21 మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి  

ఢిల్లీతో పోరాడి మా అధ్యక్షుడు నాడు ఎంపీ పదవికి రాజీనామా చేశారు

మరణించినా వైయస్‌ఆర్‌ ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్నారు

కొడుకును కూడా చంద్రబాబు గెలిపించుకోలేకపోయారు

రాజధాని రైతులకు అనుమానం ఉంటే చర్చకు రండి

మంత్రి కొడాలి నాని  

అసెంబ్లీ: అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని నమ్మకం ఉంటే చంద్రబాబు తన 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణించినా ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్నారని, చంద్రబాబు తన కుమారుడిని గెలిపించుకోలేకపోయారని పేర్కొన్నారు. రాజధాని విశాఖకు వెళ్తే కమ్మ కులస్తులకు వచ్చే నష్టమేమి లేదని ఆయన స్పష్టం చేశారు. సభలో మంత్రి మాట్లాడుతూ..
ఈ బిల్లును ప్రవేశపెట్టినందుకు సీఎం వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు. 
గత ప్రభుత్వం మాదిరిగా ప్రజలను భ్రమల్లో, భ్రాంతుల్లో, ఆకాశంలో విహరించకుండా రాష్ట్ర పరిస్థితులను ప్రజలకు వివరిస్తూ మూడు ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని ముందుగానే ధైర్యంగా చెప్పిన సీఎం వైయస్‌ జగన్‌కు అభినందనలు తెలియజేస్తున్నాను.
చంద్రబాబు, ఆయనకు సంబంధించిన డబ్బా మీడియా, చెత్త పేపర్లు, రకరకాలుగా సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తోంది. అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉందని చెబుతున్నారు. ఇంత అనుభవం ఉన్న వ్యక్తి ఇలాగేనా మాట్లాడేది. రాజధాని ఎక్కడుందని ఆలోచన చేస్తారా? . 
చంద్రబాబు ఆరు నగరాలను చెప్పారు. ఢిల్లీ దేశానికే రాజధాని. ఇది దేశానికి మధ్యలో ఉందా?. అనుభవం ఉన్న వ్యక్తులు కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మద్రాస్‌ మనకు బార్డర్‌లో ఉంది. కన్యాకాకుమారి నుంచి మద్రాసు 800 కిలోమీటర్లు ఉంది. కలకత్తా కూడా బీహార్‌ బార్డర్లో ఉంటుంది. చంద్రబాబుకు క్లారిటీ లేదు. అమరావతిని తాను సృష్టించాను. నేను పెట్టుబడులు పెట్టానని, అందుకే వైయస్‌ జగన్‌ ఇక్కడి నుంచి సెక్రటేరియట్‌ను తరలిస్తే భూముల రేట్లు పడిపోయి ఇబ్బందులు పడుతామన్న ఆలోచన తప్ప..ఈ రాష్ట్ర ప్రయోజనాలు చంద్రబాబుకు పట్టడం లేదు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల గురించి చంద్రబాబు ఆలోచన చేయడం లేదు. అమరావతి అన్నది ఒక మోసం. అమరావతి పుణ్యక్షేత్రం, అమరావతిలో చాలా మంది రాజులు పరిపాలించారు. వాస్తవమే. కానీ ఈ అమరావతి ఇంకా 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాన్ని ఎండబెట్టేశారు. పాడు చేశారు.చంద్రబాబు సృష్టించిన అమరావతి ఇదీ. 
వైయస్ జగన్‌ ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ఈ ప్రాంతంలో రాజధాని పెడతామంటే చాలా స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వ భూమి 30 వేల ఎకరాలు రాజధానికి అవసరం. పేదవారికి ఇంత రేటు అని ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది. ల్యాండ్‌ ఫూలింగ్‌ ద్వారా భూములు సేకరిస్తే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసినవారౌతారు. కాబట్టి ఈ పద్ధతి మాకు నచ్చకపోయినా ..మీరు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ధ్వేషాలు, భావోద్వేగాలు సృష్టించడం ఇష్టం లేదు కాబట్టి మీకు సలహాలు ఇస్తామని చెప్పారు. దానికే కట్టుబడి ఉన్నారు. రాజధాని కడతానని చంద్రబాబు చెప్పారు. రూ.1.96 లక్షల కోట్లకు డీపీఆర్‌లు వేశాడు. ఏ దేశం వెళ్తే ఆ దేశం మాదిరిగా రాజధాని కడుతానన్నారు. ఆ రోజు చంద్రబాబు అన్ని గాలికి వదిలేశారు. నీవు కట్టకుండా వెళ్లిపోతే వైయస్ జగన్‌ కడతానని ఒప్పుకున్నారా?
సెక్రటేరియట్‌, హైకోర్టు తరలిస్తే ఈ ప్రాంతంలో అభివృద్ధి ఆగిపోతుందని చంద్రబాబు చెబుతున్నారు. మొదట రాజధాని మద్రాస్‌లో ఉండేది. తరువాత కర్నూలుకు వచ్చింది. ఆ తరువాత హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల అభివృద్ధి ఏమైనా ఆగిపోయిందా? అమరావతి పెట్టకపోయినా కూడా అన్ని రంగాల్లో విజయవాడ, గుంటూరు జిల్లాలు మొదటి స్థానంలోనే ఉన్నాయి. అమరావతి పెట్టిన తరువాత ఇక్కడున్న రెండు జిల్లాలు అభివృద్ధి చెందాయని ఇతర జిల్లాలకు రాగద్వేషాలు వచ్చేయో కానీ మరేమి లేదు.
సామాజిక వర్గం గురించి మేం ప్రచారం చేస్తున్నామని టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు అంటున్నారు. మేం కాదు ప్రచారం చేసేది..చంద్రబాబు డబ్బా పేపర్లు, చెత్త పేపర్లే. కమ్మ కులాన్ని అణగతొక్కడానికి రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీయడానికి వైయస్‌ జగన్‌ ప్రయత్నిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. ఇక్కడి నుంచి రాజధాని తరలిస్తే దెబ్బతింటారని ఈనాడు చెబుతోంది. ఇలా చెప్పేది ఈనాడులో పెద్ద పెద్ద అక్షరాలతో రామోజీరావు రాస్తున్నారు. కమ్మకుల ద్వేషి, కమ్మ కులాన్ని నష్టపెట్టడానికే రాజధాని తరలిస్తున్నారని వార్తలు రాస్తున్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ డైరెక్ట్‌గా హెడ్డింగ్‌లు పెట్టి రాస్తున్నారు. కమ్మవారిపై ధ్వేషం, కమ్మ కులాన్ని నాశనం చేయడానికి సీఎం వైయస్‌ జగన్‌ కంకణం కట్టుకున్నాడా?. ఈ హెడ్డింగ్‌లన్నీ కూడా సాక్షిలో పెట్టారా? టీవీ5లో బీఆర్‌ నాయుడు ఈ ప్రపంచమంతా తల్లకిందలు అయిపోయినట్లు చూపిస్తుంటారు. ఆయనకు 24 గంటలు ఇదే వార్తలు. ఈ రోజు నేను చెప్పిన ప్రతికాధినేతలు, చంద్రబాబు, ఆయన పార్టీలో ఉన్న కమ్మ సామాజిక వర్గం నేతలు, అలాగే కమ్మ మేధావులు చాలా మంది ఉన్నారు. వీరంతా కూడా సాయంత్రం అయితే చాలు టీవీల వద్దే ఉంటారు. టీవీల్లో తప్ప మరెక్కడా కనిపించరు. అక్కడ కూర్చోని రాష్ట్రం తల్లకిందలు అయిపోయినట్లు చెబుతుంటారు. ఇక్కడ అమరావతి పెట్టింది చంద్రబాబు. ఆయనకు సలహాలు ఇచ్చింది రామోజీరావు, రాధాకృష్ణ వంటి పెద్దలు. ఇక్కడ రాజధాని పెడితే కమ్మ కులం బాగుపడుతుందని వారి ఆలోచన.
విశాఖకు రాజధాని వెళ్తే కమ్మవాళ్లు ఆర్థికంగా, రాజకీయంగా ఏం నష్టపోతారు?  ఇదేం కులం మీద ధ్వేషంతో రాజధాని తరలిస్తున్నారని చెబుతున్నారు. విశాఖలో 2009లో ఎంపీ ఎవరూ? కాంగ్రెస్‌ నుంచి దగ్గుపాటి పురంధేశ్వరి, 2014లో కంభంపాటి హరిబాబు, ఈ రోజు వైయస్‌ఆర్‌సీపీ తరఫున ఎంవీఎస్‌ సత్యనారాయణ ఎంపీలుగా ఉన్నారు. అంతకుముందు మూర్తి రెండు సార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక్కడే ఉన్నారు..పులి మాదిరిగా మీసాలు పెట్టుకొని ఉంటారు.ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాజధాని వెళ్లడం వల్ల మా ఎంపీ, ఎమ్మెల్యే పదవులు పోవు. ఉత్తరాంధ్ర ప్రజలు చాలా మంచివాళ్లు. ఎవరు వెళ్లినా ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా గెలిపిస్తారు..ఆదరిస్తారు. నా వంటి వాళ్లు తట్టబుట్ట సర్దుకొని వెళ్లినా అక్కడివారు ఆదరిస్తారు. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 
విశాఖలో వ్యాపారాల గురించి మాట్లాడితే..అక్కడ నాలుగో ఐదు పైవ్‌స్టార్‌ హోటల్స్‌ ఉన్నాయి. డాల్ఫీన్‌ హోటల్‌ రామోజీరావుదే. దస్పల్లా మాదే.నోవాటేల్‌ మాదే. గ్రాండ్‌వే కూడా కమ్మ కులస్తులదే. అక్కడ ఉన్న 80 శాతం థియేటర్లు కూడా మావే. కార్లు, బైక్‌ షోరూమ్‌లు కూడా మావాళ్లవే. మాజీ సీఎం తనయుడి నారా లోకేష్‌ తోడళ్లుడికి చెందిన  గీతం యూనివర్సిటీ చాలా పెద్ద సంస్థ. వంద ఎకరాల సంస్థ ఉంది. విద్యా సంస్థలు కూడా మావే. స్టూడియోలు ఉన్నాయి. అక్కడున్న వ్యాపారాల్లో 50 శాతం మావాళ్లవే. కమ్మ సోదరులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
వైయస్‌ జగన్‌కు అదే ఉద్దేశం ఉంటే రాజధాని కడపకు వెళ్లేది. లేదంటే కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, దోనకొండకు వెళ్లేది. ఇప్పటిదాక ఒకటే ఉండేది. ఇప్పుడు రెండు వచ్చాయి. రాజకీయంగా బతకాలంటే కమ్మ కులాన్ని అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం చంద్రబాబుకు మాత్రమే ఉంది. చంద్రబాబును అడ్డంపెట్టుకొని నేను చెప్పిన పేపర్‌ అధినేతలు రాష్ట్ర ప్రజలను జలగల్లా పీక్కుతినే అవకాశం ఉంటుంది. జాతి ప్రయోజనాలకు ఇబ్బంది అని పేపర్లు, టీవీలు చెబితే అమాయక ప్రజలు, అందరికంటే ఎక్కువగా నమ్మేది కమ్మ కులస్తులే. వాళ్లు చెప్పగానే రోడ్డుపైకి వచ్చి పోలీసులతో ఈడిపించుకునేది మేమే. 
రాజధాని అమరావతిలోనే ఉండాలని ఇక్కడున్న రెండు జిల్లాల ప్రజలు సీఎం వైయస్‌ జగన్‌ను బెదిరించాలని చంద్రబాబు చెబుతున్నారు. ఆయన బెదిరిస్తే బెదురుతారా?. ఆయనేమైనా చంద్రబాబునా..బెదిరిస్తే..బ్లాక్‌ మెయిల్‌ చేస్తే బెదిరిపోవడానికి. అయినా మేమేందుకు సీఎంను బెదిరించాలి. గుడివాడలో 30 రోజుల నుంచి తిరుగుతున్నాను. పంచాయతీ ఎన్నికలు ఉన్నాయని తిరుగుతున్నాను. చంద్రబాబు కోర్టుకు వెళ్లకపోతే స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్‌ వచ్చేది. గుడివాడ నియోజకవర్గం వెళ్తే నన్ను అక్కడి ప్రజలు నాలుగుసార్లు గెలిపించారు. మాకు తాగడానికి నీళ్లు లేవు. మంచినీళ్లు ఇవ్వమని అడుగుతున్నారు. చేపల చెరువులు ఉన్నాయి. వాళ్లు సముద్రంలోకి నీల్లు వదిలారు. కాల్వలు దెబ్బతిన్నాయి. వాటిని ఆధునీకరిస్తారా? లేదా అని అడుగుతున్నారు. వాస్తవంగా గుడవాడ, కైకలూరు, అవనిగడ్డ ప్రాంతాల్లో చేపల చెరువుల కారణంగా నీరు కలుషితమవుతుంది. రోడ్డు కూడా పూర్తిగా దెబ్బతినింది. కనీసం రూ.150 కోట్లు ఖర్చు అవుతుంది. మేం ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి ఇక్కడే రాజధాని కట్టండి. మా ప్రాంతంలో ఈ అవసరాలు ఉన్నాయని చెబితే..నాడు-నేడు, అమ్మ ఒడికి డబ్బులు ఇవ్వమని అడగగలమా? అమరావతిని ఇక్కడి నుంచి తీసివేయడం లేదు. ఇక్కడే శాసన సభ  ఉంచుతున్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజలు రెండేళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు. హైకోర్టు పెడితే రెండు జిరాక్స్‌ మిషన్లు వస్తాయని అంటున్నారు. రెండు జిరాక్స్‌ మిషన్లకు ఎందుకు ఏడ్చుతున్నారు. రూ.70 వేల కోట్లు అదాని ఇస్తారని, మరొకరు ఎవరో రూ.30 వేల కోట్లు ఇస్తామని చంద్రబాబు చెబుతున్నాడు. అవి తీసుకొచ్చి ఇక్కడపెట్టమని రామనాయుడు చంద్రబాబును అడగాలి. ప్రజలందరూ అమాయకులు, గొర్రెలు మనం ఏది చెప్పినా వింటారు అనే దుస్థితిలో చంద్రబాబు, ఆయన మీడియా పని చేస్తోంది. చంద్రబాబు ఇచ్చిన పసుపు-కుంకుమ, ఆయన రాజకీయ ఉపన్యాసాలు ప్రజలు గమనించారు కాబట్టే ఆయనకు 23 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓట్లు వేస్తారు. మనం రెచ్చగొడితే, మనం జోలె పెట్టి అమరావతిలో అడుక్కుంటే సానుభూతి రాదు. నాబోటి పాపాలబైరవుడు అడుక్కుంటే ఆనందపడుతారు. వీడికేమి ఖర్మ అంటూ ఎవరూ కూడా జాలి చూపించరు. 
మాకు మచిలీపట్నం పోర్టు కావాలి. అలాగే డౌన్‌లో రెండు చెక్‌డ్యాములు కావాలి.పైన ఉన్న వైకుంఠపురం వద్ద బ్యారేజ్‌ కమ్‌ రోడ్డు కవాలి.కృష్ణాడెల్టాకు కాల్వలు ఆధునీకరించాలి. మద్రాస్‌ కలకత్తా హైవే కావాలి. పోలవరం పూర్తి కావాలి. మానకు కూడా వ్యవసాయ ఆధారిత, మత్స్యకార పరిశ్రమలు పెడితే మా పిల్లలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. వెనుకడిన ప్రాంతాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. 
సెల్ఫ్‌ఫైనాన్స్‌ రాజధాని అంటున్నాడు. దానంతకు అదే నిర్మించుకుంటుందట. అదే వాస్తవమైతే రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ పొలాలన్ని రైతులు ఇచ్చేస్తారు. అందరూ త్యాగాలు చేస్తారు. మనం పెట్టుబడి పెట్టకుండా నగరాలు నిర్మించడం సాధ్యమవుతుందా? పగటి వేషగాళ్లు చిన్నప్పుడు వచ్చేవాళ్లు. వాళ్లు సింగపూర్ నిర్మిస్తా అనే వాళ్లు. పిట్టల దొర మాదిరిగా వచ్చేవారు. ఒక వ్యక్తి గతంలో సీఎంగా ఉండగా విజన్‌ 2020 అని చెప్పేవారు. ఇప్పుడేమో 24కు, 29కు, 2050 వరకు అలా చేస్తామని చెప్పుకుంటున్నారు. ఆయనకు 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్నారు. ఇటీవల 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో ఇప్పటికే ఇద్దరు వదిలేశారు. ఇంకా 20 మంది ఉన్నారు. విజన్‌ 2020 అంటే ఇవాళ చంద్రబాబుకు 20 మంది ఎమ్మెల్యేలు మిగిలారు. ఇవాళ కూడా జనవరి 20వ తేదీ. విజన్‌ 420 అయ్యింది. 
సీఎం వైయస్‌ జగన్‌, 151 మంది రాజీనామా చేయాలట. కేసీఆర్‌ తెలంగాణ కోసం రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లారు. రెండుసార్లు ఎన్నికలకు వెళ్లి తెలంగాణ వాదన ఉందని నిరూపించారు. వైయస్‌ జగన్‌కు రాజీనామాలు చేయడం కొత్తనా? పార్టీ పెట్టినప్పుడు ఎంపీ పదవికి రాజీనామా చేయలేదా? మా పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదా?. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాజీనామా చేశారు. 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లి గెలిచారు. ఐదుగురు ఎంపీలతో ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేయించారు. అప్పుడేమో రాజీనామా చేస్తే ఏమి వస్తుందని చంద్రబాబు అన్నారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని ప్రజలు భావిస్తున్నారని మీకు నమ్మకం ఉంటే మీ 21 మంది రాజీనామా చేయండి. మేం 151 మంది రాజీనామా చేస్తే టీడీపీ వాళ్లు మిగులుతారా?. తెలంగాణలో కేసీఆర్‌ చేసినట్లు, వైయస్‌ జగన్‌ చేసినట్లు రాజీనామాలు చేసి టీడీపీ నేతలు మళ్లీ ఎన్నికలకు వెళ్లాలి. దమ్ముంటే నిరూపించండి. 
సోషల్‌ మీడియాలో, డబ్బా చానల్‌లో డైరెక్ట్‌గా మహిళలను, కొంత మంది తాగుబోతులను పోగేసి, మైక్‌ పెట్టి చనిపోయిన వైయస్‌ రాజశేఖరరెడ్డిని, వైయస్‌ జగన్‌ కుటుంబ సభ్యులను బూతులు తిట్టిస్తున్నారు. శాపనార్థాలు పెట్టిస్తున్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి గురించి మాట్లాడుతున్నారు. ఈ దేవాలయం లాంటి చట్టసభలో నిలబడి చెబుతున్నాను. వైయస్‌ రాజశేఖరరెడ్డి లాంటి మరణం కావాలని దేవుడిని అడుగుతాను. పుట్టిన ప్రతి మనిషి చనిపోతాడు. కొంత మంది ప్రమాదంలో చనిపోతారు. కొందరు సహజమరణం చెందుతారు. కానీ చనిపోయినా బతికి ఉండే అదృష్టం ఎంతమందికి వస్తుంది. ఐదేళ్లు సీఎంగా పని చేసి, రెండుసారి సీఎంగా ప్రజల వద్దకు వెళ్తూ ప్రమాదవశాత్తు చనిపోయారు. చాలా గొప్ప మరణం. చనిపోయినా కూడా  ఈ రోజుకు ప్రజల గుండెల్లో బతికిఉన్న దేవుడు వైయస్‌ రాజశేఖరరెడ్డి. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రాన్ని చాలా మంది పాలించారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత ఆయన పేరుతో పార్టీ పెట్టి కడప, పులివెందులలో పోటి చేస్తే..అప్పటి అధికార, ప్రతిపక్ష కాంగ్రెస్‌, టీడీపీలకు డిపాజిట్లు రాలేదు. పార్టీ స్థాపించిన మొదటి ఎన్నికల్లో 67 మంది ఎమ్మెల్యేలు, రెండో ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు గెలిచారు. ఇదంతా వైయస్‌ రాజశేఖరరెడ్డి చేసిన కార్యక్రమాల వల్ల కాదా?. నేనైతే వైయస్‌ఆర్‌ మరణాన్ని కోరుకుంటాను. 70 ఏళ్ల వయసు వచ్చింది. బలమైన పార్టీని లాక్కున్నారు. కొడుకును కూడా గెలిపించుకోలేని బతుకుకంటే చావడం వెయ్యి రేట్లు మేలు.
 వైయస్‌ జగన్‌ మాట తప్పడు..మడమ తిప్పడు. చెప్పిన ప్రతి పథకాన్ని అమలు చేస్తారు. ఆయన అనుకున్నది త్వరితగతిన ప్రజలకు అందించాలని తపన పడే వ్యక్తి. రాజధాని ప్రాంత రైతులు పాపం చంద్రబాబును గుడ్డిగా నమ్మారు. రైతు కూలీలకు రూ.2500 నుంచి రూ.5 వేలు ఇస్తామని సీఎం వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. దళితుల అసైన్డ్‌ భూములకు కూడా సమానంగా ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. దయచేసి ఈ ప్రాంతంలో ఉన్న అక్క చెల్లెమ్మలు, రైతులకు ఒక్కటే కోరుతున్నాను.మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ప్రభుత్వంతో చర్చించేందుకు ముందుకు రండి. వైయస్‌ జగన్‌ మనసున్న ముఖ్యమంత్రి..మీకు తప్పకుండా న్యాయం చేస్తారు. నక్కజిత్తుల, పదవుల కోసం పాకులాడే దొంగలను నమ్మొద్దని, వాళ్ల ట్రాప్‌లో పడొద్దని., మూడు ప్రాంతాలు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్న  సీఎం వైయస్‌ జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నా. కృష్ణా జిల్లాలో మేం అడిగినటువంటి ప్రాజెక్టులు, గుడివాడ నియోజకవర్గానికి కొద్దిగా ఎక్కువగా నిధులు కూడా ఇవ్వమని కోరుతున్నాను.

Back to Top