వైయస్ఆర్ జిల్లా: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 28న జిల్లా కేంద్రాల్లో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న విద్యార్థి–యువత ర్యాలీ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ర్యాలీలో విద్యార్థులు, యువత, ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రఘురామిరెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. విజయోత్సవాల పేరుతో ప్రజల వద్దకు వస్తున్న కూటమి నేతలను ఆడబిడ్డ నిధి, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్, నిరుద్యోగ భృతి వంటి ఎన్నికల హామీల అమలుపై ప్రజలు ప్రశ్నించాలని కోరారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో మైదుకూరులో బాలికల పాఠశాల పనులు 80 శాతం పూర్తి చేశామని, మిగిలిన 20 శాతం పనులను రెండేళ్లుగా ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా విజయోత్సవాలు చేసుకోవడం ఏమిటని నిలదీశారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు డీఎస్సీ వ్యవహారంలో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించి అభ్యర్థులకు న్యాయం చేయాలని రఘురామిరెడ్డి డిమాండ్ చేశారు.