ఒంగోలు: డీఎస్సీ-2025 నియామక ప్రక్రియలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలులో వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ-2025లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై ప్రభుత్వం వెంటనే స్పందించి పారదర్శక విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత భవిష్యత్తుతో చెలగాటమాడే చర్యలను సహించబోమని హెచ్చరించారు. రాష్ట్ర కార్యదర్శి బొట్ల రామారావు , రాష్ట్ర మహిళా కార్యదర్శి భూమిరెడ్డి రవణమ్మ మాట్లాడుతూ డీఎస్సీ ప్రక్రియలో జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రకాశం జిల్లా వైయస్ఆర్‌సీపీ యూత్ వింగ్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి , ప్రచార విభాగం అధ్యక్షుడు శేషారెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు దుంపా రవణమ్మ, బీసీ సెల్ అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు మాట్లాడుతూ డీఎస్సీ-2025 నియామకాలపై వస్తున్న అనుమానాలను నివృత్తి చేయాలంటే స్వతంత్ర సంస్థతో విచారణ ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. నిరుద్యోగుల హక్కులను కాపాడేందుకు వైయస్ఆర్‌సీపీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ధర్నా కార్యక్రమంలో పార్టీ నాయకులు, యువజన విభాగం ప్రతినిధులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.