'కరోనా' కట్టడిలో అగ్రస్థానంలో ఉన్నాం

వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది 

కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక సీఎం వైయస్‌ జగన్‌

తెలుగుదేశం పార్టీ తిన్నదరక్క దీక్షలు చేస్తోంది

ప్రతిపక్ష నేతగా చెప్పుకునే అర్హత కూడా చంద్రబాబుకు లేదు 

ప్రాణంపోసే డాక్టర్లను అవమానించేలా టీడీపీ ప్రవర్తిస్తోంది

ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌

తాడేపల్లి: కరోనా వైరస్‌ నియంత్రణకు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్‌ అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, కరోనా కట్టడిలో ఏపీ అగ్రస్థానంలో ఉందని ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. దేశంలోనే అత్యథిక టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలిచిందన్నారు. కరోనా కట్టడికి సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారన్నారు. కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలను ఆదుకునేందుకు మూడు సార్లు రేషన్‌ సరుకుల పంపిణీ, ప్రతి పేద కుటుంబానికి రూ. 1000 ఆర్థికసాయం చేశారన్నారు. ప్రతి పని చిత్తశుద్ధితో చేస్తుంటే.. తెలుగుదేశం పార్టీ చౌకబారు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఏం మాట్లాడారంటే.. ‘రాష్ట్రంలో 80 వేల టెస్టులు చేస్తే.. ఇవాల్టికి దాదాపు 1259 కేసులు నమోదయ్యాయి. పర్సంటేజ్‌ ప్రకారం 1.5 శాతం, దేశం మొత్తం మీద 4.5 శాతం. భారతదేశంలో అతి తక్కువ పాజిటివ్‌ కేసులు నమోదువుతున్న రాష్ట్రం ఏపీ. మరణాల్లో కూడా దేశం మొత్తం 3.4 శాతం ఉంటే మన రాష్ట్రం 2.8 శాతంలో ఉంది. డిశ్చార్జ్‌లో 20 శాతంలో ఉంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. 

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. అధికార యంత్రాంగం నుంచి పోలీసులు, వలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికులు, రెవెన్యూ, డాక్టర్లు 24 గంటలు పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడుతూ క్వారంటైన్‌ నుంచి డిశ్చార్జ్‌ వరకు జాగ్రత్తలు తీసుకుంటుంటే తెలుగుదేశం పార్టీ నీచ రాజకీయాలు చేస్తూ చౌకబారు విమర్శలు చేస్తున్నారు. అంతకు రాష్ట్రంలో ఒక్క వైరాలజీ ల్యాబ్‌ మాత్రమే ఉంది. కోవిడ్‌ వచ్చిన తరువాత ఈ రాష్ట్రంలో 9 ల్యాబ్‌లు ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లాలో కోవిడ్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేశాం. దాదాపు 12 వందల డాక్టర్లు నియమించుకున్నాం. 

చంద్రబాబు లాంటి నాయకుడు ప్రతిపక్షనేతగా ఉండడం మన దౌర్భాగ్యం. రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే చంద్రబాబు పక్కరాష్ట్రంలో దాక్కున్నాడు. కొంతమంది టీడీపీ నాయకులు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారు. గవర్నర్‌ బంగ్లాకు కరోనా తాకింది.. ఇది రాష్ట్రానికి అప్రతిష్ట అని చంద్రబాబు లేఖ రాశాడు. కరోనా అనేది రాజుకు రాదు.. పేదవాడికే వస్తుంది. బలవంతుడికి రాదు అనేది లేదు.. ఎవరికైనా రావొచ్చు. బ్రిటీష్‌ అధ్యక్షుడు జాన్సన్‌కు ఇలా ఎంతోమందికి వచ్చింది. 

ఒక ఎంపీ కుటుంబంలో వచ్చిందని టీడీపీ నేతలు అవహేళనగా మాట్లాడారు. ఆ కుటుంబంలో నలుగురు డాక్టర్లు ఉన్నారు. ఆ నలుగురు ముందుకు వచ్చి ఫ్రంట్‌ లైన్‌లో ఉండి ట్రీట్‌మెంట్‌ చేస్తుంటే దాన్ని కూడా అవహేళనగా మాట్లాడుతున్నారంటే.. చంద్రబాబు ఉద్దేశం ఏంటీ..? డాక్టర్లను కూడా కించపరిచేలా చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడు. రాష్ట్రంలో ఎక్కువ టెస్టులు చేస్తున్నందుకు దిగులా..? లేక సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం కరోనా కట్టడి చేస్తుందని అసూయా అర్థం కావడం లేదు. 

ఇంత దారుణమైన పరిస్థితుల్లో కూడా మూడుసార్లు రేషన్‌ ఇస్తున్నాం. ప్రతి పేద కుటుంబానికి రూ. 1000 ఆర్థికసాయం చేశాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశాం. మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించాం. చంద్రబాబు గతంలో రూ.1,880 కోట్ల బకాయిలను చెల్లిస్తూ మరో రూ.2 వేల కోట్ల అప్‌డేట్‌ ఫీజురీయింబర్స్‌మెంట్‌ చరిత్రలో ఏ ఒక్క రూపాయి బకాయి లేకుండా చేసిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌. 

676 మండలాలు ఉంటే కేవలం 63 మండలాలు మాత్రమే రెడ్‌జోన్‌లో ఉన్నాయి. 50 మండలాలు ఆరెంజ్‌ జోన్‌లో ఉన్నాయి. మిగిలిన 559 మండలాలు గ్రీన్‌ జోన్‌లో ఉన్నాయి. పది శాతం మండలాలు కూడా రెడ్‌జోన్‌లో లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.

కనీసం మన రాష్ట్రంలో సొంత ఇల్లు కూడా లేని చంద్రబాబు పక్క రాష్ట్రంలో వందల కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. ఇలాంటి నాయకుడికి ప్రజల గురించి మాట్లాడే హక్కు లేదు. యనమల రామకృష్ణుడు తక్కువ కేసులు చూపిస్తున్నారని మాట్లాడుతున్నాడు. ఇంకోకాయన కేసులు పెరిగిపోతున్నాయని మాట్లాడుతున్నారు. టీడీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో వారికే పొంతన లేదు. టీడీపీ నాయకులు కనీసం పది శాతం మందైనా బయటకు వచ్చి పేదవాళ్లకు సాయం చేశారా..? సాయం చేయడం మాని తిన్నది అరక్క దీక్షలు చేస్తున్నారు’ అని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. 
 

Back to Top