అసెంబ్లీ మీడియా పాయింట్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని, డీఎస్సీ ఉద్యోగాలను అంగట్లో పెట్టి బహిరంగంగా అమ్ముకుందని శాసనమండలి విపక్ష నేత, వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలు, పేపర్ లీకేజీలపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ స్కామ్‌కు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని ఆయన పట్టుబట్టారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి, దమ్ము ఉంటే అసెంబ్లీ సమావేశాలను మరో రెండు, మూడు రోజులు పొడిగించాలని ఆయన సవాల్ విసిరారు. డీఎస్సీతో పాటు గ్రూప్-1 నియామకాలపై సభలో పూర్తి స్థాయిలో చర్చించేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని, ప్రభుత్వం చర్చకు ఎందుకు భయపడుతోందని ఆయన ప్రశ్నించారు. డీఎస్సీ లీకేజీలపై మండలిలో చర్చకు పట్టుబడితే ప్రభుత్వం మూడో రోజు కూడా సమాధానం చెప్పలేక మొహం చాటేసిందన్నారు. సభా సంప్రదాయాలకు తూట్లు శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన నూతన అధ్యక్షుడికి కనీస శుభాకాంక్షలు కూడా తెలపకుండా అధికార పక్షం సభ నుంచి మూకుమ్మడిగా వాకౌట్ చేయడంపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని ప్రజాస్వామ్య విరుద్ధమైన "చెత్త సంప్రదాయమని" ఆయన విమర్శించారు. సభా మర్యాదలను, నిబంధనలను కాపాడాల్సిన అధికార పక్షమే "తాము చెప్పిందే శాసనం" అనే అహంకారంతో సభాధ్యక్షుడి స్థానాన్ని అవమానించడం వారి బాధ్యతారాహిత్యానికి, అవివేకానికి నిదర్శనమన్నారు. పాలకులకు చట్టాలు, రూల్ బుక్స్ పట్ల కనీస గౌరవం లేదని, సభను ఏకపక్షంగా నడపడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని విమర్శించారు. వ్యక్తిగత, రాజకీయ విభేదాలను సభా మర్యాదలకు దూరంగా తీసుకెళ్లడం సరికాదని, ఇలాంటి వ్యవహారశైలి భవిష్యత్ తరాలకు తప్పుడు రాజకీయ సంస్కృతిని అందిస్తుందని చెప్పారు. చట్టసభలను అపహాస్యం చేస్తూ కూటమి నాయకులు ప్రదర్శిస్తున్న ఈ అహంకార పూరిత పోకడలను, వారి దిగజారిన నైజాన్ని రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్రజలు గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీసీల రిజర్వేషన్లపై టీడీపీది కపట ప్రేమ వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన చంద్రబాబు నాయుడు.. బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించేందుకు గతంలో కోర్టుల ద్వారా కుట్రలు చేశారని శ్రీ బొత్స గుర్తుచేశారు. వైఎస్ జగన్ గారి ప్రభుత్వంలో 50 శాతానికి పైగా రాజకీయ పదవులు (ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, నామినేటెడ్ పదవులు) బీసీ, ఎస్సీ, ఎస్టీలకే ఇచ్చి సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.