కేంద్ర మంత్రి మురళీధరన్‌ చేసిన వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యం

మత విద్వేషాలు రెచ్చగొట్టిన వ్యక్తికి జైలుకెళ్లి కేంద్ర మంత్రి పరామర్శా?

రాష్ట్ర హోం శాఖ మంత్రి సుచరిత

 గుంటూరు : కర్నూలు జిల్లా ఆత్మకూరులో మత విద్వేషాలను రెచ్చగొట్టి, అల్లర్లకు కారణమైన వ్యక్తిని పరామర్శించేందుకు కేంద్రమంత్రి మురళీధరన్‌ సబ్‌ జైలుకు వెళ్లడం విస్మయానికి గురి చేసిందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. ఆ సందర్భంగా కేంద్ర మంత్రి మురళీధరన్‌ చేసిన వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యంగా ఉన్నాయన్నారు.  సోమవారం నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో  సుచరిత మాట్లాడుతూ.. బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తోందని మండిపడ్డారు.

బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి అనే వ్యక్తి ఆత్మకూరులో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మత విద్వేషాలు రెచ్చగొడుతూ గొడవకు ప్రధాన కారకుడయ్యాడని పోలీసుల విచారణలో తేలినట్లు తెలిపారు. అక్కడ మసీదు నిర్మాణానికి సంబంధించి అభ్యంతరాలుంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిలువరించే ప్రయత్నం చేసి ఉంటే బాగుండేదన్నారు. అలా కాకుండా మందీమార్బలంతో మసీదు నిర్మాణం వద్దకు వెళ్లి అక్కడి వారితో గొడవకు దిగడం, నిర్మాణాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించటం లాంటి చట్టవ్యతిరేకమైన పనులకు పాల్పడటం ఆమోద యోగ్యం కాదన్నారు. అదే సమయంలో పోలీసులు వెళ్లి శ్రీకాంత్‌రెడ్డిని అక్కడ నుంచి  వెళ్లిపోవాలని కోరారన్నారు. అయినా అక్కడే తిరగడం వల్ల గొడవ మరింత పెద్దదైందన్నారు.

అతడి ప్రాణాల్ని కాపాడింది పోలీసులే
మసీదు నిర్మాణ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడి శ్రీకాంత్‌రెడ్డి వాహనంపై దాడి చేయడంతో పోలీసులు వెంటనే స్పందించి శ్రీకాంత్, అతని అనుచరులను స్టేషన్‌కు తరలించి రక్షణగా ఉండి ప్రాణాలు కాపాడారని హోంమంత్రి వివరించారు. శ్రీకాంత్‌రెడ్డి, అతడి ఐదుగురు అనుచరులతోపాటు అతడిపై దాడికి పాల్పడిన దాదాపు 70 మంది ముస్లింలపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపినట్లు వివరించారు. వాస్తవాలు ఇలా ఉంటే.. కేంద్రమంత్రి మురళీధరన్‌ ఏపీలో అవినీతి రాజ్యమేలుతోందని, ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారిందని అనడం బాధ్యతా రాహిత్యమని ఆమె మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం వైఎస్‌ జగన్‌పై బురద చల్లాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు.

చిత్తూరు ఘటనపై హోంమంత్రి ఆరా
చిత్తూరులో ఎస్సీ మహిళపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారనే ఘటనపై విచారణ జరపాలని హోంమంత్రి సుచరిత పోలీసు అధికారులను ఆదేశించారు. ఒక కేసు విచార ణలో పోలీసులు తనను కొట్టారన్న  ఎస్సీ మహిళ ఉమామహేశ్వరి  ఆరోపణలపై మంత్రి వివరాలు తెలుసుకున్నారు. 

తాజా ఫోటోలు

Back to Top