అనంతపురం: ఉచిత పంటల బీమా కోసం రైతు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ–క్రాప్ నమోదు చేసుకుంటే చాలు పంట నష్టపరిహారం అందిస్తున్నామని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. చెన్నె కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత పంటల బీమా పథకం కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. మంత్రి ఏమన్నారంటే..ఆయన మాటల్లోనే.. అందరికీ నమస్కారం, రైతులు ఆరుగాలం శ్రమించి పండించే పంట చేతికొచ్చేలోగా ఏదైనా కారణాల వల్ల నష్టం సంభవిస్తే రైతులపై ఆర్ధిక భారం తగ్గించి అండగా నిలబడడానికి ఖరీఫ్ 2019 నుంచి ఈ రాష్ట్రంలో వైఎస్సార్ ఉచిత పంటల బీమా ప్రారంభించడం జరిగింది. గతంలో బీమా కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్ధితి, చాలా మందికి అవగాహన లేక నష్టపోయిన పరిస్ధితి. కానీ ఇప్పుడు కేవలం ఈ–క్రాప్ నమోదుచేసుకుంటే చాలు... రైతులకు పంట నష్టపరిహారం ఇచ్చే విధంగా సీఎంగారు ఆలోచించి ఈ బీమా పధకాన్ని తీసుకొచ్చారు. రైతు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. గతంలో టీడీపీ హయాంలోని బకాయిలు కూడా చెల్లిస్తూ కూడా బహుశా ఏపీ చరిత్రలోనే ఎన్నడూలేని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ఈ ఒక్క విడతలోనే సీఎంగారి చేతుల మీదుగా రూ. 2,977.82 కోట్ల పరిహారం విడుదల చేస్తున్నారు. అర్హత గల ప్రతీ రైతుకు నియమ నిబంధనలు అనుసరించి చెల్లించాల్సిందేనని మార్గదర్శకాలు ఇచ్చాం. ఇప్పటికే వైఎస్సార్ రైతు భరోసా క్రింద రూ. 23,875 కోట్లు రైతాంగానికి ఇచ్చాం, దానితో పాటు సున్నావడ్డీ పంట రుణాలు ఇస్తున్నాం, ఆర్‌బీకేల ద్వారా విత్తనం నుంచి విక్రయం వరకూ అన్ని విధాల రైతులకు అండగా నిలుస్తున్నాం. వ్యవసాయ సలహా మండళ్ళు ఏర్పాటు చేసి రైతుల సూచనలు, సలహాలు తీసుకుంటున్నాం. ఇటీవల జరిగిన ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో సీఎంగారు బ్యాంకర్లకు స్పష్టంగా చెప్పారు, కౌలు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి అవసరమైన రుణాలు ఇవ్వమని చెప్పారు. వైఎస్సార్ యంత్ర సేవా పథకం క్రింద ఒకే విడతలో 4,000 ట్రాక్టర్లు, దాదాపు 320 వరికోత యంత్రాలను 40 శాతం క్రింద రూ. 175 కోట్ల నిధులు విడుదల చేశాం. ప్రతిపక్షం ఈ రోజు జరుగుతున్న అభివృద్ది, సంక్షేమం చూసి తట్టుకోలేక పనికిమాలిన, పసలేని ఆరోపణలు చేస్తున్న పరిస్ధితిలో ఉంది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని అని నమ్మిన వ్యక్తిగా మన సీఎంగారు రైతు పక్షపాతిగా, రైతులకు అండగా నిలుస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మన సీఎంగారికి ఎల్లవేలలా మీ ఆశీస్సులు అందించాలని ఈ సందర్బంగా కోరుకుంటున్నాను. రైతుసోదరులందరికీ పేరుపేరునా అభినందనలు, ధన్యవాదాలు. పకీరప్ప, రైతు, శ్రీ సత్యసాయి జిల్లా అన్నా, నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది, నేను సన్నకారు రైతును, మీరు ప్రవేశపెట్టిన ఉచిత పంటల బీమా వల్ల నాకు రూ. 9,000 వచ్చాయని అధికారులు చెప్పారు, సంతోషంగా ఉంది. మే నెలలో రైతు భరోసా డబ్బు అందింది. నాకు గత నవంబర్, డిసెంబర్‌లో అధిక వర్షాల వల్ల నష్టపోయిన వేరుశనగకు కూడా రూ. 24 వేలు వచ్చాయి. గతంలో రైతులు వేరుశనగ విత్తనాల కోసం రెండు మూడు రోజులు ఎదురుచూసి పోలీసుల దెబ్బలు తిని తెచ్చుకునే వాళ్ళం కానీ ఈ రోజు మన గ్రామంలోనే ఆర్‌బీకేల ద్వారా మంచి విత్తనాలు అందుతున్నాయి. ఆర్‌బీకేల ద్వారా నాణ్యమైన ఎరువులు కూడా అందుతున్నాయి, సకాలంలో అన్నీ అందడం వల్ల సంతోషంగా ఉన్నాం. ఈ రోజు ఉచిత పంటల బీమా పథకం వల్ల రైతులంతా సంతోషంగా ఉన్నారు, మా రైతులందరి తరపునా మీకు ధన్యవాదాలు. నా కుమార్తె డిగ్రీ చదువుతుంది, నా భార్యకు కూడా వివిధ పథకాల వల్ల లబ్ధి జరిగింది. ఇవన్నీ కలుపుకుంటే నాకు ఒక్క ఏడాదిలో రూ. 90,850 వచ్చాయి, మూడేళ్ళలో మొత్తం రూ. 2.70 లక్షలు వచ్చాయి. ఈ డబ్బు లేకపోతే నేను కూలీనాలి చేసుకుని బతకాల్సి వచ్చేది, నేను ఈ స్ధాయికి ఎదిగాను అంటే మీ దయే. నాడు చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవసాయం దండగ అన్నారు కానీ జగనన్న ప్రభుత్వంలో పండుగ చేసుకుంటున్నాం, రైతులకు ఉగాది పండుగ ఈ రోజే అని ఘంటాపథంగా చెబుతున్నాను. అందరికీ ధన్యవాదాలు, సెలవు.