుట్టూ ఒకే సామాజికవర్గం చేత భూములు కొనిపించి, లబ్ధి చేకూర్చడంతో, ఆయన మనుషులంతా వేల కోట్లకు పడగలెత్తారు. అమరావతిలో కూడా అదే స్కీమ్ అమలు చేయాలనుకుంటే జగన్ మోహన్ రెడ్డిగారు అధికారంలోకి రావడం వల్ల అది బెడిసికొట్టింది. అదే వారి బాధంతా. 

  చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదు. ఆయన చెబుతున్నట్లుగా అమరావతిలో ఆయన  బినామీ భూములను పరిరక్షించుకోవడం సాధ్యంకాదు. రైతు ఉద్యమం అన్నది బూటకం. అందులో రైతులు ఎవరూ లేరు. వారంతా చంద్రబాబు చెప్పినట్టు, చెప్పినచోట భూములు కొన్నవారే, ఈరోజు భూముల ధరలు పడిపోయేసరికి నిరాశ, నిస్పృహతో పోరాటం చేస్తున్నారు. 

 
 తిరుపతి సభకు వచ్చిన పార్టీల కలయిక అనైతికం. కాంగ్రెస్, బీజేపీలు ఎప్పుడైనా కలిసి ఒకే వేదిక మీద వచ్చాయా.. బీజేపీ, కమ్యూనిస్టులు ఎప్పుడైనా ఒకే వేదిక మీదకు వచ్చాయా.. లేదు. ఈరోజు ఎందుకు వచ్చారంటే, బలమైన నాయకుడిగా పరిపాలన చేస్తోన్న జగన్ మోహన్ రెడ్డిగారిని ఎదుర్కోలేక, ఆయన్ని అధికారం నుంచి దించేయాలన్న ఒకే ఒక్క ఎజెండాతోనే వారు కలిశారు. కుట్రలు చేస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా, ప్రజా బలం ఉన్న జగన్ మోహన్ రెడ్డిగారిని ఏమీ చేయలేరు. 

 బ్యాంకులను మోసం చేసి, వేల కోట్లు కొల్లగొట్టిన ఎంపీ రఘురామకృష్ణరాజు బీజేపీకి, టీడీపీకి మద్దతుగా మాట్లాడుతున్నాడు. అతనో అబద్ధాల పుట్ట. అబద్ధాలు చెప్పటంలో చంద్రబాబును మించిపోయాడు. నీతి లేని వ్యక్తి. కేవలం కేసుల నుంచి బయటపడటం కోసం, బీజేపీతో జత కట్టి ఆ ఎంపీ మాట్లాడుతున్నాడు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి.. చంద్రబాబుతో జతకట్టి మరో పార్టీతో అంటకాగుతూ.. ప్రభుత్వంపైనా, జగన్ మోహన్ రెడ్డిగారిపైనా విమర్శలు చేస్తున్నారంటే.. వీళ్ళ నైతికత ఏమిటో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలోనే అమరావతి యాత్ర జరిగింది. టీడీపీకి తోక పార్టీలుగా మాట్లాడుతున్న వారికి ప్రజల మీదగానీ.. రాష్ట్రం మీదగానీ విశ్వాసం లేదు. ఇదొక కుట్రపూరిత రాజకీయం. 

 మూడు రాజధానులకు మేం  కట్టుబడి ఉన్నాం. మూడు ప్రాంతాల అభివృద్ధే మా లక్ష్యం.  ప్రతి ప్రాంతాల్లో వెనుకబాటుతనం పోగొట్టి, అభివృద్ధి చేయాలన్నదే జగన్ గారి విధానం. ఇందులో భాగంగా, న్యాయ రాజధానిగా కర్నూలు, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతే ఉంటుంది.

వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గర ఎంగిలి కూడు తిని, మా పార్టీ సింబల్ మీద గెలిచి ఎమ్మెల్యేలు అయి, టీడీపీ కండువాలు కప్పుకుని మంత్రులుగా అయిన అమర్నాధ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డిలకు మాట్లాడే నైతిక హక్కే లేదు. విలువలు లేని వారి గురించి ఎక్కువ మాట్లాడితే.. మా విలువ తగ్గుతుంది. 

 2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిగారికి 151 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. 50 శాతంపైగా ఓట్లు వచ్చాయి. ఆయన అధికారంలో ఉంటే, ఈ  పార్టీలకు నూకలు చెల్లుతాయన్నదే వారి బాధ. అందుకే వారి కలయికే అనైతికం అని చెబుతున్నాం. ప్రజలు మళ్ళీ మళ్ళీ ఆ పార్టీలకు బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నార‌ని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.

Back to Top