తిరుపతి: లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆశలతో ముడిపడిన మెగా డీఎస్సీని కూటమి ప్రభుత్వం ‘దగా డీఎస్సీ’గా మార్చేసిందని మాజీ మంత్రి, నగరి నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త ఆర్కే రోజా మండిపడ్డారు. డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో విద్యార్థులు, నిరుద్యోగ యువతతో కలిసి ఆమె భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ.. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా డీఎస్సీ నియామక ప్రక్రియపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. లక్షలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడిందని మండిపడ్డారు. పారదర్శకంగా నిర్వహించాల్సిన మెగా డీఎస్సీని ‘దగా డీఎస్సీ’గా మార్చేశారని విమర్శించారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ అనేక అంశాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో వాటిపై స్వతంత్ర దర్యాప్తు జరగాల్సిందేనని రోజా స్పష్టం చేశారు. ఎస్‌సీఈఆర్‌టీలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసిన వ్యక్తికి అత్యున్నత ర్యాంకు రావడం, స్పోర్ట్స్ కోటా నియామకాలపై వచ్చిన ఆరోపణలు, మెరిట్ జాబితాల ప్రకటనలో పారదర్శకతపై తలెత్తిన సందేహాలు, టీచర్ పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు.. వీటన్నింటిపైనా సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. టీచర్ పోస్టుల కోసం బేరసారాలు జరిగాయంటూ వీడియోలు బయటకు వచ్చినా, ఫిర్యాదులు అందినా అసలు సూత్రధారులను ఎందుకు బయటకు తీసుకురాలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదని భావిస్తే సీబీఐ విచారణకు ఆదేశించేందుకు ఎందుకు వెనుకాడుతోందని నిలదీశారు. డీఎస్సీ వ్యవహారంపై ప్రశ్నిస్తున్న నిరుద్యోగులను బెదిరించడం, క్రిమినల్ కేసుల హెచ్చరికలు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. నిరుద్యోగ యువత గొంతును అణచివేయడం కాకుండా వారు లేవనెత్తుతున్న అనుమానాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. బాధిత అభ్యర్థులు స్వయంగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. నీట్ పరీక్షలో అక్రమాల వ్యవహారంలో కేంద్ర స్థాయిలో బాధ్యత తీసుకున్నట్లుగానే రాష్ట్రంలో డీఎస్సీ వ్యవహారంపైనా బాధ్యత వహించాలని రోజా పేర్కొన్నారు. డీఎస్సీ నియామకాలపై వచ్చిన ప్రతి ఆరోపణను సీబీఐతో నిష్పక్షపాతంగా విచారించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని రోజా విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి, విద్యార్థి సంక్షేమ పథకాల అమలు తదితర అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. డీఎస్సీ నియామకాలపై వచ్చిన ఆరోపణలన్నింటిపైనా సమగ్ర సీబీఐ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. ఈ నిరసన ర్యాలీలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని నినాదాలు చేశారు.