గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం సాగిస్తాం

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలి

కార్మిక సంఘాలతో కలిసి రాజీలేని పోరాటం చేస్తాం

విశాఖ అభివృద్ధిని అడ్డుకుంటున్న బాబుకు సబ్బంహరి మద్దతు

సబ్బంహరికి సిగ్గు, లజ్జ ఉంటే టీడీపీకి రాజీనామా చేయాలి

మంత్రి అవంతి శ్రీనివాస్‌

విశాఖ: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని మంత్రి తెలిపారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని తెలిపారు. విశాఖలో ఎంపీలు విజయసాయిరెడ్డి, సత్యనారాయణలతో కలిసి అవంతి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం. ఈ రోజు ప్రతిపక్ష నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఏమాత్రం ఆమోద యోగ్యం కాదు. గతంలోనే ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో కేంద్ర మంత్రులను కలిశారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రధానికి లేఖ రాశారు. ఈ రోజు కూడా లేఖ రాశారు. ప్రధాని  అపాయింట్‌మెట్‌ ఇస్తే కార్మిక సంఘాలు, అఖిలపక్ష నేతలతో ఢిల్లీవెళ్లి కలుస్తారు. స్టీల్‌ ప్లాంట్‌ అన్నది రాష్ట్ర ప్రజల సెంటిమెంట్‌. విశాఖ ఉక్కు– ఆంధ్రుల హక్కు.

విభజన చట్టంలోని హామీలన్ని నెరవేర్చకుండా దేశంలో పాలసీలు తీసుకొని..వాటి ప్రకారం స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడం సరికాదు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకపోతే ..కరెంటు, మంచినీరు ఇవ్వకుండా ఏ పరిశ్రమ అయినా నడుస్తుందా? మన ప్రాంతంలో పరిశ్రమ వస్తే వేలాది మందికి ఉపాధి దొరకుతుందని, విద్యా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఇక్కడ భూములు ఇచ్చారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. 100 శాతం వాటాను అమ్మేస్తామని, పార్లమెంట్లో బలం ఉందని ఏదైనా చేస్తామంటే సరికాదు. అఖండ భారత దేశం అని చెప్పే బీజేపీ నేతలు ఆంధ్రుల సెంటిమెంట్‌ను గౌరవించాల్సిన బాధ్యత లేదా? స్థానిక బీజేపీ నేతలు, పవన్‌ కళ్యాణ్‌ ఈ విషయంలో స్పందించాలి. ఎంత సేపు కేంద్రాన్ని ప్రశ్నించకుండా వైయస్‌ జగన్‌పై విమర్శలు చేస్తే మీకు వచ్చే ప్రయోజనం ఏంటి? రాబోయే రోజుల్లో కూడా ఈ ఉద్యమానికి ప్రజా మద్దతు, మా మద్దతు ఉంటుంది. వైయస్‌ జగన్‌ తప్పనిసరిగా ప్రధాని అపాయింట్‌మెంట్‌ తీసుకొని కార్మిక నేతల ముందే మాట్లాడుతారు. కొందరు ఈ రోజు మీడియా ముందుకు వచ్చి మాపై విమర్శలు  చేస్తున్నారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కోసం మేం విశాఖలో పాదయాత్ర చేశాం. ఢిల్లీలో కూడా పోరాటం చేస్తాం. ఐదు కోట్ల మంది ప్రతినిధులుగా వైయస్‌ జగన్‌ ఇవాళ ప్రధానికి మరోసారి లేఖ రాశారు. వైయస్‌ జగన్‌ ఏం చెబితే అదే చేస్తారు. చంద్రబాబు మాదిరిగా ముందు ఒకటి..తరువాత మరొకటి చేస్తారు. సబ్బం హరి, తదితరులు వ్యక్తిగత ధ్వేషంతో మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఇల్లు హైదరాబాద్‌లో ఉంది. ఏపీలో ఆయనకు సొంతంగా ఇళ్లు ఉందా?. లోకేష్‌ ఇల్లు ఎక్కడుందో సబ్బం హరి చెప్పాలి.

స్థానికం గురించి సబ్బంహరికి మాట్లాడే అర్హత లేదు. ఆయనకు చీము, నెత్తురు ఉంటే టీడీపీకి రాజీనామా చేయాలి. విశాఖను వైయస్‌ జగన్‌ అభివృద్ధి చేస్తానంటే అభినందించాల్సింది పోయి..రాజధానిని అడ్డుకుంటున్న చంద్రబాబుకు మద్దతు పలుకుతావా?. సబ్బం హరి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందవద్దా? వెలగపూడి రామకృష్ణ, గంటా శ్రీనివాస్‌ ఎక్కడి నుంచి వచ్చారో తెలియదా? నీవు స్థానికం గురించి మాట్లాడుతావా?

పవన్‌ కళ్యాణ్‌ పెద్ద పెద్ద స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. స్టీల్‌ ప్లాంట్‌ గురించి మాట్లాడే బాధ్యత పవన్‌కు లేదా?. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు వన్‌సైడ్‌గా తీర్పు ఇచ్చారు. 

ఓటమిని జీర్ణించుకోలేక చంద్రబాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రజలను బండబూతులు తిడుతున్నారు. ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి రెచ్చగొడుతున్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల దీవెనలు వైయస్‌ జగన్‌కు ఉన్నాయి. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుతామని, దీని కోసం ఎందాకైనా పోరాటం చేస్తామని, మాతో పాటు కలిసి వచ్చే వారందరిని కలుపుకుని ముందుకు వెళ్తామని మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు.
 

Back to Top