డీఎస్సీ అవకతవకలపై అమలాపురంలో భారీ నిరసన

అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం

అమలాపురం : రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ పరీక్షలు, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలు, అక్రమాలు, పారదర్శకత లేమిని నిరసిస్తూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం అమలాపురంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు, సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు, ఏడు నియోజకవర్గాల సమన్వయకర్తలు, యువజన విభాగ అధ్యక్షులు, విద్యార్థి విభాగ నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలు, నిరుద్యోగ యువత, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు.

నిరసన అనంతరం ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది. డీఎస్సీ నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. నియామకాల్లో పూర్తి పారదర్శకత పాటించి, నిరుద్యోగ యువతకు నమ్మకం కలిగించే చర్యలు తీసుకోవాలని కోరింది. 
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతిభ, అర్హతలకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా నియామకాలు జరగాలని, ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై ఉన్న అనుమానాలను ప్రభుత్వం వెంటనే నివృత్తి చేయాలని అన్నారు. నిరుద్యోగ యువత భవిష్యత్తుతో చెలగాటమాడే చర్యలను సహించబోమని హెచ్చరించారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ రాష్ట్ర కార్యదర్శులు, సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, యువజన, విద్యార్థి విభాగ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువతకు జిల్లా యువజన విభాగం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. అర్హత, ప్రతిభకు న్యాయం జరిగే వరకు నిరుద్యోగ యువత హక్కుల పరిరక్షణ కోసం వైయ‌స్ఆర్‌సీపీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. 
 

Back to Top