డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాల్సిందే

లోకేష్‌ రాజీనామా చేసి తీరాలి

మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి డిమాండ్‌

నెల్లూరు: డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అవకతవకలు, అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. డీఎస్సీ అక్రమాలపై ఆధారాలతో ప్రశ్నిస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ నేతలను వేధిస్తూ అక్రమ కేసులు నమోదు చేయడం కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు నిదర్శనమని మండిపడ్డారు. పారదర్శకంగా నియామకాలు జరిగి ఉంటే సీబీఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేసి తీరాలని స్పష్టం చేశారు. డీఎస్సీ అవకతవకలపై వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్రవ్యాప్త నిరసనల్లో భాగంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు విజయవంతమయ్యాయి. డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాలు, అవకతవకలపై సాక్షాధారాలతో ప్రశ్నిస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు.

డీఎస్సీ అక్రమాలపై తొలుత ఆధారాలతో ప్రశ్నించిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసలేని విషయాలపై నోరు పారేసుకునే కూటమి నేతలు డీఎస్సీ అవకతవకలపై మాత్రం ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టిన నిరసన ర్యాలీలతో డీఎస్సీ అక్రమాలపై ప్రజల్లో చర్చ మొదలవడాన్ని కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేక అక్రమ కేసులు నమోదు చేస్తోందని పేర్కొన్నారు. ర్యాలీలకు ముందుగానే అనుమతి కోరినా నిరాకరించి, అనంతరం కేసులు పెట్టడం సిగ్గుచేటని అన్నారు. పోలీసులు అధికార పార్టీ నేతలకు కొమ్ముకాయడం శోచనీయమని తెలిపారు.

విద్యార్థుల సంక్షేమాన్ని గాలికొదిలి రాజకీయ వేధింపులకు ప్రాధాన్యత

విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించే పరిస్థితి లేని కూటమి ప్రభుత్వం డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నించే గొంతులను అణచివేయడానికి మాత్రం అధికార యంత్రాంగాన్ని ఉపయోగిస్తోందని కాకాణి విమర్శించారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిందేనని, సీబీఐ విచారణకు ప్రభుత్వం ముందుకు రావాలని స్పష్టం చేశారు.

డీఎస్సీలో అక్రమాలు వాస్తవం: ఎమ్మెల్సీ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి

డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు, అక్రమాలు జరిగిన విషయం వాస్తవమని ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. మొత్తం ప్రక్రియ పారదర్శకంగా జరిగి ఉంటే సీబీఐ విచారణకు భయపడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాష్ట్ర సంస్థలతో దర్యాప్తు జరిపిస్తే షాడో సీఎం నారా లోకేష్‌ దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని అన్నారు. డీఎస్సీ అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా అనేక ఆధారాలను ఇప్పటికే ప్రజల ముందుంచామని చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. మెరిట్‌ లిస్ట్‌, సెలక్షన్‌ లిస్ట్‌లలో సైతం గందరగోళం నెలకొందని పేర్కొన్నారు. స్పోర్ట్స్‌ కోటా కింద ఉద్యోగాలను అమ్ముకున్న పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధమైన జీఓలతో మొత్తం వ్యవహారాన్ని నడిపించారని తెలిపారు.

సీబీఐ విచారణతోనే నిజాలు వెలుగులోకి

డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్రంగా, పారదర్శకంగా దర్యాప్తు చేయించే పరిస్థితి లేదని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు పేర్కొన్నారు. మెరిట్‌ నుంచి సెలక్షన్‌ వరకు ప్రతి దశను సమగ్రంగా పరిశీలించి, బాధ్యులపై చర్యలు తీసుకునేలా సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. డీఎస్సీ బాధిత అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్‌ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.
 

Back to Top