జర్నలిస్టుల పాత్ర ప్రశంసనీయం

ప్రభుత్వపరంగా సంపూర్ణ సహకారం

ఘనంగా వీజెఎఫ్-సిఎంఆర్ ఇంటర్ మీడియా స్పోర్ట్స్ మీట్ ప్రారంభం

లాంచనంగా ప్రారంభించిన మంత్రి ముత్తంశెట్టి, నగర మేయర్

విశాఖపట్నం:  సమాజసేవలో జర్నలిస్టుల పాత్ర ప్రశంసనీయమని, వారికి ప్రభుత్వపరంగా తగిన సహాయ సహకారాలు అందిస్తామని రాష్ర్ట పర్యాటక, యువజన, క్రీడల శాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం ఇక్కడ పోర్టు మైదానంలో వైజాగ్ జర్నలిస్టుల ఫోరం, సిఎంఆర్ ఇంటర్ మీడియా స్పోర్ట్స్ మీట్ ను మంత్రి ముఖ్యఅతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పాటుపడే జర్నలిస్టులు ప్రతీ ఏటా క్రమం తప్పకుండా ఇంటర్ మీడియా, రాష్ర్టస్థాయి క్రీడా పోటీలు నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. జర్నలిస్టులు ఇటువంటి క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతతో పాటు మెరుగైన ఆరోగ్యం లభిస్తుందన్నారు. విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా తాను ఈ స్థాయికి ఎదిగేందుకు ఎంతో మంది జర్నలిస్టులు అందించిన సహకారం తాను జీవితంలో మరువలేనన్నారు.  మూడు దశాబ్ధాలకు పైబడి జర్నలిస్టులు సంక్షేమానికి వైజాగ్ జర్నలిస్టుల ఫోరం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. దేశంలోనే అనేక ప్రెస్ క్లబ్ లకు వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఆదర్శనీయమన్నారు. విద్య, వైద్యంతో పాటు పండుగల నిర్వహణ, ఇతర సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వీజెఎఫ్ సేవలను మంత్రి కొనియాడారు. త్వరలోనే జర్నలిస్టులకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి మాట్లాడుతూ జర్నలిస్టులు సహకారం ప్రశంసనీయమన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల క్రీడా స్పూర్తితో పాటు అందరూ ఒకే వేధికపై కలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. నగరాభివృద్ధిలో జర్నలిస్టులు సంపూర్ణ సహకారం అందిస్తున్నారన్నారు. క్రీడలు విజయవంతం కావాలని మంత్రి, మేయర్ లు క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, ఎస్.దుర్గారావులు మాట్లాడుతూ అందరి సహకారంతోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించగలుగుతున్నామన్నారు. తమ పాలకవర్గం హయాంలో సంక్షేమ కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఈనెల 28 వరకు పోర్టు, స్వర్ణభారతి ఇతర వేధికలపై ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈనెల 22 నుంచి క్రికెట్ పోటీలు ప్రారంభమవుతాయన్నారు. వీజెఎఫ్ ఉపాధ్యక్షులు ఆర్.నాగరాజుపట్నాయక్ స్వాగతం పలికిన ఈ కార్యక్రమంలో మరో ఉపాధ్యక్షులు టి.నానాజీ, జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్, స్పోర్ట్స్ జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఉమాశంకర్ బాబు, జి.సాంబశివరావుతో పాటు వీజెఎఫ్ కార్యవర్గ సభ్యులు ఇరోతి  ఈశ్వరరావు, ఎమ్ఎస్ఆర్ ప్రసాద్, దివాకర్, డేవిడ్ రాజ్, గిరిబాబు, గయాజ్, శేఖరమంత్రి, సనపల మాధవరావు తదితరులు పాల్గొన్నారు. 
 

అట్టహాసంగా క్రీడలు ప్రారంభం..
వీజెఎఫ్-సిఎంఆర్ - విస్జా ఇంటర్ మీడియా స్పోర్ట్స్ మీట్ ను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి, వీజెఎఫ్ కార్యవర్గం అట్టహాసంగా ప్రారంభించింది. తొలుత క్రీడాకారులందరూ  మార్చ్ ఫాస్ట్ నిర్వహించగా మంత్రి, మేయర్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం గాలిలోకి బెలూన్లు ఎగురవేసి క్రీడలను ప్రారంభించారు. తదుపరి టగ్ ఆఫ్ వార్ లో మంత్రి, మేయర్ జట్లు పాల్గొన్నాయి. సరదాగా జరిగిన ఈ మ్యాచ్ లో మేయర్ జట్టు విజయం సాధించింది. అనంతరం మంత్రి, మేయర్ కాసేపు క్రీకెట్ ఆడి సందడి చేశారు. ఇదిలా ఉండగా క్రీడాకారులకు మెడీకవర్ ఆసుపత్రి సౌజన్యంతో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించింది. పండుగ వాతావరణంలో వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఇంటర్ మీడియా స్పోర్ట్స్ మీట్ ప్రారంభం కాగా వారం రోజుల పాటు ఇది కొనసాగనుంది. 13 అంశాల్లో హోరాహోరీగా పోటీలు సాగనున్నాయి. తొలిరోజు పురుషులు, మహిళా జర్నలిస్టులకు సంబంధించిన అథ్లెటిక్స్ పోటీలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం క్యారెమ్స్, చెస్, షటిల్ బ్యాట్మెంటెన్ పోటీలు స్వర్ణభారతి స్టేడియం వేధికగా ప్రారంభం కానున్నాయి.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top