అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాలకు అందిస్తాం

గతం కంటే మిన్నగా అమరావతి రైతులకు సాయం

కౌలు పదేళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచుతున్నాం

ఇప్పటి వరకు వేసిన కమిటీలన్నీ వికేంద్రీకరణ జరగాలని సూచించాయి

అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం కట్టుబడి ఉన్నారు

మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

 

అసెంబ్లీ: పరిపాలన వికేంద్రీకరణతో సామాజిక, ఆర్థిక అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాలకు అందేలా చూడడమే పరిష్కారం అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై వేసిన అన్ని కమిటీలు, కేంద్ర ప్రభుత్వం వేసిన శివరామకృష్ణన్‌ కమిటీతో సహా అన్ని పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని సూచించాయన్నారు. జీఎన్‌రావు కమిటీ, బోస్టన్‌ గ్రూపు కమిటీ నివేదికలను పరిశీలన చేసిన హైపవర్‌ కమిటీ 13 జిల్లాలకు అభివృద్ధి ఫలాలు అందాలని ప్రభుత్వానికి సూచించడం జరిగిందన్నారు.

అసెంబ్లీలో మంత్రి బొత్స సత్యనారాయణ ఏం మాట్లారంటే.. ‘రాజధాని కోసం గతంలో సీఆర్‌డీఏ చట్టాన్ని చేశారు కానీ, ప్రజల అసమానతలను తొలగించేందుకు ఆ చట్టం ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం. ఒకే ప్రాంతంలో అభివృద్ధి తీసుకువచ్చి మూడు ప్రాంతాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకోకుండా వారు ఆ కార్యక్రమాన్ని చేశారని రాష్ట్ర ప్రజలకు తెలుసు. గత చరిత్రను కూడా పరిగణలోకి తీసుకొని విభజన తరువాత రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ఉండాలని కేంద్రం శివరామకృష్ణన్‌ కమిటీని ఏర్పాటు చేసింది. కానీ వారు ఇచ్చిన సిఫారస్సులు, సూచనలు పరిగణలోకి తీసుకోకుండా.. ఏక నిర్ణయంతో, సభలో బలం ఉందనే ఉద్దేశంతో అమరావతిని రాజధానిగా గుర్తించి సీఆర్‌డీఏని తీసుకువచ్చారు. దాంట్లో జరిగిన అవకతవకలు, లోపాలు ఆర్థిక మంత్రి బుగ్గన వివరించారు.  మన పరిస్థితి ఇంతే.. మనకు మేలు జరగదా.. జీవన ప్రమాణాలు పెరగవా.. అని వెనుకబడిన ప్రాంతాలు ఆందోళన చెందాయి. మొన్న జరిగిన ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేశాం. అభివృద్ధి అంటే అన్ని ప్రాంతాలకు చేరాలి. 13 జిల్లాలు, 5 కోట్ల మందికి చెందాలని, ఒక్క వర్గానికి, ప్రాంతానికి అనే అంశాలు రాకుండా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన బిల్లును కూడా ప్రవేశపెట్టడం జరిగింది.

ఈ దశలో ఈ రాష్ట్రం తాలూకా సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకోవాలనే నిర్ణయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కేటీ రవీంద్రనాథ్‌ నేతృత్వంలో ఒక కమిటీని వేసింది. వారితో పాటు బోస్టన్‌ కన్సల్టెంట్‌ కమిటీని వేసింది. ఆ రెండు కమిటీలు నివేదికలు ఇచ్చాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ప్రణాళిక రూపొందించేందుకు హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీలో మంత్రులు, ఉన్నతాధికారులందరికీ భాగస్వాములను చేసి నివేదిక ఇవ్వమని ప్రభుత్వం కోరింది. ఈ నెల 17వ తేదీన హైపవర్‌ కమిటీ ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారం చరిత్రాత్మకమైన చట్టాలు, ప్రజల మనోభావాలు పునరావృతం కాకుండా అందరికీ సమగ్ర అభివృద్ధి జరగాలని కమిటీ ప్రభుత్వానికి సూచించింది. పరిపాలన వికేంద్రీకరణతో సామాజిక, ఆర్థిక పురోభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాలకు అందేలా చూడడమే పరిష్కారం అని కమిటీ పరిశీలన చేసి ప్రభుత్వానికి సూచన చేసింది.

పరిమితమైన వనరులు, ఆర్థిక పరమైన ఒత్తిడులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని 13 జిల్లాలకు అభివృద్ధి ఫలాలు అందాలని గట్టిగా కమిటీ ప్రభుత్వానికి సూచన చేసిన నేపథ్యంలో సీఆర్‌డీఏను రద్దు చేస్తూ.. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేస్తూ వారితో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు, అగ్రిమెంట్లు, బాండ్లు అన్నింటికీ కట్టుబడి కార్యక్రమాలు మిన్నగా చేసేందుకు హైపవర్‌ కమిటీ సిఫారస్సు చేసింది.

గత ప్రభుత్వంలో 28 వేల మంది రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారో.. ఆ రైతులకు ఇచ్చే రూ.2500 సాయాన్ని రూ.5 వేలకు పెంచాలని, పట్టా భూమి రైతులకు అసైన్డ్‌ రైతు అయితే 800 గజాలు, వంద గజాలు వాణిజ్య ప్లాట్‌ అని, అదే పట్టా రైతుకు అయితే 1000 గజాలు, 250 గజాలు వాణిజ్య ప్లాట్‌ ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రకారం అసైన్డ్‌ రైతుకు కూడా 1000 గజాల నివాస స్థలం, 200 గజాలు వాణిజ్య స్థలం పెంచి ఇవ్వాలని నిర్ణయించాం. వీటితో పాటు కౌలు కూడా ఇస్తున్నాం. జరీబు భూములు రూ.50 వేలు, మెట్ట భూములకు రూ.30 వేలు ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రకారమే ప్రతి సంవత్సరం జరీబు భూములకు రూ.5 వేలు, మెట్ట భూములకు రూ.3 వేలు పెంచాలని ఒక నిబంధన పెట్టారు. ఆ ప్రకారం ఇవాల్టి వరకు ఇస్తున్నాం. దాని కాలపరిమితి 10 సంవత్సరాలను సీఎం వైయస్‌ జగన్‌ 15 సంవత్సరాలకు పెంచారు. జరీబు భూములకు కౌలు పది సంవత్సరాలు పోయిన తరువాత రూ. లక్షల అవుతుంది. అదే మెట్ట భూమి అయితే రూ.60 వేలు అవుతుంది.

ఒక ఎకరంలోపు భూమి ఇచ్చిన వారు 19,970 మంది, అదే 1–2 ఎకరాలు ఇచ్చిన వారు 4,214 మంది, 2–5 ఎకరాలు ఇచ్చిన వారు 3,209 మంది, 5–10 ఎకరాలు ఇచ్చిన వారు 529, 10–20 ఎకరాలు ఇచ్చినవారు 264, 20–25 ఎకరాలు ఇచ్చినవారు 23 మంది, 25 ఎకరాలకు పైబడి ఇచ్చిన వారు 17 మంది రైతులు. 28,526 మంది భూములు ఇచ్చారు. సుమారు 14 వేల మంది రైతులనుంచి భూములు కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఇచ్చారు. ఈ 28 వేలలో 14 వేల మంది నిజమైన రైతులు. అయినా అందరికీ పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల ముసుగులో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని ప్రతిపక్షం కుట్రలు చేస్తుంది.

2004లో వైయస్‌ఆర్‌ చేసిన అభివృద్ధి వలన విజయనగరం జిల్లాల్లో కొంతైనా పంట పండుతుంది. ఇవాళ ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. కమిటీలు విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ చేయాలని రికమెండ్‌ చేశాయి. విశాఖ, రాయలసీమ అభివృద్ధి అవసరం లేదని ప్రతిపక్షాన్ని చెప్పమనండి. విశాఖలో ఒక్క ఎకరం నా పేరు, నా కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నా దేనికైనా సిద్ధమే. అందరూ చంద్రబాబులా ఉంటారనుకుంటే ఎలా..? ఈ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధి, 5 కోట్ల మంది ప్రజల కోసం అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రతీ కార్యక్రమానికి ప్రజల మద్దతు ఉంది. జోలె పట్టుకొని చంద్రబాబు తిరుగుతున్నాడు. విశాఖను రాజధానిగా చేయాలని మా ప్రాంతం, మేము అడుగుతున్నాం. చంద్రబాబు ఉద్దేశం ఏంటంటే.. ఆయనకు జ్వరం వస్తే రాష్ట్రానికి వచ్చినట్లుగా.. ఆయన బాగుంటే రాష్ట్రమంతా బాగున్నట్లుగా క్రియేట్‌ చేస్తాడు. రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చింది చంద్రబాబు కాదా.. సూటిగా ప్రశ్నిస్తున్నాను.

ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ పెట్టి వైయస్‌ఆర్‌ దేశ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. అదే విధంగా నవరత్నాలు తీసుకువచ్చి సీఎం వైయస్‌ జగన్‌ ప్రజలకు మేలు చేస్తున్నారు. ఏ వర్గం, ఏ కులం, ఏ ప్రాంతం అనే తేడా లేకుండా ఆంధ్రరాష్ట్ర ప్రజలంతా సుఖంగా ఉండాలి.. జీవన ప్రమాణాలు మారాలని ప్రభుత్వం కోరుకుంటుంది. ఇవాళ రైతులు చేస్తున్న ఆందోళనను గుర్తించి ఆ రైతులకు అంతకంటే మంచిగా పెంచి ఇస్తూ వారికి కూడా మంచి జరగాలని, అమరావతిని కూడా అభివృద్ధి చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ కోరుకుంటున్నారన్నారు.

తాజా వీడియోలు

Back to Top