‘మార్గదర్శి’ అవకతవకలపై సీబీఐ విచారణకు సిద్ధమా?

మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి
 

తాడేపల్లి:  మార్గదర్శిలో అవకతవకలపై సీబీఐ విచారణకు సిద్ధమా? అని మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి స‌వాలు విసిరారు. దమ్ముంటే మార్గదర్శిలో అవకతవకలు జరగలేదని నిరూపించుకోవాలి అంటూ మంత్రి చాలెంజ్ చేశారు.  శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అడ్డగోలు రాతలు రాయడం ఎల్లో మీడియాకు అలవాటైపోయిందన్నారు. నైతిక విలువల గురించి మాట్లాడే హక్కు రామోజీకి లేదు. మార్గదర్శిపై రామోజీరావు పిటీషన్‌ వేయడం హాస్యాస్పదం. మార్గదర్శిలో ఏపీ స్టాంప్స్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ తనిఖీలు చేయొద్దా?. మార్గదర్శిలో అవకతవకలపై సీబీఐ విచారణకు సిద్ధమా?. దమ్ముంటే మార్గదర్శిలో అవకతవకలు జరగలేదని నిరూపించుకోవాలి’’ అంటూ మంత్రి సవాల్‌ విసిరారు. దోచుకునేందుకు చంద్రబాబు కంటే రామోజీకి ఎక్కువ ఆత్రంగా ఉంది. మేం రాసిందే రాత అని రామోజీరావు అనుకుంటే అది భ్రమే. చంద్రబాబును మళ్లీ సీఎం చేయాలనేదే రామోజీ తాపత్రయం. రామోజీ బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాను అని మంత్రి కాకాణి అన్నారు.

తల చెడి రాస్తున్న రాతలవి         
            "నైతికతకు చోటేది..?" అంటూ నాపై వ్యక్తిగతంగా ఈనాడు పత్రికలో రామోజీరావు రాసిన రాతలపై ఒక ప్రజాప్రతినిధిగా, మంత్రిగా, ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టే స్పందిస్తున్నాను. లేకుంటే, ఆ వార్తపై స్పందించాల్సిన అవసరమే లేదు. దురదృష్టం ఏమిటంటే..  ఈయనే జడ్జి అయినట్టు, ఈయనే నేరాన్ని, దోషుల్ని నిర్ధారించినట్లు రామోజీ రాతలు ఉన్నాయి. విమర్శకన్నా ముందు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది కనుకే మీడియా సమావేశం పెట్టాను. నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ కేసులో నా మీద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో హైకోర్టు విచారణకు స్వీకరించి, ఆ కేసును సీబీఐకి అప్పగించడం జరిగింది. ఈ కేసును సీబీఐకు అప్పగించే ముందు, ఫిర్యాదుదారుల్ని, ఆరోపణలు ఎదుర్కొంటున్న మా అందరి అభిప్రాయాలను తీసుకోవడానికి, జాతీయ దర్యాప్తు సంస్థకు ఈ కేసును ఇవ్వడానికి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అంటూ హైకోర్టు నోటీసులు కూడా ఇచ్చింది. ప్రభుత్వం తరఫున, నా తరఫున కూడా వ్యక్తిగతంగా న్యాయవాది హాజరై.. ఈ కేసును ఏ స్వతంత్ర దర్యాప్తు సంస్థకు ఇచ్చినా అభ్యంతరం లేదని చెప్పాం. సీబీఐ విచారణకు ఆదేశించిన రోజే నేను కూడా స్వాగతించాను.  అసలు, ఈ కేసు ఏంటి.. వాస్తవాలు, పూర్వాపరాలు తెలుసుకోకుండా ఈనాడు రామోజీ అడ్డగోలు రాతలు రాస్తున్నాడు. ఈ కేసులో గోవర్థనరెడ్డి మీద విచారణ జరగటం లేదు. నెల్లూరులో కోర్టులో జరిగిన చోరీ కేసులో టీడీపీకి చెందిన కొంతమంది రాజకీయ కక్షతో నా మీద ఆరోపణలు చేశారు. దీనినిబట్టి.. తల పండిన మేధావిలా పైకి కనిపించే రామోజీ.. తల చెడిపోయి రాతలు రాస్తున్నాడేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. 

విచారణ ఎవరిపైన జరగుతుందో కూడా తెలియకుండా రామోజీ రాతలు
        ఆ వార్తలో..  ఒకవైపు ఆయన రాస్తున్నట్టే రాస్తూ... మరోవైపు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయన్నట్టుగా రాతలు రాశారు. ముదిమి వయసులో రామోజీరావు తెలుసుకోవాల్సింది అసలు విచారణ ఎవరిపైన జరుగుతుంది అన్నది. ఎందుకు జరుగుతున్నది అని.  ఆ విషయాలు కూడా తెలుసుకోకుండా, నైతిక విలువల గురించి రామోజీరావు మాట్లాడటం విడ్డూరం. అసలు నా మీద చేసిన ఆరోపణలకు సంబంధించి ఎక్కడైనా, ఎవరైనా ఆధారాలు చూపించారా?. నెల్లూరులో జరిగిన ఒక చోరీ కేసు మీద విచారణ జరిగేటప్పుడు.. నైతిక విలువలు అంటూ నా మీద అడ్డగోలు రాతలు రాయడం దురదృష్టకరం. పచ్చ సిరాతో రామోజీ పిచ్చి రాతలు రాస్తున్నాడు. కేసు పూర్వాపరాల విషయానికి నేను వెళ్ళటం లేదు, ఎందుకంటే కేసు విచారణ జరుగుతుంది కాబట్టి. 
- ప్రభుత్వంపైనగానీ, ముఖ్యమంత్రిగారిపైనగానీ, వ్యవసాయ శాఖపైనగానీ.. అబద్ధాలను, అసత్యాలను పోగేసి రాసే రాతలపై, మేము కూడా నిత్యం ప్రతిఘటిస్తూనే ఉంటాం.  రామోజీరావు అయినా, మరెవరైనా అనుచితమైన వ్యాఖ్యలు, విధానాలు అవలంభించేటప్పుడు ఖండిస్తాం. రామోజీరావు ఇష్టానుసారంగా ఎవరిమీద పడితే వారిమీద, ఏదిపడితే అది రాస్తానంటే.. చూస్తూ ఊరుకోం. ఆయన ఏమైనా ఆకాశం నుంచి దిగివచ్చాడా..?. అందరికంటే ఆయన అతీతుడేమీ కాదు. అందరికంటే గొప్పవాడేమీ కాదు. 

చిట్ ఫండ్ పేరుతో చీట్ చేస్తూ.. నైతికత గురించి కబుర్లా?
        నైతికత గురించి, నైతిక విలువల గురించి మాట్లాడే రామోజీని సూటిగా ప్రశ్నిస్తున్నాను. నిన్ను అడిగేవాడు లేడు,  పేపరు ఉంది కదా అని.. ఏది రాసినా చెల్లుబాటు అవుతుందనుకోవడం నీ భ్రమ. ఒక వేలు మావైపు చూపిస్తే.. నీ వైపు మిగతా నాలుగు వేళ్ళు చూపిస్తున్నాయని రామోజీరావు గుర్తిస్తే మంచిది. వయసులో పెద్దవాడు కాబట్టి, దాంతోపాటు మీడియా అధిపతిగాగా గౌరవిస్తాం కానీ, మాపై  వ్యక్తిత్వ హననానికి పాల్పడితే.. తీవ్రంగా  స్పందిస్తాం. మార్గదర్శికి సంబంధించి రామోజీరావు తెలంగాణ హైకోర్టులో ఒక రిట్ ఫైల్ చేశాడు. అదెంత హాస్యాస్పదంగా ఉందంటే.. ఏపీకి సంబంధించిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులకు తెలంగాణలో ఉన్న మార్గదర్శి సంస్థల్లో సోదాలు, తనిఖీలు చేసే అధికారం లేదని, నిషిద్ధం అని వేశాడు. మరి, నీవు ఎక్కడ కూర్చుని, ఎవరిపైన అడ్డగోలు రాతలు రాస్తున్నావు, మార్గదర్శిని అడ్డు పెట్టుకుని ఎక్కడ చిట్స్ వసూలు చేస్తున్నావు, ఎవరి డబ్బులతో వ్యాపారాలు చేస్తున్నావు, ఎవరి డబ్బులతో అక్రమాలకు పాల్పడుతున్నావు.. ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా రామోజీ..?. నీకు ఫిక్స్ డ్ డిపాజిట్లు వసూలు చేసే అధికారమే లేకపోతే.. నీవు చిట్ ఫండ్స్ పేరుతో ప్రజల డబ్బులను వసూలు చేస్తూ..  నీ సొంత వ్యాపారాలకు ఆ డబ్బులను మళ్ళిస్తున్నది నిజం కాదా..?

రామోజీకి ఛాలెంజ్
        రామోజీకి ఛాలెంజ్ విసురుతున్నాను. మార్గదర్శి చిట్ ఫండ్స్ లో నీవు ఎలాంటి తప్పు చేయలేదని, ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదని నిరూపించుకోవాలనుకుంటే.. నా మాదిరిగా నీవు కూడా మార్గదర్శి అక్రమాలపై సీబీఐ విచారణకు సిద్ధమా..?
- సీబీఐ విచారణకు నీవు సిద్ధమైతే.. నీ ఈనాడు పేపర్లోనే రేపు రాయ్.  కాకాణి గోవర్థనరెడ్డి విసిరిన ఛాలెంజ్ నేపథ్యంలో నేను విచారణకు సిద్ధం అని రాసే దమ్ము నీకు ఉందా..?.  గతంలో కూడా నీ మీద సీబీఐ విచారణ జరపమని కొందరు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో... నీ మనుషుల్ని కోర్టుకు పంపించి విచారణను అడ్డుకున్నావు కదా..?. చిట్ ఫండ్స్ పేరుతో,  నీవు ఎన్ని విధాలుగా మోసాలకు పాల్పడ్డావో, ఎంత అవినీతి అక్రమాలకు పాల్పడ్డావో, మార్గదర్శి సొమ్ము ఎంత దుర్వినియోగం చేశావో ఈరోజు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఆధారాలతో సహా నిరూపిస్తున్నారు. వాటికి సమాధానం చెప్పకుండా, నీతి గురించి, నైతికత గురించి పెద్ద పెద్ద అక్షరాలతో రాతలు రాస్తావా.. నీకు అసలు ఆ అర్హత ఎక్కడిది..?. మీడియా విలువల్ని తుంగలో తొక్కి.. దాన్ని దోపిడీ రంగంగా మార్చింది నీవు కాదా రామోజీరావు..?. ఇవాళ మీ దోపిడీకి, అవరోధంగా జగన్ గారు ఉన్నారు కాబట్టే.. మీరు ఈ ప్రభుత్వం మీద విషం చిమ్ముతున్నారు. మీ దోపిడీని కొనసాగించుకునేందుకు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని ఆరాటపడుతున్నారు. మీడియా వల్లే అధికారం వస్తే..పోతే..  ఇక ప్రజాస్వామ్యం ఎందుకు..?.  2004లో కూడా చంద్రబాబును మళ్ళీ అధికారంలోకి తేవాలని,  వైఎస్ఆర్ గారిని ఓడించడానికి మీరు ఎన్ని తప్పుడు రాతలు రాసినా, విషం చిమ్మినా ప్రజా బలం ముందు మీ కుట్రలన్నీ బలాదూర్ అయ్యాయి. నీ పచ్చ సిరాతో, పిచ్చి రాతలు రాస్తున్నావు కాబట్టే.. నీ పత్రిక సర్క్యులేషన్ పడిపోయింది. గురివింద గింజ సామెతలా.. నీ వెంట్రుకలు తెల్లబడ్డా.. నీ మనసులో కోరికలు, కుట్రలు మాత్రం అలానే ఉన్నాయి. 

రామోజీ ఉడుత బెదిరింపులకు బెదిరేవాడిని కాదు
        రామోజీ ఉడుత బెదిరింపులకు భయపడే వాడిని నేను కాదు.  నీకు చేతనైంది చేసుకో. నీలా తప్పు చేసి,  తప్పించుకుని తిరిగేవాడే కారణాలు చూపుతాడు.  మా మీద నీవు రాసిన రాతలు కంటే అంతకు పదంతలుగా మేం ఘాటుగా మాట్లాడతాం. చేతిలో కలం ఉంది కదా అని.. నీవు రాసిందే రాత అని అనుకుంటే ఇక్కడ కుదరదు.  నీవు రాసినంత మాత్రాన ప్రజలు నమ్మే రోజులు పోయాయి. ఇంకా నా మీద రోజూ బ్యానర్ వార్తలు రాసినా, నేను భయపడను. ఇప్పటికైనా, బుద్ధి తెచ్చుకుని.. విలువలు ఉన్న వ్యక్తిగా మసలుకుంటే బాగుంటుంది. నీ వయసు అన్నా గుర్తుకు తెచ్చుకుని,  చిల్లర వేషాలు వేయడం మానుకుంటే మంచిదని చెబుతున్నాను. 

పంటల పేర్లు కూడా చెప్పలేని పవన్ మాటలు పట్టించుకోం.
 - రైతుల గురించి ఏమాత్రం అవగాహన లేనటువంటి పవన్ కల్యాణ్ రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంటుంంది. పది పంటలు చూపిస్తే.. అందులో 5 పంటలు గుర్తిస్తావా.. వాటి పేర్లు చెప్పగలవా..  అని అనేక సందర్భాల్లో అడిగాం. దానికి సమాధానం లేదు. వ్యవసాయంపై  ఏమాత్రం అవగాహన లేని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
- చంద్రబాబు గజనీలా తయారయ్యాడు కాబట్టి.. పొద్దున ఒకటి.. రాత్రికి ఒకటి మాట్లాడుతున్నాడు. పంట నష్ట పరిహారం విషయంలో.. ఎన్డీఆర్ ఎఫ్ విధివిధానాల ప్రకారం, ఉదారంగా వ్యవహరించమని పంట నష్టపోయిన రైతులకు మానవత్వంతో పరిహారం అందించమని ముఖ్యమంత్రిగారు ఆదేశాలు ఇచ్చారు.  రైతుల విషయంలో మేము అన్నివిధాలా అండగా నిలుస్తాం. అదేదో వేలం వేసిన మాదిరిగా రూ. 40 వేలు ఇవ్వండి, రూ. 50 వేలు ఇవ్వండి అని చంద్రబాబు మాట్లాడటం దిగజారుడు రాజకీయమే.  
- చంద్రబాబు హయాంలో.  రైతులకు ఇవ్వాల్సిన బీమా సొమ్ము బకాయిలను ఎగ్గొట్టాడు. రైతుల ఆత్మహత్యల పరిహారం ఎగ్గొట్టాడు. 
- ప్రాజెక్టులు కడితే.. ఖర్చు తప్ప రాబడి ఉండదు, వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు రైతుల మీద ప్రేమ ఒలకబోస్తే రైతులే నవ్వుకుంటున్నారు.
- రైతుల వరి నారు మళ్ళు ఎక్కడైతే దెబ్బతిన్నాయో.. అక్కడ 80 శాతం రాయితీతో విత్తనాలు ఇవ్వడం ప్రారంభించాం. 
- బుద్ధి, జ్ఞానం, అవగాహన ఈ మూడు లేకుండా.. ధాన్యం సేకరణపై విమర్శలు చేస్తున్నాడు. ధాన్యం సేకరణకు లక్ష్యం ఏముంటుంది.?
- కనీస మద్దతు ధర ఎప్పుడైతే పడిపోతుందో, అప్పుడు ప్రభుత్వ జోక్యంతో ప్రతి గింజా కొనాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అదే మా ప్రభుత్వం చేస్తుంది. లక్ష్యం అని మాట్లాడటమంటేనే.. వారికి వ్యవసాయంపైన అవగాహన లేదని అర్థమవుతుంది. 
- చంద్రబాబుకు ధైర్యం ఉంటే తాను దిగిపోయేనాటికి రైతులకు ఎన్ని బకాయిలు  పెట్టాడో చెప్పమనండి. 

Back to Top