విజయవాడ: మోసానికి, ద్రోహానికి చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు విమర్శించారు. తన ఐదేళ్ల పాలనలో రైతులకు ద్రోహం చేశారని, వ్యవసాయాన్ని దండగ చేస్తే..సీఎం వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక పండుగ చేస్తున్నారని చెప్పారు.చంద్రబాబు రైతులకు పెట్టిన బకాయిలను కూడా వైయస్ జగన్ చెల్లించారని తెలిపారు. గురువారం విజయవాడలో మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు లాంటి చేతకాని పాలన ఎవరూ చేయలేదన్నారు. రైతులకు రుణాలు మాఫీ చేస్తానని ఓట్లు వేయించుకుని మోసం చేశారన్నారు. ఆయన రైతులపై చిత్తశుద్ధి ఉంటే ఎందుకు రుణాలు మాఫీ చేయలేదని ప్రశ్నించారు. పంట రుణాలపై వడ్డీలు చెల్లించకుండా చంద్రబాబు అన్యాయం చేస్తే..వాటిని సీఎం వైయస్ జగన్ చెల్లించారన్నారు. రైతులకు బాబు చేసిన ద్రోహం ఎవరూ మరవరన్నారు. చంద్రబాబు అబద్ధాలు అలవోకగా మాట్లాడుతారన్నారు. చంద్రబాబు కట్టుకథలు నమ్మే పరిస్థితిలో జనం లేరన్నారు. ఏ రైతు నష్టపోకుండా అన్ని చర్యలు రైతులకు ఏవిధంగా చేయూతనివ్వాలో ఆవిధంగా సీఎం వైయస్ జగన్ ఇస్తున్నారని మంత్రి కన్నబాబు తెలిపారు. ఏ రైతు నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. అన్నిపంటలకు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ధరల స్థిరీకరణకు రూ.3 వేల కోట్లు కేటాయించామన్నారు. రైతులు ఆనందంగా ఉంటే ప్రభుత్వం సక్సెస్ అయినట్టే అని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.