ఈ గందరగోళానికి సీఎఫ్ఎంఎస్ వ్యవస్థే కారణం

ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి

పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేదు

రూ. 41 వేల కోట్లకు పూర్తి లెక్కలు ఉన్నాయి

సీఎఫ్ఎంఎస్ వ్య‌వ‌స్థ‌ను టీడీపీనే ప్రారంభించింది

 చెల్లింపులన్నీ కేంద్రీకృతం కావడమే సమస్యకు కారణమవుతోంది

బిల్లులు లేకుండా డబ్బులు చెల్లించారనే ఆరోపణల్లో నిజం లేదు

అన్ని వివరాలను ఏజీ కార్యాలయానికి అందిస్తాం

 

విజ‌య‌వాడ‌:  ఆర్థిక వ్య‌వ‌స్థ గంద‌ర‌గోళానికి టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో ప్రారంభించిన సీఎఫ్ఎంఎస్ వ్య‌వ‌స్థే కార‌ణ‌మ‌ని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు.  ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఈ వ్యవస్థను పెట్టారని విమర్శించారు. చెల్లింపులన్నీ కేంద్రీకృతం కావడమే సమస్యకు కారణమవుతోందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనవసరమైన అనుమానాలను ప్రజల్లో రేకెత్తిస్తున్నారంటూ టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ పై  మంత్రి బుగ్గన  మండిపడ్డారు. ఆడిట్ చేసే సమయంలో పలు రకాల ప్రశ్నలు వేయడం సహజమని.. ఆ ప్రశ్నలనే ఆధారంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

ఏవైనా సందేహాలు ఉంటే సమావేశమై పరిష్కరించుకోవచ్చని, గవర్నర్ కు లేఖలు రాయడం, మీడియా సమావేశాలను నిర్వహించడం ద్వారా వచ్చే ప్రయోజనం ఏమిటో అర్థం కావడం లేదని అన్నారు. 

బిల్లులు లేకుండానే డబ్బులు చెల్లించారనే ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. రూ. 41 వేల కోట్లకు పూర్తి లెక్కలు ఉన్నాయని తెలిపారు. నిజాలు తెలుసుకుని ప్రతిపక్షం మాట్లాడాలని హితవు పలికారు. వేల కోట్ల అవకతవకలు జరిగితే సంబంధిత వ్యవస్థలు చూసుకోకుండా ఉంటాయా? అని ప్రశ్నించారు.

రూ. 41 వేల కోట్ల బిల్లుల చెల్లింపులపై ఆడిట్ సంస్థ వివరణ కోరిందని... అన్ని వివరాలను ఏజీ కార్యాలయానికి అందిస్తామని చెప్పారు.  మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి మాట్లాడారు.

గత వారం రోజులుగా రాష్ట్రంలో కొన్ని ఆర్థిక అంశాల పట్ల ప్రతిపక్ష పార్టీ ,  పీఏసీ చైర్మన్‌ పయ్యవుల కేశవ్‌  గవర్నర్‌కు లేఖ రాశారు. కేంద్రానికి లేఖ రాశారు. ఆ స‌మ‌యంలో నేను నియోజకవర్గ పర్యటనలో ఉన్నాను. వీటిని చూసిన తరువాత రెండు అనుమానాలు వచ్చాయి. కామన్‌సెన్స్‌తో ఆలోచన చేద్దాం. రూ.41 వేల కోట్లు అవకతవకలు జరిగితే దేశంలో వ్యవస్థ లేదా?. అంత పెద్ద మొత్తం వద్దులే..రూ.410 నా అకౌంట్‌ నుంచి మీ అకౌంట్‌లో పడితే మరుసటి రోజే బ్యాంకు మేనేజర్‌ సరి చేస్తారు. రూ.41 వేల కోట్లు అవకతవకలు జరిగితే కాగ్‌తో ఆడిటింగ్‌ చేయించాలని ఒక లెటర్‌ చూపిస్తారు. ఆ లెటరే కాగ్‌ లెటర్‌ కదా? ఇంకా ఆడిటింగ్‌ ఎందుకు? కామన్‌సెన్స్‌తో ఆలోచన చేస్తే..ఇంత అమాయకంగా పీఏసీ చైర్మన్‌ ఎలా మాట్లాడుతున్నారు.

ఇంకో డౌట్‌ కూడా వచ్చింది.. మామూలుగా ఇలాంటి అంశాలు యనమల రామకృష్ణుడు మాట్లాడుతారు. ఈయన ఉత్సాహంగా పరుగెడుతున్నాడు. కాలు జారుతాడేనని తెలిసీ సైలెంట్‌గా ఉన్నారా? లేదా ఆయన కూడా ఈ అంశంపై శ్రద్ధ పెట్టలేదా?. పీఏసీ చైర్మన్‌గా మీకు ఏదైనా డౌట్‌ ఉంటే సమావేశం ఏర్పాటు చేయవచ్చు. సమాచారం తీసుకోవచ్చు. రాత పూర్వకంగా ప్రభుత్వం సమాధానం ఇస్తుంది. గవర్నర్‌కు లెటర్, ఢిల్లీకి లెటర్‌ రాస్తున్నారు. అనుభవజ్ఞుడే కదా అని డిటైల్స్‌ తీస్తే..రాష్ట్ర ప్రభుత్వం జమ ఖర్చుల నిర్వాహణపై సంచలన ఆరోపణలు..మరో లేఖ విడుదల చేసిన పీఏసీ చైర్మన్‌ అంటూ వార్తలు.
సర్వసాధారణంగా ఏదైనా ఆడిట్‌ చేసే సమయంలో ఆడిట్‌ సంస్థ ఎన్నో ప్రశ్నలు వేస్తుంది. రూ.41 వేల కోట్లకు వివిధ బిల్లులు జరిగాయి. అధికారికంగా ట్రెజరీ ద్వారా జరగలేదని కొన్ని సందేశాలు వ్యక్తం చేసింది. అవుట్‌ సోర్సింగ్‌కు మనం పెవ్‌మెంట్‌ చేస్తే వాటికి బిల్లులు నేరుగా ఇచ్చాం. మరో కొంత డీజిల్‌ బిల్లులు చెల్లించామని ఉదాహరణగా చెప్పవచ్చు.

ఇంత ఉరిమిన తరువాత ఇంతేనా వర్షం కురిసేది అన్నట్లుగా ఉంది పయ్యవుల కేశవ్‌ తీరు. 
సీఎఫ్ఎంఎస్ సిస్టమ్‌ రాకముందు పేవ్‌మెంట్లు అన్ని కూడా ట్రెజరీ ద్వారా జరిగేవి. ఈ సిస్టమ్‌ వచ్చిన తరువాత అన్ని కూడా స్టాండెడ్‌ సెంట్రలైజేషన్‌ అయ్యింది. సీఎఫ్ఎంఎస్ ప్రారంభమైంది 2018 ఏప్రిల్‌ 4. ఇది ప్రభుత్వానికి వెన్నెముక మాదిరి. దీనికి సీఈవోగా ప్రైవేట్‌ వ్యక్తిని తెచ్చారు. ఎస్‌ఏపీ వాళ్లకు ఇంట్రన్స్‌ చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన వెన్నుముకను తీసుకెళ్లి ప్రైవేట్‌ వ్యక్తికి అప్పగించారు. రూ.300 కోట్లు వారి చేతిలో పెట్టారు. 2019 నాటికి డెవలప్‌ అయి కానీ వ్యవస్థను వదిలి వెళ్లారు. దాన్ని అభివృద్ధి చేసేందుకు ఇంకా సంవత్సరం పడుతుంది. ఆథరైజేషన్‌ అన్నది ప్రోగ్రామ్‌లో భాగంగా ఉండాలి. కాని ఒక్కటి కూడా లేదు. దీన్ని ప్రారంభించింది గత ప్రభుత్వమే.

పీడీ అకౌంట్‌ 15 బిల్లులకు రూ.10,895 కోట్లు–2020–2021
2018–2019లో రూ.19,030 కోట్లు
2019–2020లో  రూ.28,298 కోట్లు
1001 బిల్లులు రీవ్యాల్యుడెటెడ్‌ అయ్యాయి

రైతు భరోసా కార్యక్రమం నుంచి రైతులకు నేరుగా డబ్బులు జమ చేసేందుకు ఈ కూబెర్‌ లేకపోవడంతో ఆర్టీజీఎస్‌ ద్వారా 2,725 కోట్లు జమ చేశాం. కాంట్రా ఎంట్రీ మళ్లీ 8 బిల్లులు రూ.2,727 కోట్లు. రైతు భరోసాకు రూ.4,179 కోట్లు. హెడ్‌ అకౌంట్‌ మార్పు చేయాల్సి వచ్చే సమయంలో ప్రింట్‌ మీడియా, ఎలక్ట్రానిక్స్‌ మీడియాకు చెల్లించే విషయంలో పొరపాటు జరిగినప్పుడు మరో సిస్టమ్‌ ఉంటుంది. 

ఒక ఫండ్‌ సెంటర్‌ నుంచి మరో ఫండ్‌ సెంటర్‌కు షిప్టింగ్‌కు సంబంధించి.. ఉదాహరణకు ఒక ఆఫీస్‌ విజయవాడ నుంచి ఏలూరుకు మారిందనుకుందాం. అలాంటి బిల్లు రూ.61 లక్ష. ఆర్‌ఎల్‌బీ టూ యూఎల్‌ బిల్లు అక్రిడేషన్‌ టు విలేజ్‌ బిల్లులు 44 బిల్లులు రూ.14.32 కోట్లు. కొన్ని ఎన్‌పీఎస్‌ చలానాలు రూ.1051.54 కోట్లు. కొత్త పింఛన్‌ స్కీమ్‌లో కట్‌ కాని బిల్లు ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించిన బిల్లు. జీఎస్టీ బిల్లులు 8602 కాగా, వాటికి రూ.224 కోట్లు, టీడీఎస్‌ టూ జీఎస్టీ రెండు బిల్లులు రూ.8 లక్షలు. అంటే 8 లక్షల నుంచి కూడా క్యాప్షర్‌ చేసి బిల్లు డిటైల్స్‌. ఇది ఎందుకు జరిగిందంటే..సీఎఫ్ఎంఎస్లో కొన్ని ప్రోగ్రామింగ్‌ తేడాలు ఉన్నాయి. వీటిని ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వస్తున్నాం. అసలు దీనికి ముఖ్య కార కులు ఎవరండీ?. ఇంత ఆశ్చర్యంగా ఉంది.

ప్రతిపక్షానికి కూడా బాధ్యత ఉంటుంది. మనం ఏదైనా మాట్లాడితే ప్రజలు ఎలా రిసీవ్‌ చేసుకుంటారన్నది ఆలోచన చేయాలి. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని చూడటం సరికాదు. ప్రజల తరఫున ఏదైనా తప్పు జరిగితే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కానీ..ఉద్దేశపూర్వకంగా మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్‌. వీళ్ల ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదు. 

రూ.17 వేల కోట్ల గురించి మాట్లాడాల్సి వస్తే..తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సాపై అప్పు అంటే ఒప్పుకుంటారా? అప్పుల్లో కనికట్టు..కాసుల వేటలో ఓడిపోయే..అప్పు పుట్టే దారేది? ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని బద్నామ్‌ చేసేందుకే.

కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటీవల ఓ లేఖ వచ్చింది. ఏడాదికి మన రాష్ట్రం తరఫున ఇంత అప్పు చేయాలంటే పర్మిషన్‌ ఉంటుంది. స్థూల ఉత్పత్తి మీద ఒక శాతం ఆధారంగా అప్పు తీసుకోవచ్చు. లక్ష కోట్లపై 3 శాతం అప్పు చేసేందుకు అవకాశం ఉంటుంది. రూ.10 లక్షల కోట్లు ఉంటే రూ.30 వేలు అప్పు చేయవచ్చు. ఇందులో తెలంగాణ వాటాకు చేయాల్సిన రీ పేవ్‌మెంట్‌ కూడా కలిసినట్లు ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. మేం పరిశీలిస్తే..రాష్ట్ర విభజన సమయంలో అప్పులు తెలంగాణ చెల్లించినా, మనం చెల్లించినా కూడా రెండు కూడా మన రాష్ట్రం నుంచే కట్‌ అవుతాయి. ఆ తరువాత కాంట్రా ఎంట్రీ మనకు వస్తుంది. ఇది అందరి నోటీసులో ఉంటుంది. ఏజీ ఆఫీస్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. అప్పు పరిమితకి తోడుగా మనం తిరిగి కట్టే అప్పు కూడా తిరిగి ఇస్తారు.తెలంగాణ అప్పు కూడా కలిసి వచ్చిందని ఆ లేఖలో పేర్కొన్నారు. 

2016– 2017లో రూ.5622 కోట్లు అప్పు తిరిగి కట్టాలి. ఇందులో తెలంగాణ వాటా రూ.1283 కోట్లు 
2017–2018లో రూ.9450 కోట్లు ఉంది..తెలంగాణ వాటా రూ.2771 కోట్లు
2018–2019లో రూ.13544 కోట్లు కాగా, తెలంగాణ వాటా రూ.4557 కోట్లు 
2019–2020లో రూ.18265 కోట్లు కాగా, ఇందులో తెలంగాణ వాటా రూ.6411 కోట్లు 

తెలంగాణ వాటా కూడా పొరపాటున మన రాష్ట్రంలో ఎంట్రీ అయ్యింది. దీనికి కూడా పర్మిషన్‌ వచ్చింది కాబట్టి దాన్ని తగ్గించుకుంటాం..మీరు హెచ్చించుకోండి అంటూ లెటర్‌లో పేర్కొన్నారు. ఇది పొరపాటు అయ్యింది. లెటర్‌ రాసిన వారికి కూడా ఈ పొరపాటు తెలియదు. వాస్తవానికి ..మనకు 2016–2017లో అప్పు తీసుకునేందుకు రూ.24418 కోట్లు, 2017–2018లో రూ.33,244 కోట్లు, 2018–2019లో రూ.41,113 కోట్లు, 2019–2020లో రూ.53576 కోట్లు, 2020–2021 రివైజ్డ్‌ అకౌంట్‌లో రూ. 63,167 కోట్లు ఇవి మనకు అప్పుగా తీసుకునేందుకు వచ్చిన హక్కు..ఎలిజిబులిటీ. కానీ మనం వాస్తవానికి తీసుకునేది..2016–2017లో అప్పు తీసుకున్నది రూ. 21,229 కోట్లు, 2017–2018లో రూ. 25429 కోట్లు, 2018–2019లో రూ.  కోట్లు, 33,554 2019–2020లో రూ. 45,645 కోట్లు, 2020–2021లో రూ.54,629 అంటే వాళ్లు ఇచ్చిన పరిమితి కంటే చాలా తక్కువగా అప్పు తీసుకున్నాం. తెలంగాణ వాటా కట్‌ చేసి అప్పు తీసుకున్నామని ఈ లెక్కలు చూస్తే నిర్ధారణ అవుతుంది.

మరి ఎందుకు పెరిగాయంటే..ఎవరైతే ఆరోపణలు చేశారో..వారి నుంచే ఇవన్నీ జరిగాయి. వారికి ఆలోచన చాలా తక్కువగా ఉంది. గతంలో గురువుగారు సోమయాజులు వీళ్ల గురించి చెప్పేవారు. ఏం మాట్లాడకపోయినా ఫర్వలేదు కానీ, ఏదైనా మాట్లాడితే సబ్‌స్టేన్స్‌ఉండాలి..లేదంటే పొరపాటు చేసినట్లు అవుతుందని చెప్పేవారు. వీళ్లు ఎందుకు అంత ఆవేశపడుతున్నారో అర్థం కావడం లేదు.
పబ్లిక్‌ అకౌంట్‌లో ఎన్నో ట్రాన్సాక్షన్‌లో టెంపరరీగా ఉంటాయి. ఇందులో  వీరు ఎంత డ్రా చేశారంటే..2016–2017లో రూ.  4803 కోట్లు ఎక్స్‌ట్రా డ్రా చేశారు, 2017–2018లో  రూ.1040 కోట్లు, ఎన్నికల సంవత్సరంలో 2018–2019లో రూ. 10,574 కోట్లు,  మన ప్రభుత్వం వచ్చిన తరువాత  2019–2020లో రూ.6953   కోట్లు, 2020–2021లో రూ. 56602 కోట్లు మాత్రమే..ఈ మొత్తం రూ.17 వేల కోట్ల పరిమితి ఉంటే ఇందులో గత ప్రభుత్వానిది రూ.16,419 కోట్లు ఉంది. రూ.392 కోట్లు మాత్రమే మన ప్రభుత్వానిది. రూ.1013 కోట్లు ఉదయ్‌ స్కీమ్‌తో లాస్‌ వస్తుయనే ఉద్దేశంతో వాళ్లు ప్రోవిజన్‌ పెట్టారు. లాస్‌ లేదు కాబట్టి ఆ ప్రోవిజన్‌ వచ్చింది. ఇంత క్లియర్‌గా ఉన్నాయి.

తెలంగాణ వాటా కూడా మనమే వాడుకుంటున్నామట. పక్క రాష్ట్రంతో సఖ్యతగా ఉండటం వీళ్లకు ఇష్టం లేనట్లుగా ఉంది. టీడీపీ నేతల వ్యాఖ్యలు అంచు డాబే కానీ పంచ డాబు ఉండదు. 
అప్పుల్లో కనికట్టు అంటున్నారు..ఉన్న పరపతి కూడా వీళ్లే తీసేలా ఉన్నారు. అప్పు చేస్తే తప్పేంటి? పరిమతి లోపే అప్పు చేస్తున్నాం. 2019–2020లో ఎకానమీ స్లో డౌన్‌ అయ్యింది. 2021 కోవిడ్‌ వచ్చింది. సామాన్య మానవుడిని కాపాడుకునేందుకు, ప్రభుత్వం అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి. మీరు అప్పు చేయలేదా?. మా ప్రభుత్వం చేసిన అప్పు పేదవాడి అకౌంట్లలో కనిపిస్తుంది. మీరు చేసిన అప్పు ఎక్కడుందో చెప్పగలరా? వైజాగ్‌లో సమ్మిట్‌ పెట్టారు..ఎన్ని పరిశ్రమలు వచ్చాయో టీడీపీ నేతలు చెప్పగలరా? . ఎంవోయూ అంటారు. క్యాన్సర్‌ ఫౌండేషన్‌లో 1.50 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. పేషేంట్లు వస్తారు కానీ, అన్ని ఉద్యోగాలు ఎలా వస్తాయని ఆ రోజే నేను అసెంబ్లీలో గత ప్రభుత్వాన్ని ప్రశ్నించాను. సమ్మిట్‌లో పాల్గొన్న వ్యక్తి షూట్‌ వేసుకుని కింద చెప్పులు తొడుకున్నారు. హైదరాబాద్‌లో ష్వెట్టర్లు అమ్మే వారిని తీసుకొచ్చారేమో అన్న అనుమానం కలిగింది. చైనా అంటే నమ్ముతామేమో అన్నట్లుగా టీడీపీ నేతలు వ్యవహరించారు. 
  
2019–2020లో ఏపీ స్థూల ఉత్పత్తిలో అప్పు శాతం  4.08, 
2020–2021లో 5.51 ఉంది. 
2019–2020లో కేంద్రం అప్పు శాతం 4.60 ఉంటే, 2020–2021లో 9.50 ఉంది. 
మనం 5 శాతం ఉంటే కేంద్రం 9 శాతంలో ఉంది. కొన్ని రాష్ట్రాలు బాగా ఉన్నా..కేంద్రం పరిస్థితి ఇలా ఉంది గమనించండి.  
2014–2019లో టీడీపీ తీసుకున్న అప్పు  18.36  అప్పు(సీఏజీఆర్‌) గ్రోత్‌ రేట్   ఉంటే.. కేంద్రం తీసుకున్న అప్పు గ్రోత్‌రేట్ 8. 84 శాతం. 

కేంద్ర ప్రభుత్వం రెండేళ్లలో సీఏజీఆర్‌ గ్రోత్‌ రేట్‌ 15.26 అయితే మన ప్రభుత్వం 16 శాతం మాత్రమే. అంటే మనం కేంద్రం సమానంగా ఉన్నాం. గత ప్రభుత్వం కేంద్రం కంటే ఎక్కువగా అప్పు తీసుకుంది.  

సామాన్య మానవుడిని కాపాడుకునేందుకు, కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు అప్పులు చేయాల్సి వచ్చింది.  2020–2021లో రాబడిలో వెనుకబడ్డాం. కేంద్రం పరిస్థితి కూడా  అలాగే ఉంది. 
సామాన్య మానవుడి పరిస్థితి చూసేందుకు కొన్ని పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుంది. అమ్మ ఒడి, రైతు భరోసా, వైఎస్‌ఆర్‌ చేయూత, ఆరోగ్యశ్రీ, వాహన మిత్ర, మత్స్యకార భరోసా వంటి పథకాలతో నేరుగా లబ్ధిదారులకు డబ్బులు జమ చేశాం.

గతంలో చంద్రబాబు ఏమన్నారో గుర్తు చేసుకుందాం..వ్యవసాయం దండగ, సబ్సిడీలు పులి మీద స్వారీ, ఉచితంగా ఏది ఇవ్వడానికి వీల్లేదు. యూజర్‌ చార్జీలు పెట్టాల్సిందే. ప్రతి ఏటా డావోస్‌కు వెళ్లాల్సిందే. ఇటలీకి వెళ్తే మీరే మా ప్రధాని అంటారని ప్రచారం చేసుకున్నారు. రుణమాఫీ రూ.87 వేల కోట్లు చేయాల్సి ఉండగా ముక్కి ముక్కి రూ.24 వేల కోట్లకు కుదించారు. బాబు వస్తున్నాడు అంటూ భ్రష్టు పట్టించారు. మా ప్రభుత్వం చెప్పినా, చెప్పకపోయినా భ్రష్టు పట్టించలేదు. మా నాయకుడు రైతు భరోసా కింద చెప్పిన దానికంటే అధికంగా ఇస్తున్నారు. కష్టాలు ఉన్నాయి..కాదనలేం కదా?. ధాన్యం సేకరణ, విత్తనాల సబ్సిడీ, విద్యా దీవెన, ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. యువనేస్తం ఎన్నికలకు ఏడాది ముందు రూ.273 కోట్లు ఇచ్చారు. 

రుణమాఫీని ఓటాన్‌ అకౌంట్‌లో పెట్టలేదు. మనం జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చాం. కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం. ఢిల్లీ వెళ్లండి..మన రాష్ట్రాన్ని మెచ్చుకుంటున్నారు. నీతి అయోగ్‌ కూడా మనల్ని మెచ్చుకుంది.

టీడీపీ నేతలు ఎందుకు ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండి అని మా ఏరియాలో చెబుతుంటారు. అర్థం ఉందా? ప్రజలను భయాందోళనకు గురి చేయవద్దు. అవసరమైన సలహాలు ఇస్తే బాగుంటుంది. టీడీపీ నాయకులు చేసే ఆరోపణలు అర్థరహితమని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఖండించారు. ఉద్యోగుల జీతాలకు ఇబ్బందేమి లేదని స్పష్టం చేశారు.
 

Back to Top