శ్రీకాకుళం : మెగా డీఎస్సీ-2025లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాల కారణంగా దళిత నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయిందని ఆరోపిస్తూ వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా పరిషత్ సమీపంలోని గ్రీవెన్స్ సెల్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీలో సామాజిక న్యాయాన్ని ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. మెగా డీఎస్సీ ఎంపిక ప్రక్రియపై వస్తున్న ఆరోపణలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దళిత నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేలా పారదర్శక చర్యలు తీసుకోవాలని, అర్హులైన అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యావంతులైన యువత భవిష్యత్తుతో ఆటలాడే విధానాలను విరమించుకోవాలని సూచించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ఉద్యోగాల భర్తీలో పారదర్శకత లేకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ నాయకులు నినాదాలు చేశారు. డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నాల రుషి, శ్రీకాకుళం నియోజకవర్గ అధ్యక్షుడు ఎజ్జల గురుమూర్తి, కల్లేపల్లి లక్ష్మణరావు, సత్తివాడ రామినాయుడు, నేతల కృష్ణ, లండ కిరణ్, లింగాల లక్ష్మణ, రేగిడి లక్ష్మణరావు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.