ప్రజలు ఎప్పుడు కష్టాల్లో ఉంటే .. బాబు సంతోషంగా ఉంటాడు

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి ఫైర్ 

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా:  ప్రజలు ఎప్పుడు కష్టాల్లో ఉంటే చంద్ర‌బాబు సంతోషంగా ఉంటాడని మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు విమ‌ర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలు సంతోషంగా ఉండటం చంద్రబాబుకి ఇష్టం ఉండదని, చంద్రబాబు హేయమైన చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నిన్ను నమ్మం బాబు అని ప్రజలు మరొకసారి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అమలు కావాల్సిన అవసరం ఉంది.. పథకాలు ఆపడానికి చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేశాడని విమర్శించారు. ఈసీ నిర్ణయం ద్వంద వైఖరిగా కనిపిస్తుందన్నారు. 

వృద్ధులకు అందాల్సిన పెన్షన్ విషయంలో ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్‌ను ఓడించాలని ఇపుడు అనేక మంది పిలుపు ఇస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్‌ను ఓడించాలని చెప్పడం వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నారని ఆరోపణలు చేశారు. 14ఏళ్ళు పాలన చేసిన చంద్రబాబుకి తనకంటూ ఒక మార్క్ లేదని మంత్రి తీవ్రంగా విమర్శలు గుప్పించారు.

Back to Top