అన్నీ ఓడిన బాబుకు కుప్పంలో ఏం పని..?

కుప్పంలో ఓటు లేని బాబుకు కుప్పం మీద ప్రేమ ఉందా?

చంద్రబాబు దిగజారిపోయి కార్యకర్తలను రెచ్చగొడుతున్నాడు

కార్యకర్తల్ని ఉసిగొల్పి పోలీసులపై దాడి చేయిస్తున్నాడు

ప్రజల రక్షణకు ఇచ్చిన జీవోని హర్షించాల్సింది పోయి రంకెలేస్తున్నాడు

నడిరోడ్డుపై సభలు పెట్టి ప్రజల్ని బలి తీసుకోవడం సమంజసమా..?

చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి ఇప్పటికే ఎందరో అమాయకుల బలి

అధికార దాహంతో చంద్రబాబు నరరూప రాక్షసుడిలా మారాడు

చంద్రబాబు ఎమ్మెల్యేగా కూడా పనికిరాడని ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు.

గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ 

తాడేపల్లి: కుప్పంలో ఓటు హ‌క్కు కూడా లేని చంద్ర‌బాబుకు కుప్పం మీద ప్రేమ ఉందా..? అని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి ర‌మేష్ ప్ర‌శ్నించారు. స్థానిక సంస్థ‌లు, మున్సిప‌ల్ ఇలా అన్ని ఎన్నిక‌ల్లోనూ ఓడిపోయిన చంద్ర‌బాబుకు కుప్పంలో ఏం ప‌ని అని ప్ర‌శ్నించారు. అనుమ‌తులు తీసుకోకుండా రోడ్డు షోలు చేస్తూ ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడుతున్నాడ‌ని మండిప‌డ్డారు. అమాయకులు బలవుతుంటే త్యాగం చేశారని అంటున్నాడ‌ని, బాబు కోసం త్యాగం ఎవరు చేయాలి. ఎందుకు చేయాలి..? అని ప్ర‌శ్నించారు. న‌డిరోడ్డుపై స‌భ‌లు పెట్టి ప్ర‌జ‌ల‌ను బ‌లితీసుకోవ‌డం స‌మంజ‌స‌మా..? అని ప్ర‌శ్నించారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి జోగి ర‌మేష్ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు.

మంత్రి జోగి ర‌మేష్ ఇంకా ఏం మాట్లాడారంటే.. 
చంద్రబాబునాయుడికి పైత్యం బాగా ముదిరిపోయింది. కందుకూరులో 8 మందిని పొట్టన పెట్టుకున్నాడు. గుంటూరులో ముగ్గురిని పొట్టన పెట్టుకున్నాడు. కనీసం మానవత్వపు విలువలు మర్చిపోయి, ఆ చనిపోయిన వ్యక్తుల కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయో కూడా ఆలోచన చేయకుండా చంద్రబాబు ఈ రోజు కుప్పం వెళ్లాడు. అక్కడకు వెళ్లి 14 ఏళ్లు ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు దిగజారిపోయి రంకెలేసి రెచ్చగొడుతున్నాడు. కార్యకర్తల్ని ఉసిగొల్పి పోలీసులపై దాడి చేయిస్తున్నాడు. చంద్రబాబు కుప్పంలో బహిరంగ సభ పెట్టుకుంటాను అని ఎవర్నైనా అనుమతి అడిగావా..? ఎవరైనా నీకు సంబంధించిన వ్యక్తులు పోలీసులు వద్దకు వెళ్లి పలానా చోట సభ పెట్టుకుంటాం అని అడిగారా..? ఏ అనుమతీ కోరకుండా ఈరోజు  పోలీసులపై రంకెలేయడం, కార్యకర్తలను ఉసిగొల్పడం ఎంతవరకు సమంజసమో చంద్రబాబు సమాధానం చెప్పాలి.

వాళ్లు తిరుగుతున్నారు కదా?..
నీ ఎమ్మెల్యేలంతా వారి వారి నియోజకవర్గాల్లో తిరుగుతున్నారుగా చంద్రబాబూ..? తెలుగుదేశం పార్టీకి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. వారిలో ఐదారుగురు పక్కకు వెళ్లిపోయారు...ఓ పదిహేను మంది ఉన్నట్లున్నారు. వారంతా వారి వారి నియోజకవర్గాల్లో తిరగడం లేదా..? వారిని ఈ ప్రభుత్వం ఆపుతోందా..వాళ్లు తిరగడం లేదా..? చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడో అర్ధం కావడం లేదు. అభం శుభం తెలియని అమాయకులు రక్తం చిందిస్తున్నారు. ప్రాణాలు పోతున్నాయి. కందుకూరులో 8 మంది తొక్కిసలాటలో చనిపోతే, గుంటూరులో ముగ్గురు చనిపోయారు. అలా మొత్తం 11 మందిని చంద్రబాబు బలి తీసుకున్నాడు. 

స్వాగతించకుండా రంకెలు.. 
రోడ్లపైనా, పక్కన, మార్జిన్లలో బహిరంగ సభలు, సమావేశాలు నిషేధిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో చదవకుండానే, ఆ జీవోలో ఏముందో తెలుసుకోకుండానే పోలీస్‌ యాక్టు అంటూ చంద్రబాబు రంకెలేస్తున్నాడు. ఇండియన్‌ పోలీస్‌ యాక్ట్‌ 1861 నుంచి అమలు జరుగుతోంది. ఈ రోజుకీ అదే యాక్ట్‌ ప్రకారం పోలీసు కార్యకలాపాలు జరుగుతున్నాయి. రోడ్లపై పబ్లిక్‌ మీటింగులు వద్దని ప్రభుత్వం ఆ జీవోలో చెప్పింది. ప్రజలకు   ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే ప్రభుత్వం ఆ  జీవో ఇచ్చింది. జీవోను రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు హర్షిస్తున్నారు. ప్రతి పక్ష నేతగా చంద్రబాబు కూడా హర్షించాల్సింది పోయి విమర్శలు చేస్తున్నాడు. చంద్రబాబునాయుడు పోలీసుల అనుమతి తీసుకుని ఏదైనా గ్రౌండ్‌ లో మీటింగు పెట్టుకుంటే ఎవరు వద్దన్నారు...? నీకు అనుమతి ఇవ్వకపోతే అప్పుడు అడగాలి.

కుప్పంలోనూ అడ్రస్‌ గల్లంతే..
చంద్రబాబునాయుడు కుప్పం వెళ్లి ఈ కుప్పం నాది అంటున్నాడు. కుప్పంలో చంద్రబాబుకు ఇంత వరకూ ఓటే లేదు. ఇళ్లు, అడ్రస్‌ లేదు. నా కుప్పం అనే చంద్రబాబు ఏం చేశాడో చెప్పాలి. చెప్పుకోడానికి అసలు అక్కడ ఏమీ లేకపోగా..నాది నాది అంటున్నాడు. అక్కడ డిఎస్పీని, పోలీసులను తిట్టి కార్యకర్తలను రెచ్చగొడుతున్నాడు. చీకటి జీవో అంటూ ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై నోరు పారేసుకుంటాడు. నిజానికి కుప్పం ప్రజలు చంద్రబాబును అప్పడంలా మార్చేశారు. ఒక్క పంచాయితీ, ఎంపీటీసీ, జడ్పీటీïసీ స్థానాన్ని కూడా చంద్రబాబు గెలవలేకపోయాడు. చివరికి మున్సిపాలిటీలో కూడా కుప్పం ప్రజలు చంద్రబాబుకు చుక్కలు చూపించారు. కుప్పానికి చంద్రబాబు మేలు చేసి ఉంటే...అక్కడి ప్రజలు ఆయనకు ఎందుకు పాతరేశారో చెప్పాలి. 14 ఏళ్లు చంద్రబాబు అసమర్ధ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కుప్పం వెళ్లి చెత్త వాగుడు వాగుతూ వీరంగం వేస్తున్నాడు. ఆ జీవో తెచ్చిందే చంద్రబాబునాయుడు ప్రజల ప్రాణాలు తీస్తున్నాడనే ప్రభుత్వం ఆ జీవో ఇచ్చింది. 2022 ముగింపులో కందుకూరులో 8 మంది ప్రాణాలు తీసి తన రక్తదాహాన్ని తీర్చుకున్నాడు. 2023 ప్రారంభంలో çప్రజలంతా పండుగ చేసుకుంటున్న వేళ ముగ్గుర్ని బలితీసుకుని రక్త తర్పణం చేశాడు.

నక్కకు నాక లోకానికి ఉన్న తేడా..
చంద్రబాబునాయుడు ఈ జీవో తనను అడ్డుకోవడానికి తెచ్చిన చీకటి జీవో అంటున్నాడు. ఆయన ఏదైనా గ్రౌండ్‌లో మీటింగులు పెట్టుకుంటే ఎవరు అడ్డుకున్నారో చెప్పాలి. రోడ్ల మీద సభలు పెట్టి, సందుల్లో గొందుల్లో సభలు పెట్టి ప్రజల ప్రాణాలు తీస్తున్నాడు. డ్రోన్‌ షాట్ల కోసం, సినిమా షూట్లతీసి పచ్చ పత్రికల్లో చంద్రబాబుకు ఇరగబడి జనం వస్తున్నారని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నీ ముఖారవిందాన్ని చూసి ప్రజలు ఎందుకు వస్తారు చంద్రబాబూ..? మనసున్న ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌. 2 లక్షల కోట్ల సొమ్ము ఒక్క బటన్‌నొక్కగానే అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముల ఖాతాల్లోకి వెళుతున్నాయి. కనీసం ఐదేళ్లలో 20 వేల కోట్లు కూడా ఇవ్వలేని చంద్రబాబు ఎక్కడ? 2 లక్షల కోట్లు అందిస్తున్న సీఎం వైయ‌స్ జగన్ ఎక్కడ?. ఇద్దరి మధ్య నక్కకు, నాక లోకానికి ఉన్నంత తేడా ఉంది. చంద్రబాబును చూసి మేం భయపడాల్సిన అవసరమే లేదు. పారిపోతున్నామని, ఓడించేస్తానని చంద్రబాబు ప్రగల్భాలు పలుకుతున్నాడు. చంద్రబాబునాయుడు చేవ చచ్చిపోయి ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ కుప్పకూలిపోయింది. మోకులు, బుల్డోజర్లు పెట్టినా...దత్త పుత్రుడ్ని తెచ్చుకున్నా చంద్రబాబు ఇక లేవలేడు. చంద్రబాబు కుట్ర రాజకీయాలు, ఆయన నైజం, బుద్ధులు రాష్ట్ర ప్రజలకే కాదు కుప్పం ప్రజలకు కూడా అర్ధం అయ్యాయి. అందుకే చంద్రబాబు కుప్పంలోనూ కుదేలవుతున్నాడు. 

బాబు నైజానికి పేదల బలి..
చంద్రబాబు నైజం వల్ల పేద ప్రజలు చనిపోతున్నారు. చంద్రబాబునాయుడు కుమారుడు లోకేష్‌ మంగళగిరిలో తిరుగుతుంటే మేం ఆపలేదు కదా.. రోడ్లంట గంగిరెద్దులా రోడ్లూడ్చుకుంటూ తిరుగుతున్నాడు కదా..? చంద్రబాబు కుట్ర రాజకీయాల వల్ల, శవాల మీద పేలాలు ఏరుకునే నీచమైన సంçస్కృతి వల్ల, వెన్నుపోటు పొడిచే చరిత్ర కారణంగా పేద ప్రజలు చనిపోతున్నారు. అందుకే ఈ జీవో తీసుకొచ్చాం. దాన్ని రాష్ట్ర ప్రజలు హర్షిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు సభలు పెట్టుకోవచ్చు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏదైనా గ్రౌండ్‌లో పెట్టుకోవచ్చు. కానీ నడిరోడ్డుపై సభలు పెట్టడటం సమంజసమా, ప్రజల్ని బలి తీసుకోవడం సమంజసమా అనేది చంద్రబాబు చెప్పాలి. అలా ప్రజల ప్రాణాలు బలి తీసుకుని త్యాగాలు చేశారు అనడం న్యాయమా చంద్రబాబూ..? చంద్రబాబు కోసం ప్రజలు ఎందుకు త్యాగాలు చేయాలో ఆయనే సమాధానం చెప్పాలి. త్యాగం చేయాలనుకుంటే చంద్రబాబు, ఆయన కుమారుడు, దత్త పుత్రుడు, ఆయన పార్టీలోని నాయకులు చేయాలి. గుంటూరులో ముగ్గురు చనిపోతే ఏమీ తెలియనట్లు హైదరాబాద్‌ వెళ్లిపోయాడు. అక్కడ నుంచి నాకేమీ సంబంధం లేదు అంటున్నాడు. చంద్రబాబు ఫోటోతో చంద్రన్న కానుక, సంక్రాంతి కానుక అంటూ పంచుతుంటే చంద్రబాబు మాత్రం నాకు సంబంధం లేదంటాడు. చంద్రబాబునాయుడు ఇలా ఇంకా ఎంతమందిని బలితీసుకుంటాడోనని ఆ జీవో తీసుకొచ్చారు. దుర్మార్గపు చంద్రబాబు అధికార దాహంతో నరరూపరాక్షసుడిలా మారి ఎందాకైన తెగిస్తాడని, పేద ప్రజల ప్రాణాలు తీస్తాడనే ఈ జోవో తీసుకొచ్చాం. 

వయసు మర్చిపోయిన బాబు..
1861లో ఇండియన్‌ పోలీస్‌ యాక్టు ప్రకారం ఈ జీవో ఇచ్చాం. చేతగాని చవటమ్మ ఏదో చెప్పింది అన్నట్లు చంద్రబాబు ఆ జీవో గురించి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు వయసు మర్చిపోయాడు..ఏం పదవులు చేశాడో కూడా మర్చిపోయి ఎవర్నంటే వారిని తిడుతున్నాడు. మరో వైపు సాక్షి ఛానల్‌ వాళ్లను కొట్టమని చెప్తున్నాడు. కుప్పంలో ఓటరు కాని చంద్రబాబు అడ్రస్‌ గల్లంతు అవడం ఖాయం.

మళ్లీ పరాజయం తప్పదు..
ఏదో ఒక రూపేణ గొడవలు సృష్టించి ప్రభుత్వంపై నిందలు మోపి ముఖ్యమంత్రిని తిట్టాలని చంద్రబాబు రోజూ ఓ కార్యక్రమం పెట్టుకున్నాడు. చంద్రబాబుకు రాబోయే రోజులు చీకటి రోజులే. శవాల మీద పేలాలు ఏరుకోవాలని ఆరాటపుడుతన్న చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని పొత్తులు పెట్టుకున్నా వైయ‌స్‌ జగన్‌ని, వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఏమీ చేయలేడు. చంద్రబాబు నైజం ప్రతి ఒక్కరికీ అర్ధం అయింది కాబట్టి 2024 ఎన్నికల్లో చంద్రబాబు తన కొడుకు, దత్త పుత్రుడితో సహా వారి వారి నియోజకవర్గాల్లో ఘోరంగా పరాజయం మూటకట్టుకోబోతున్నారు. చంద్రబాబు ఎమ్మెల్యేగా కూడా పనికిరాడని ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. 

బాబు బుద్ది మందగించింది..
చంద్రబాబుకు వయసు పెరిగింది కానీ బుద్ది మందగించింది. ఆయనకు చిన్న మెదడు చితికిపోయింది. వయసుతో పాటు మంచి, వ్యక్తిత్వం, విలువలు పెరగాలి కానీ చంద్రబాబుకు పోరంబోకు పనులు తప్ప ఏమీ అబ్బ లేదు. అందుకే ఎన్టీఆర్‌ నుంచి నిన్న గుంటూరు వరకూ దాదాపు 40 మందిని పొట్టనపెట్టుకున్నాడని మంత్రి జోగి రమేష్‌ గుర్తుచేశారు.

Back to Top