అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయాలనుకోవడం తప్పా?

 సీఎం వైయ‌స్ కడుతుంది ఇల్లు కాదు.. ఊళ్లు

మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్న

 అమరావతి : గ్లోబల్ టెండర్లతో వ్యాక్సిన్ సరఫరా పెంచి అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయాలనుకోవడం తప్పా? అని మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు ప్ర‌శ్నించారు. వ్యాక్సినేష‌న్‌పై ప్ర‌తిప‌క్ష నేత చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను మంత్రి తీవ్రంగా ఖండించారు. శుక్ర‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేద వాడు ఉండకూడదని సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రమిస్తుంటే దాన్ని ఎలా అడ్డుకోవాలా అని ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. 

చంద్రబాబు హాయంలో కేంద్రం ఇచ్చిన నిధులతో ఇళ్ల పథకానికి ఎన్‌టీఆర్ హౌసింగ్ అని పేరు పెట్టుకోలేదా?.. కేంద్రం నిధులు ఇవ్వకుండా రాష్ట్రాల్లో పథకాలు అమలవుతాయా? అని ప్రశ్నించారు. బడ్జెట్‌ని కూడా కేంద్రం ఇచ్చే నిధులు, మనకు రావాల్సిన పన్నులు చూసుకునే తయారుచేస్తారని అన్నారు.  

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ కడుతుంది ఇల్లు కాదు.. ఊళ్లు. జగనన్న కాలనీల్లో మౌలిక వసతులకు ఎంత ఖర్చు చేస్తున్నారో టీడీపీ వాళ్లకు తెలియదా?. ఆ స్థలాలు ఇవ్వకూడదని అడ్డుకుని కోర్టులో కేసులు వేసింది టీడీపీ వాళ్లు కాదా ?. చివరికి అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తే డెమోగ్రాఫికల్ బ్యాలెన్స్ పోతుందని కోర్టుకు చెప్పింది మీరు కాదా?. సీఎం వైయ‌స్ జగన్ ఇన్ని మంచి పనులు చేసి ప్రజలకు దగ్గరవుతున్నారని తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారు. వ్యాక్సిన్ విషయంలో ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారు.

దేశంలో అత్యధికంగా వ్యాక్సినేషన్ చేసిన రాష్ట్రాల్లో మనం ముందున్నాం. వ్యాక్సిన్ సరఫరా కేంద్రం చేతుల్లో ఉన్న విషయం టీడీపీ వారికి తెలిసినా మాపై విమర్శలు చేస్తున్నారు. గ్లోబల్ టెండర్లతో వ్యాక్సిన్ సరఫరా పెంచి అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయాలనుకోవడం తప్పా?. కేంద్రం అనుమతి లేక గ్లోబల్ టెండర్లకు ఎవరూ రాలేదు. అందుకే కేంద్రమే దీనిపై చర్యలు తీసుకోవాలని సీఎం అన్నదాంట్లో తప్పేముంది. 

వ్యాక్సిన్ గురించి ఇంతగా మాట్లాడుతున్న చంద్రబాబు అసలు వ్యాక్సిన్ వేయించుకున్నారా?. 45 ఏళ్లు దాటిన ఆయన వ్యాక్సిన్ వేయించుకోవాలి కదా.. వేయించుకుంటే ఎక్కడ వేయించుకున్నారు?. ఏపీలోనా...లేక తెలంగాణలోనా?. భారత్ బయోటెక్ వాళ్ల వ్యాక్సిన్ వేయించుకున్నారా?. కోవి షీల్డ్ వేయించుకున్నారా?. ఆయన వ్యాక్సిన్ వేయించుకున్నారా లేదా అనేది ప్రజలకు చెప్పాల‌ని మంత్రి క‌న్న‌బాబు డిమాండ్‌ చేశారు.

Back to Top