మరో 30 ఏళ్లు మనదే అధికారం 

ఉరవకొండ వైయ‌స్ఆర్ సీపీ అభ్యర్థిని గెలిపించి సీఎంకు కానుకగా ఇద్దాం

క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

ఉరవకొండ వైయ‌స్ఆర్ సీపీ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ఉరవకొండ: 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని వైయ‌స్ఆర్ సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు.175 గెలిస్తే మరో ముప్పై ఏళ్లు మనదే అధికార‌మ‌ని ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఉరవకొండలోని సత్యం కన్వెన్షన్ హల్లో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన వైయ‌స్ఆర్ సీపీ విస్తృత స్థాయి  సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రి పెద్దిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, ఎంపీలు తలారి రంగయ్య, రెడ్డప్ప, జెడ్పీ చైర్ పర్సన్ గిరిజమ్మ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, ఉరవకొండ నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు చిత్తూరు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, యువనేత ప్రణయ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ ఆదేశాల మేరకు రాయలసీమ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయ సమీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత పటిష్టం చేసేందుకు ప్రణాళికలు తయారు చేశామన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి త‌ప్ప‌కుండా న్యాయం జ‌రుగుతుంద‌ని క్యాడర్ కు భరోసా ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో వైయ‌స్ జగన్ ఒక్కరే అని చెప్పారు. ఉర‌వ‌కొండ అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి పార్టీని గెలిపించాలన్నారు. పార్టీలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ పాటించాల్సిందేనని, ఎవరైనా ధిక్కరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎల్లో మీడియా ప్రచారాన్ని నమ్మేస్థితిలో ప్రజలు లేరన్నారు. బీసీలకు పెద్దపీట వేసి వారిని ఉన్నత స్థానాల్లో నిలిపిన ఘనత వైయ‌స్ఆర్ సీపీదే అన్నారు. కలిసి కట్టుగా పనిచేసి ఉరవకొండ వైయస్ఆర్ సీపీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించి ముఖ్యమంత్రికి కానుకగా ఇద్దామన్నారు.

ఉరవకొండ గెలిచి ముఖ్యమంత్రికి కానుకగా ఇస్తాం.. విశ్వేశ్వరరెడ్డి
ఉరవకొండ అసెంబ్లీ స్థానంలో ఈసారి ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి జగ‌న్‌కు కానుకగా ఇస్తామని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కు ప్రజల్లోకి వచ్చే ధైర్యం లేదన్నారు. ఒక్కరోజైనా ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసినా పాపాన పోలేదని విమర్శించారు. హంద్రీనీవా ద్వారా బెలుగుప్ప మండలంలోని చెరువులకు నీళ్లు ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌జాప్ర‌తినిధులు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Back to Top