ప్రజల గురించి చంద్రబాబు ఏనాడైనా ఆలోచించాడా..?

వయసు, అనుభవం తగ్గట్టు ఏరోజైనా ప్రవర్తించాడా..?

2019లోనే చంద్రబాబుకు చివరి ఎన్నికలు అయిపోయాయి..

2024 తరువాత బాబు మా పార్టీలోకొస్తే ఎమ్మెల్సీ పదవిస్తాం..

కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఎద్దేవా

కర్నూలు: 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఏ ఒక్కరోజైనా ప్రజల గురించి ఆలోచించాడా..? ఎన్నికల సమయం సమీపిస్తుందని మళ్లీ ప్రజల్లోకి వచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నాడు అని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. 2024 చివరి ఎన్నికలు అని మాట్లాడుతున్న చంద్రబాబు.. అప్పుడు కూడా పోటీ చేస్తాడో.. లేదోనని అనుమానం వ్యక్తం చేశారు. కర్నూలులోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి గుమ్మనూరు జయరాం విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి జయరాం మాట్లాడుతూ.. చంద్రబాబు వయసు, అనుభవం పెద్దగా ఉండొచ్చు కానీ, ఆ వయసు, అనుభవంతో ప్రజలకు మంచి చేశాడా..? అని ప్రశ్నించారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజు అయినా ప్రజలను ఆదుకున్నాడా..? అని ప్రశ్నించారు. కేవలం మూడు సంవత్సరాల్లోనే సీఎం వైయస్‌ జగన్‌ కోట్లాది మంది ప్రజలకు మేలు చేశారని గుర్తుచేశారు. కులాలు, మతాలు, పార్టీలు, ప్రాంతాలు చూడకుండా అర్హత ఉన్నవారందరికీ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయని కర్నూలుకు వచ్చి మొసలి కన్నీరు కార్చి వెళ్లిపోయాడని, చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. అసెంబ్లీలో శపథం చేసి వచ్చానని డబ్బాలు కొట్టుకుంటున్నాడని, అసెంబ్లీ నుంచి బాబు బయటకు ఎందుకు వచ్చాడో ప్రజలందరికీ తెలుసన్నారు. 2019లో 23 మంది సీట్లు సాధిస్తే.. ఆ 23లో పట్టుమని 10 మంది కూడా బాబుకు మద్దతిచ్చే పరిస్థితిలేదు కాబట్టే అసెంబ్లీ నుంచి బయటకు వచ్చాడన్నారు.  

2024 నాకు చివరి ఎన్నికలని చంద్రబాబు మాట్లాడుతున్నాడని, బాబు చివరి ఎన్నికలు 2019లోనే అయిపోయాయన్నారు. 2024లో చంద్రబాబు పోటీ చేస్తాడనే నమ్మకు తనకు లేదని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. 2014లో నరేంద్రమోడీతో, 2019లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాడని, 2024లో ఎవరితో పొత్తుపెట్టుకున్నా.. ఓటమి ఖాయమని, అసలు పోటీ కూడా చేస్తాడో లేదోనని అనుమానం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల తరువాత టీడీపీకి చంద్రబాబు రాజీనామా చేసి వెళ్లిపోతే.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని, ఆయన కొడుకు లోకేష్‌ కార్పొరేటర్‌గా కూడా గెలవలేడు కాబట్టి కోఆప్షన్‌ పదవి ఇస్తామని ఎద్దేవా చేశారు.  
 

Back to Top