వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌సెల్‌ సమావేశంపై దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నాం..

బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్య తీసుకుంటాం..
 
వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎం.మనోహర్‌ రెడ్డి ప్రకటన

తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ లీగల్‌ సెల్‌ సమావేశంలో గొడవ చోటు చేసుకుందని జరిగిన ప్రచారంలో ఎంత మాత్రం వాస్తవం లేదని వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి స్పష్టం చేశారు. తమ మీటింగ్‌ గ్రాండ్‌ సక్సెస్‌ అయిందని, పార్టీ అధ్యక్షుడు వైయ‌స్ జగన్‌ గారి ప్రసంగానికి న్యాయవాదులంతా ఆకర్షితులై, సంఘీభావం ప్రకటించారని ఆయన వెల్లడించారు. దాన్ని చూసి ఓర్చుకోలేక, ఈ తరహాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు.

ఈ మేరకు మనోహర్‌రెడ్డి ఒక వీడియో విడుదల చేస్తూ, తమ సమావేశంపై ఒక ఛానల్‌లో అసత్య ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ తరహా చర్యలు తమలో స్ఫూర్తిని దిగజార్చలేవని, వైయ‌స్ఆర్‌సీపీ న్యాయవాదుల్లో ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పారు. ఇలాంటి అనైతిక చర్యలను ఏ మాత్రం సహించబోమని, తమ సమావేశంపై దుష్ప్రచారం చేసిన మీడియాపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎం.మనోహర్‌రెడ్డి వివరించారు. 

Back to Top