చంద్రబాబు జీవితం.. జూమ్‌కే పరిమితం

ఎల్లో ఫంగస్‌ కంటే ఎల్లోమీడియా ప్రమాదకరం

రాష్ట్ర ప్రజలకంటే.. అవినీతి కేసుల్లో అరెస్టయిన టీడీపీ నేతలే బాబుకు ముఖ్యం

పోలవరం, వెలుగొండ పనులు శరవేగంగా నిర్వహిస్తున్నాం

ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం

సీఎం వైయస్‌ జగన్‌ వేసే ప్రతి అడుగు ఆదర్శం

ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌

నెల్లూరు: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టు.. ఆయన తనయుడు సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తిచేస్తున్నారని ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి చంద్రబాబే కారణమని ధ్వజమెత్తారు. పోలవరం, వెలుగొండ ప్రాజ్టెల పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. రూ.60 వేల కోట్లతో రాష్ట్రంలోని ప్రాజెక్టుల పునరుద్ధరణ, నూతన ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం వైయస్‌ జగన్‌ ప్రణాళికతో ముందుకువెళ్తున్నారన్నారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచిన ఘనత మహానేత వైయస్‌ఆర్‌ది అయితే.. 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేలకు పెంచుతున్న చరిత్ర ఆయన తనయుడు వైయస్‌ జగన్‌దన్నారు. 

నెల్లూరులోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్‌ అండ్‌ ఆర్‌ గురించి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తన పాలనలో నిర్వాసితులకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేని చంద్రబాబు ఆర్‌అండ్‌ఆర్‌ గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. పోలవరం, వెలుగొండ ప్రాజెక్టులను వైయస్‌ జగన్‌ పూర్తిచేస్తారని, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తారన్నారు.

రెండేళ్ల పరిపాలనలో సంక్షేమ పథకాల రూపంలో రూ.95 వేల కోట్లకుపైగా డబ్బు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేసిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా, అవినీతి లేకుండా గ్రామ సచివాలయ వ్యవస్థతో పారదర్శకంగా పథకాలు అమలు చేస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 4.5 లక్షల పైచిలుకు ఉద్యోగాలు అందించారన్నారు. పరిపాలన దక్షతతో కరోనా విపత్కర సమయంలోనూ సంక్షేమ పథకాలను అమలు చేశారని గుర్తుచేశారు. కరోనాను ఎదుర్కోవడంలో సీఎం వైయస్‌ జగన్‌ తీసుకునే ప్రతి చర్య.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. 

జూమ్‌ పార్టీకి అధ్యక్షుడిగా చంద్రబాబు తయారయ్యాడని మంత్రి అనిల్‌ కుమార్‌ ఎద్దేవా చేశారు. జూమ్‌ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ.. శేషజీవితం ప్రశాంతంగా కొనసాగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఆంధ్ర రాష్ట్రం సీఎం వైయస్‌ జగన్‌ చేతుల్లో పదిలంగా ఉందన్నారు. దాదాపు 80 శాతం మంది ప్రజలకు సంక్షేమాన్ని అందించారని, రేపు 16 మెడికల్‌ కాలేజీలకు సీఎం శంకుస్థాపన చేయబోతున్నారని వివరించారు.  

విపత్కర సమయంలో హైదరాబాద్‌కు పారిపోయిన తండ్రీకొడుకులు నిత్యం జూమ్‌ యాప్‌ ద్వారా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రంలో అడుగుపెట్టలేని దుస్థితిలోకి చంద్రబాబు వెళ్లిపోయాడన్నారు. ఆయన కొడుకు లోకేష్‌.. చిల్లర రాజకీయాలు చేసేందుకు ఏపీకి వస్తున్నాడన్నారు. ప్రజల గురించి కాకుండా.. అన్యాయాలు చేసి జైలుకెళ్లిన ధూళిపాళ్ల నరేంద్ర కోసం, గతంలో అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రను పరామర్శించడానికి మాత్రమే ఏపీకి వచ్చాడన్నారు. నిత్యం చంద్రబాబు భజన చేసుకుంటూ బ్లాక్, వైట్‌, ఎల్లో ఫంగస్‌ కంటే ప్రమాదకరంగా ఎల్లో మీడియా తయారైందని ధ్వజమెత్తారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top