‘తల్లికి వందనం’ పేరుతో తల్లులకు చంద్రబాబు మహామోసం 

మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఫైర్ 

పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్సార్‌సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగు నాగార్జున 

‘తల్లికి వందనం’ మొదటి ఏడాదే ఎగ్గొట్టి తల్లులకు మొండిచేయి

రెండో ఏడాది పథకం అమలు అరకొరే

మూడో ఏడాది బడ్జెట్‌లోనే భారీగా నిధులకు కోత

తల్లుల ఖాతాల్లో డబ్బులు తగ్గించి.. ప్రకటనల్లో అంకెలు పెంచుతున్నారు

యూడైస్‌ ప్లస్‌ లెక్కల ప్రకారం 87.41 లక్షల మంది విద్యార్థులకు పథకం వర్తింపజేయాలి

ప్రతి విద్యార్థికీ రూ.15 వేలు ఇవ్వాలంటే ఏడాదికి రూ.13,112 కోట్లకు పైగా అవసరం

హామీ ఇచ్చిన రూ.15 వేలు ప్రతి విద్యార్థికీ ఎందుకు ఇవ్వడం లేదు?

బడ్జెట్‌ లెక్కలకు.. ప్రభుత్వ ప్రచార లెక్కలకు పొంతనేదీ?

అర్హులైన ప్రతి విద్యార్థికీ పూర్తి రూ.15 వేలు ఇచ్చారా లేదా ప్రభుత్వం వెల్లడించాలి

తల్లుల ఖాతాల్లో తగ్గుతున్న డబ్బులకు బాధ్యత ఎవరిది?

‘అమ్మ ఒడి’ని ‘తల్లికి వందనం’గా పేరు మార్చడం తప్ప పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయారు

వైయస్‌ జగన్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ అయితే.. చంద్రబాబు ‘నేమ్‌ ఛేంజర్‌’

విద్యార్థులు, మహిళలు, రైతులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి

మాజీ మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్‌

తాడేపల్లి:  ఎన్నికల సమయంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ‘తల్లికి వందనం’ అందిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక తల్లులను నిలువునా మోసం చేశారని వైయ‌స్సార్‌సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. మొదటి ఏడాది పథకాన్ని పూర్తిగా ఎగ్గొట్టి, రెండో ఏడాది అరకొరగా అమలు చేసి, మూడో ఏడాది బడ్జెట్‌లోనే భారీగా నిధులకు కోత పెట్టారని ధ్వజమెత్తారు. తల్లుల ఖాతాల్లో జమ చేసే మొత్తాన్ని తగ్గిస్తూ.. ప్రభుత్వ ప్రకటనల్లో మాత్రం వేల కోట్ల రూపాయలు ఎక్కువగా చూపిస్తూ అంకెల గారడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో పేద పిల్లల చదువుకు అండగా నిలిచిన ‘అమ్మ ఒడి’ పథకానికి పేరు మార్చడం తప్ప, దానిని పూర్తిస్థాయిలో అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మేరుగు నాగార్జున మాట్లాడారు.
ప్రెస్‌మీట్‌లో మేరుగు నాగార్జున ఏమన్నారంటే.. 

- మొదటి ఏడాదే పథకాన్ని ఎగ్గొట్టారు 
ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇంటింటికీ తిరిగి ‘మీకు రూ.15 వేలు.. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఒక్కొక్కరికి రూ.15 వేలు’ అని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక మొదటి ఏడాదే ‘తల్లికి వందనం’ పథకాన్ని పూర్తిగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది అరకొరగా అమలు చేశారు. మూడో ఏడాది బడ్జెట్‌లోనే భారీగా కోత పెట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏమైంది? ప్రతి విద్యార్థికీ రూ.15 వేలు ఎందుకు ఇవ్వడం లేదు? తల్లులను ఇలా మోసం చేయడం న్యాయమా?

- 87.41 లక్షల మంది విద్యార్థులకు రూ.13,112 కోట్లు అవసరం 
యూడైస్‌ ప్లస్‌ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 87.41 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ రూ.15 వేల చొప్పున ఇవ్వాలంటే ఏడాదికి రూ.13,112 కోట్లకు పైగా అవసరం. 2024–25లో ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా పథకాన్నే ఎగ్గొట్టారు. 2025–26లో సవరించిన బడ్జెట్‌ అంచనాలను రూ.8,389 కోట్లకు తగ్గించారు. వాస్తవంగా ఖర్చు చేసిన మొత్తం ఇంకా తక్కువగా ఉంది. మరి అర్హులైన విద్యార్థులందరికీ రూ.15 వేలు ఇచ్చామని ఎలా చెప్పుకుంటారు? ప్రభుత్వం పూర్తి లెక్కలను ప్రజల ముందు పెట్టాలి.

- తల్లుల ఖాతాల్లో తగ్గించి.. ప్రకటనల్లో అంకెలు పెంచుతున్నారు
తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు వేస్తామని చెప్పి కొందరి ఖాతాల్లో రూ.5,500, రూ.6 వేలు, రూ.8 వేలు, రూ.9 వేలు మాత్రమే పడుతున్నాయి. మరి మిగిలిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? తల్లుల ఖాతాల్లో డబ్బులు తగ్గిస్తున్నారు.. ప్రభుత్వ ప్రకటనల్లో మాత్రం అంకెలు పెంచి చూపిస్తున్నారు. బడ్జెట్‌లో ఒక లెక్క, పత్రికా ప్రకటనల్లో మరో లెక్క చెబుతున్నారు. ఈ అంకెల గారడీపై చంద్రబాబు, లోకేష్‌ ప్రజలకు సమాధానం చెప్పాలి.’’

- వైయస్‌ జగన్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’.. చంద్రబాబు ‘నేమ్‌ ఛేంజర్‌’ 
పేదరికం కారణంగా ఏ బిడ్డా చదువు మానకూడదనే లక్ష్యంతో శ్రీ వైయస్‌ జగన్‌ ‘అమ్మ ఒడి’ని అమలు చేశారు. 42.61 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.26 వేల కోట్లకు పైగా జమ చేశారు. వైయస్‌ జగన్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ అయితే.. చంద్రబాబు ‘నేమ్‌ ఛేంజర్‌’గా మారారు. ‘అమ్మ ఒడి’ పేరును ‘తల్లికి వందనం’గా మార్చడం తప్ప పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయారు.

- అన్ని వర్గాలనూ మోసం చేస్తున్నారు
ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు రూ.1,500, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి, రైతులకు రూ.20 వేల పెట్టుబడి సాయం అంటూ ఎన్నికల్లో చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయకుండా విద్యార్థులు, మహిళలు, రైతులు, నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. ఇచ్చిన ప్రతి హామీకి లెక్క చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. హామీలను ఎప్పుడు పూర్తిస్థాయిలో అమలు చేస్తారో చంద్రబాబు సమాధానం చెప్పాలి.

పేరు మార్చి ప్రచారం చేసుకోవడం కాదు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన ప్రతి విద్యార్థికీ పూర్తి రూ.15 వేలు ఇవ్వాలి. మొదటి ఏడాది ఎగ్గొట్టిన మొత్తంతో పాటు ఆ తర్వాత పెట్టిన కోతలపైనా ప్రభుత్వం లెక్క చెప్పాలి. తల్లులకు అందాల్సిన ప్రతి రూపాయి వారి ఖాతాల్లో జమ చేయాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలి. విద్యార్థులు, మహిళలు, రైతులు, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలి. లేకపోతే ప్రజలే ఈ ప్రభుత్వాన్ని నిలదీసే రోజు వస్తుంది’’ అని మేరుగు నాగార్జున స్పష్టం చేశారు. 

Back to Top