తాడేపల్లి: అవినీతి కేసులో చంద్రబాబు జైలుకు వెళితే.. దాన్ని కక్షపూరిత చర్య అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, చంద్రబాబు అవినీతిపై రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెబుతారని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సుదీర్ఘ వాదనలు విన్న తర్వాతే చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించిందని చెప్పారు. చంద్రబాబు అవినీతి చేయలేదని ఆయన తరఫు లాయర్లే కోర్టులో వాదించలేదని, అసలు స్కామ్ జరగలేదని కూడా వాదించలేదన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబును అరెస్ట్ చేయించాల్సిన అవసరం మాకేంటి?. చంద్రబాబు అరెస్టు వెనుక కక్షసాధింపు లేదు. ఆయన్ను జైలుకు పంపి ఆనంద పడాల్సిన అవసరం ఎవరికీ లేదని మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట. నేరాలు చేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. స్కాంలలో సంపాదించడం, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేయడం చంద్రబాబుకు అలవాటు. రాష్ట్రాన్ని చంద్రబాబు అవినీతి మయం చేశాడు. ఒక పొలిటీషియన్ అరెస్ట్ కావడం, జైలుకు వెళ్లడం బాధాకరమే. అయితే ఆ పొలిటీషియన్ ఎలాంటి వ్యక్తి, రాజకీయ జీవితం ఏంటి? అనేది కూడా చూడాలి. చంద్రబాబు అవినీతి గురించి రాష్ట్రంలో ప్రతీఒక్కరికీ తెలుసు. ఆధారాల్లేకుండా కోర్టులు తీర్పులు ఇవ్వవనే విషయం గుర్తించాలి. అరెస్టును కక్ష రాజకీయం అంటూ కొందరు చౌకబారు విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు ఇన్ని అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డప్పటికీ వ్యవస్థల్ని మేనేజ్ చేసి బోనెక్కకుండా వస్తున్నారు. కానీ, రాష్ట్ర ప్రజల అదృష్టమో, బాబు దురదృష్టమో.. ఇప్పుడు అరెస్టయ్యారు. ఓటుకు నోటు కేసులో వ్యవస్థల్ని మేనేజ్ చేసే తప్పించుకున్నారు. డబ్బుతో ఏదైనా మేనేజ్ చేయొచ్చన్నది చంద్రబాబు ఆలోచన. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి డబ్బు ఇస్తూ దొరికినా అరెస్టు కాలేదు. వ్యవస్థలను మేనేజ్ చేసి బయట పడ్డారు. కానీ, రోజులు మారాయి. ఎంతపెద్ద నేరగాడైనా ఎక్కడోచోట దొరికాల్సిందే, చంద్రబాబు కూడా అలాగే ఇప్పుడు దొరికారు. స్కిల్ స్కామే కాదు.. ఇంకా చాలా ఉన్నాయి. ఫైబర్ నెట్, అసైన్డ్ భూములు, అమరావతి వంటి చాలా కుంభకోణాలు ఉన్నాయి. నిరసనలకు ఎవరూ రావట్లేదని అచ్చెన్న అసహనంతో మాట్లాడుతున్నారు. చంద్రబాబును అరెస్టు చేశాక హెలికాప్టర్ లో తీసుకెళ్తామని సీఐడీ అడిగితే వద్దన్నారు. రోడ్డు మార్గంలో చంద్రబాబును తీసుకుని వస్తుంటే జనం ఎవరూ పట్టించుకోలేదు. చివరికి చంద్రబాబు కూడా నిరాశ పడ్డారు. చంద్రబాబుకు నేరాలు కొత్తకాదు. కానీ, ఆయన చేసిన స్కామ్‌లను గుర్తించడమే ఇప్పుడు కొత్త. చంద్రబాబు హయాంలో అనేక స్కామ్‌లు జరిగాయి. చాలా కేసుల్లో స్టేలు తెచ్చుకున్నారు. చంద్రబాబు అరెస్ట్.. రిమాండ్.. కక్ష పూరిత చర్య అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అరెస్ట్ అయిన చంద్రబాబు విజయవాడ రాకముందే ఢిల్లీ నుంచి పెద్దపెద్ద లాయర్లు వచ్చారు. చంద్రబాబు స్కాం చేయలేదని వారు వాదించలేదు. కేవలం టెక్నికల్ అంశాల మీదనే పది గంటలసేపు వాదించారు. చివరకు చంద్రబాబు కూడా తన వాదనలను వినిపించుకున్నారు. ఆయన కూడా నేను స్కాం చేయలేదు అని కాకుండా టెక్నికల్ అంశాలనే ప్రస్తావించారు. ఎల్లోమీడియా చంద్రబాబును దేవుడిగా, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను రాక్షసుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. కానీ వాస్తవాలు ఏంటో జనానికి అర్థం అయింది. కోర్టు రిమాండ్ విధిస్తే బంద్ కి పిలుపు ఇవ్వటం ఏంటి? చంద్రబాబు అవినీతి పరుడనీ, అతనిపై చర్యలు తీసుకోవాలని గతంలో కోరిన పవన్.. ఇప్పుడు ఎందుకు వెనుకేసుకు వస్తున్నారు? జనాన్ని రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితిలో జనంలేరు. చంద్రబాబు మ్యానిప్లేటర్, డబ్బుతో ఏదైనా మేనేజ్ చేస్తారు. కానీ, ఆ పరిస్థితులు ఇక చెల్లవు. ఆయన అండ చూసుకునే రామోజీరావు కూడా అక్రమాలు చేశారు. చట్టపు రథ చక్రాల కింద తప్పు చేసినవారు ఎవరైనా నలిగిపోవాల్సిందే. అసలు రాష్ట్రంలో ఎన్నికలు అతి ఖరీదు కావటానికి కారణమే చంద్రబాబు చంద్రబాబుకు కోర్టు రిమాండ్ మీద బంద్‌కు పిలుపు ఇచ్చారా..? రెండు రోజులు రాష్ట్రంలో ఉత్కంఠత నెలకొంది. అరెస్ట్ అయినప్పటి నుంచి రాజకీయ డ్రామాలాడారు. కుట్రలకు తెరలేపారు. అనర్హుడు, ఇంగితజ్ఞానం లేని వ్యక్తి పవన్. ఎన్ని అక్రమాలు చేసినా పవన్ చంద్రబాబును సమర్థిస్తున్నారు. ప్యాకేజీ స్టార్ అని చెబుతున్నది నిజం కాదా అన్నది పవన్ ఇప్పుడు చెప్పాలి. ముద్రగడని, ఆయన కుటుంబ సభ్యులను కొట్టి అరెస్టు చేసినప్పుడు పవన్ ఎందుకు మాట్లాడలేదు..? చంద్రబాబు అవినీతిపై గతంలో పవన్ మాట్లాడలేదా..? అవినీతికి పాల్పడిన బాబును పవన్ భుజన వేసుకుంటున్నాడు. పవన్ తీరును ప్రజలు అర్థం చేసుకోవాలి. పవన్ కల్యాణ్ ప్రజాస్వామ్య బాటలో ఉన్నాడా..? విప్లవ బాటలో ఉన్నాడా..? తేల్చుకోవాలి. చట్టబద్ధంగా బాబును అరెస్టు చేసి జైలుకు తరలించారు.