నంద్యాల జిల్లా: నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం నల్లకాల్వలో సాక్షి దినపత్రిక విలేకరి ఎన్.వి. సుబ్బారెడ్డిపై టీడీపీ దుండగులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆయన ఇంటిపైకి ఇన్నోవా కారులో వచ్చిన దుండగులు కర్రలతో దాడికి తెగబడ్డారు. ఇంట్లోకి చొరబడి ప్రాణాలు తీసేలా దాడి చేసేందుకు ప్రయత్నించగా, గ్రామస్తులు పెద్దఎత్తున అక్కడికి చేరుకోవడంతో నిందితులు పరారయ్యారు. పారిపోతున్న వారిలో ఒకరిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ దాడి వెనుక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ప్రోద్బలం ఉందని బాధితుడు ఆరోపించారు. మీడియాతో సాక్షి విలేకరి సుబ్బారెడ్డి ఏమన్నారంటే.. - స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బెదిరింపులు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులు పోటీ చేయాలని నిర్ణయించినప్పటి నుంచి ఆత్మకూరు మండలంలో ముఖ్యమైన నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు, బెదిరింపులు జరుగుతున్నాయి. నేను సాక్షి దినపత్రిక విలేకరిగా పనిచేస్తున్నాను. ప్రజా సమస్యలపై వార్తలు రాయడంతో పాటు రాజకీయ పరిణామాలను కూడా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈ క్రమంలో నన్ను ప్రచారానికి దూరంగా ఉండాలని, ఎవరికి ఓట్లు వేయమని చెప్పకూడదని కొందరు బెదిరిస్తున్నారు. నా బంధువుల ద్వారా కూడా ప్రచారం మానుకోవాలని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఒత్తిడి తెస్తున్నారు. - దాడి జరిగే అవకాశం ఉందని ముందే హెచ్చరించిన పోలీసులు దాడికి ముందు రోజు ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయులు నన్ను పిలిపించి, నీపై దాడి జరిగే అవకాశం ఉంది.. జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారం చేయకుండా ప్రశాంతంగా విలేకరి పని చేసుకోవాలని సూచించారు. దాడి జరిగే అవకాశం ఉందని పోలీసులకు ముందే సమాచారం ఉన్నప్పుడు నా రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మరుసటి రోజు ఉదయం నేను ఇంటి వద్ద ఉండగా ఇన్నోవా కారులో వచ్చిన నలుగురు నుంచి ఆరుగురు వ్యక్తులు కర్రలతో దాడికి దిగారు. వారి నుంచి తప్పించుకునేందుకు ఇంట్లోకి వెళ్లి గేటు వేసుకున్నాను. గ్రామస్తులు పెద్దఎత్తున అక్కడికి చేరుకోవడంతో దుండగులు పరారయ్యారు. పారిపోతున్న వారిలో ఒకరు తప్పించుకోలేకపోవడంతో గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో ఇన్నోవా కారు అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. - ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే దాడి.. భయపడేది లేదు టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని నేను భావిస్తున్నాను. గత కొన్ని రోజులుగా ఆయనకు సంబంధించిన వ్యక్తుల ద్వారా ప్రచారం మానుకోవాలని బెదిరింపులు వస్తున్నాయి. నల్లకాల్వలో ఎన్నికల ప్రచారం సమయంలో కూడా మా కార్యక్రమాలు, ప్రజల స్పందన ఆయనకు నచ్చలేదు. దాడులు, బెదిరింపులతో మమ్మల్ని భయపెట్టవచ్చని అనుకుంటున్నారు. నా ప్రాణానికి ఏదైనా హాని జరిగితే ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డిదే బాధ్యత. ఇలాంటి దాడులు నన్ను వెనక్కి తగ్గించలేవు. సాక్షి విలేకరిగా నా బాధ్యతను మరింత పట్టుదలతో నిర్వర్తిస్తాను అని ఎన్.వి. సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.