కౌలు రైతుల‌కూ "అన్న‌దాత సుఖీభ‌వ" వ‌ర్తింప‌జేయాలి

మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు డిమాండ్ 

కాకినాడ‌ లోని త‌న క్యాంప్ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కుర‌సాల క‌న్నబాబు

రైతుల‌కు యూరియా కొర‌త లేకుండా చూడాల్సిన బాధ్య‌త ప్రభుత్వానిదే

ఆక్వా రైతుల‌ను ఆదుకున్న‌ట్టు ప్ర‌భుత్వం డ్రామాలాడుతోంది

ఫీడ్ రేటు రెండుసార్లు రూ. 14లు పెంచి రూ.4లు త‌గ్గించారు

వైయ‌స్ జ‌గ‌న్ గారు ప్ర‌శ్నిస్తే త‌ప్ప ప్ర‌భుత్వంలో చ‌ల‌నం రావ‌డం లేదు

మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు స్ప‌ష్టీక‌ర‌ణ 

గుడివాడ అమ‌ర్నాథ్‌కి నోటీసులిచ్చిన మ‌హిళా క‌మిష‌న్, సీపీకి ఎందుకివ్వ‌లేదు?

శాంతిభ‌ద్ర‌త‌లు కాపాడ‌టంలో ప్ర‌భుత్వం ఘోరంగా విఫ‌లం 

కొడుకు ఆచూకీ కోసం తిరిగితే సీపీ, డీజీపీ ఎందుకు స్పందించ‌లేదు? 

ఇంటిలిజెన్స్ కి తెలియ‌కుండానే కృష్ణ‌ల‌కంలో లాక‌ప్ డెత్ జ‌రిగిందా? 

మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు సూటి ప్ర‌శ్న‌లు

కాకినాడ‌: రైతుల‌కు యూరియా కొర‌త లేకుండా చూడాల్సిన బాధ్య‌త ప్రభుత్వానిదేన‌ని, కౌలు రైతుల‌కు కూడా అన్న‌దాత సుఖీభ‌వ ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌జేయాలని మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు డిమాండ్ చేశారు. కాకినాడ‌లోని త‌న క్యాంప్ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కూట‌మి ప్రభుత్వం రైతుల‌ను పూర్తిగా గాలికొదిలేసింద‌ని, వైయ‌స్ జ‌గన్ గారు ప్ర‌శ్నిస్తే త‌ప్ప ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌ట్ల ప్ర‌భుత్వంలో చ‌ల‌నం రావ‌డం లేద‌ని చెప్పారు. రెడ్ బుక్ రాజ్యాంగం కార‌ణంగానే రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు క్షీణించాయ‌ని, మాది మంచి ప్ర‌భుత్వ‌మ‌ని చెబుతూనే ప్ర‌జ‌ల‌ను కాల్చుకుతింటున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో ఇంటిలిజెన్స్ విభాగం అనేది ప‌నిచేస్తోందా అని ప్ర‌శ్నించారు. 
కూట‌మి ప్ర‌భుత్వం మేక‌ప్‌ల‌పై పెట్టిన శ్ర‌ద్ధ లాక‌ప్‌ల‌లో జ‌రిగే ఘోరాల‌పై పెడితే స‌గం నేరాల‌ను అరిక‌ట్ట‌వ‌చ్చ‌ని మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు స్ప‌ష్టం చేశారు. గుడివాడ అమ‌ర్నాథ్‌కి నోటీసులిచ్చిన మ‌హిళా క‌మిష‌న్‌, సాయి కృష్ణ త‌ల్లి ఫిర్యాదును ప‌ట్టించుకోని సీపీకి ఎందుకివ్వ‌లేద‌ని ప్ర‌శ్నించారు. 

ఆయ‌న ఇంకా ఏం మాట్లాడారంటే... 

- కౌలు రైతులకూ అన్న‌దాత సుఖీభ‌వ వ‌ర్తింప‌జేయాలి

కూట‌మి ప్ర‌భుత్వం ఆక్వా రైత‌ల‌ను ద‌గా చేస్తోంది. రెండు విడ‌త‌లుగా రూ.14 లు ఫీడ్ రేటు పెంచి ఇప్పుడు రూ.4 లు త‌గ్గిస్తూ వారిని ఆదుకున్న‌ట్టు డ్రామాలాడుతోంది. కూట‌మి ప్ర‌భుత్వం రైతుల‌ను వెన్నుపోటు పొడిచింది. వైయ‌స్సార్ రైతు భ‌రోసా ప‌థకానికి అన్న‌దాత సుఖీభ‌వగా పేరు మార్చి వ‌దిలేశారు. మొద‌టి ఏడాది ఒక్క రూపాయి పెట్టుబ‌డి సాయం ఇవ్వ‌కుండా మోసం చేశారు. రెండో ఏడాది 7 ల‌క్ష‌ల మంది రైతుల‌కు ఎగ్గొట్టారు. కౌలు రైతుల‌కు ప‌థ‌కం అంద‌డం లేదు. వైయ‌స్సార్సీపీ హ‌యాంలో 53.58 ల‌క్ష‌ల మంది రైతుల‌కు రైతు భ‌రోసా సాయం అందితే నేడు 46.86 ల‌క్ష‌ల మందికే అన్న‌దాత సుఖీభ‌వ అందిస్తామ‌ని చెబుతున్నారు. మోంథా తుపాన్ న‌ష్ట‌ప‌రిహారం ఇప్ప‌టికీ అంద‌లేదు. సున్నా వ‌డ్డీ రుణాల ఊసేలేదు. ఆత్మ‌హ‌త్య చేసుకున్నఏ ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకోలేదు. ఈ క్రాపింగ్ చేయ‌డం లేదు. ఉచిత పంట‌ల బీమా ఊసే లేదు. రైతుల‌కు క‌నీసం క‌ట్ట యూరియా బ‌స్తా కూడా దొర‌క‌ని దుస్థితి. రైతు భ‌రోసా కేంద్రాల‌కు రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చేసి నిర్వీర్యం చేశారు. 2 ల‌క్ష‌ల ట‌న్నుల మామిడి వృథాగా పోతే ప్రభుత్వం నిద్ర‌పోతుందా? యాప్‌లో బుక్ చేస్తేనే రైతుల‌కు ఎరువులు ఇస్తామ‌ని చెబుతున్నారు. కానీ కౌలు రైతుల‌కు ఎలా తీసుకోవాలో చెప్ప‌డం లేదు. రైతును ఈ ప్రభుత్వం పూర్తిగా రోడ్డున ప‌డేసింది.  అన్న‌దాత సుఖీభ‌వ ప‌థ‌కాన్ని ఈ ఏడాది ఖ‌చ్చితంగా కౌలు రైతుల‌కు కూడా వ‌ర్తింప‌జేయాలి. క‌ళ్ల‌బొల్లి మాట‌ల‌తో రైతుల‌ను వేధించ‌డం మానుకోవాలి. యాప్ ద్వారా ఎరువులు పంపిణీ చేసే విధానాన్ని స‌ర‌ళ‌త‌రం చేయాలని కుర‌సాల క‌న్న‌బాబు డిమాండ్ చేశారు.  

- ప్ర‌జ‌ల‌ను నిత్యం కాల్చుకుతింటున్నారు  

గాదె సాయికృష్ణని లాక‌ప్ డెత్ లో చంపేసి, బూడిద కూడా దొర‌క్కుండా మాయం చేసిన ఉదంతం దేశం మొత్తాన్ని ఆందోళ‌న‌లో ప‌డేసింది. పోలీస్ వ్య‌వస్థ‌ను త‌న గొప్పెట్లో పెట్టుకుని మాన‌వ హ‌క్కుల‌ను ఎలా కాల‌రాస్తుందో చెప్ప‌డానికి ఈ ఘ‌ట‌నే నిలువెత్తు సాక్ష్యం. అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి మంత్రి నారా లోకేష్ రెడ్‌బుక్ చూపించి పోలీసుల‌ను గుప్పెట్లో పెట్టుకుని ప్ర‌తిప‌క్ష పార్టీ నాయకుల మీద క‌క్ష‌సాధింపుల‌కు దిగుతూ వ‌చ్చాడు.  గాదె సాయికృష్ణని లాక‌ప్ డెత్ కి ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హించాలి. అదే కృష్ణ‌లంక పోలీస్ స్టేష‌న్ సీఐ వేధింపుల‌కు మ‌రో ద‌ళిత యువ‌కుడు క్రాంతికుమార్ కూడా బ‌ల‌య్యాడు. రాష్ట్రంలో ఉన్న పోలీస్ స్టేష‌న్‌ల ప‌రిధిలో వెలుగుచూడ‌ని ఎన్నో దారుణాలు జ‌రుగుతూనే ఉన్నాయి. క్షేత్ర‌స్థాయిలో చాలా మంది పోలీస్ అధికారులు అమాన‌వీయంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పోలీసులు వాడుతున్న భాష కూడా సంస్కార హీనంగా ఉంటోంది. గాదె సాయికృష్ణ, క్రాంతి కుమార్‌ల ప‌ట్ల సీఐ వ్య‌వ‌హ‌రించిన తీరుపై సీపీ, ఎస్పీ, డీజీపీ స‌కాలంలో స్పందించి ఉంటే వారి ప్రాణాలు ద‌క్కేవి. సాయికృష్ణ‌ను వెతికిప‌ట్టుకుంటామ‌ని ఈనెల 15న కోర్టుకు తెలిపిన పోలీసులు, ఇప్పుడు సీఐ నాగ‌రాజుపై హ‌త్యాయత్నం కేసు నమోదు చేయ‌డం చూస్తే సాయికృష్ణ‌ను చంపేశార‌ని ప్ర‌భుత్వం నిర్ధార‌ణకు వ‌చ్చిన‌ట్టే క‌దా?  ముఖ్య‌మంత్రి, హోంమంత్రి బాధ్య‌త‌గా స‌కాలంలో స్పందిస్తే రాష్ట్రంలో ఇలాంటి దారుణాలు అరిక‌ట్టొచ్చు. నిన్న‌టిదాకా చోద్యం చూసిన పోలీసులు, వైయ‌స్ జ‌గ‌న్ గారు బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన వెంట‌నే సీఐపై హ‌త్యాయ‌త్నం కేసు పెట్టారు. వైయ‌స్ జ‌గ‌న్ గారు రంగంలోకి దిగి బాధితుల ప‌క్షాన ఉంటామ‌ని వ‌స్తే త‌ప్ప ప్ర‌భుత్వంలో చ‌ల‌నం రావ‌డం లేదు. ఆక్వా రైతులు, మామిడి రైతులు, పొగాకు రైతుల ప‌క్షాన వైయ‌స్ జ‌గ‌న్ గారు మాట్లాడితేనే వారికి న్యాయం జ‌రుగుతోంది. ప్ర‌జ‌ల‌ను నిత్యం కాల్చుకుతింటూ మంచి ప్ర‌భుత్వం అని ప్ర‌చారం చేసుకుంటున్నారు.

- లాక‌ప్‌డెత్‌కి సింగ‌పూర్‌లో ఏ శిక్ష వేసేవాళ్లో తెలుసా?  
 
రెండేళ్ల‌కే ప్ర‌భుత్వం వైఫ‌ల్యం చెందింద‌ని ప్ర‌జ‌లకు అర్ధమైంది కాబ‌ట్టే న్యాయం కోసం బాధితులు వైయ‌స్ జ‌గ‌న్ గారిని క‌లుస్తున్నారు. లాక‌ప్ డెత్ గురించి స‌మాధానం చెప్పాల‌ని నిల‌దీస్తే మేక‌ప్ పేరుతో డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేశారు. మేక‌ప్ గురించి మాట్లాడార‌ని మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్‌కి నోటీసులు ఇచ్చిన మ‌హిళా క‌మిష‌న్, త‌న కొడుకుని లాక‌ప్ డెత్ చేసి చంపేశార‌ని సాయికృష్ణ త‌ల్లి ఆవేద‌న చెందుతుంటే సీపీకి నోటీసులు ఎందుకు ఇవ్వ‌లేదు? ఈనెల 12న ధ‌ర్నాలో పాల్గొన్న యువ‌కుడిని ఎందుకు వెళ్లావ‌ని బైండోవ‌ర్ చేశారు. మేక‌ప్‌ల మీద పెట్టిన శ్ర‌ద్ద లాక‌ప్‌ల మీద ఎందుకు పెట్ట‌డం లేదు. లాక‌ప్‌ల‌లో ఏం జ‌రుగుతుందో సీసీ టీవీ ఫుటేజ్‌లు ప‌రిశీలించాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూనే స్టేష‌న్‌కి వ‌చ్చిన బాధితుల‌పై పోలీసులు బూతుల‌తో విరుచుకు ప‌డుతున్నారు. రాష్ట్రంలో అస‌లు ఇంటిలిజెన్స్ వ్య‌వ‌స్థ ప‌నిచేస్తుందా అనే అనుమానం క‌లుగుతోంది. లాక‌ప్‌డెత్‌లు జ‌రుగుతుంటే వారు ప్ర‌భుత్వానికి నివేదిక ఇవ్వ‌కుండా ఏం చేస్తున్నారు. వాళ్లు స‌మాచారం ఇచ్చి ఉంటే ప్రభుత్వం ఎందుకు ప‌ట్టించుకోలేదు?  ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా క‌ళ్లు తెర‌వాలి. ప్ర‌జ‌ల క‌నీస అవ‌స‌రాల‌పై దృష్టిపెట్టాలి. డీఎస్సీపై వైయ‌స్ జ‌గ‌న్ గారికి స‌వాల్ చేశాన‌ని విర్ర‌వీగిన నారా లోకేష్‌, చర్చ‌కు తాము సిద్ధంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించి మూడు రోజులైనా ఆయ‌న నుంచి స‌మాధానం లేదు. ప‌బ్లిసిటీ ఎక్కువ ప‌నిత‌నం త‌క్కువ అన్న‌ట్టుగా ఉంది ప్ర‌భుత్వ ప‌రిస్థితి. సింగ‌పూర్ ని ఆద‌ర్శంగా తీసుకునే చంద్ర‌బాబు, ఇదే లాక‌ప్‌డెత్ సింగ‌పూర్‌లో జ‌రిగి శ‌వం కూడా దొర‌క్కుండా కాల్చి బూడిద చేస్తే ఏం శిక్ష వేస్తారో చెప్పాలి.

Back to Top