వాలంటీర్ వ్యవస్థతో విప్లవాత్మక మార్పులు

ప్రజల ఇంటి ముంగిటకు ప్రభుత్వ పథకాలు

అవినీతి లేని స్వచ్ఛపాలనకు తార్కాణాలు

మైలవరంలో ఘనంగా వాలంటీర్లకు వందనం

వాలంటీర్లను సత్కరించిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు  

ఎన్టీఆర్ జిల్లా:  ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  ఆశయాలకు అనుగుణంగా ప్రజల ఇంటి ముంగిటకు పథకాలను అందజేస్తూ, అవినీతి లేని స్వచ్ఛపాలనకు తార్కాణాలుగా వాలంటీర్లు నిలుస్తున్నారని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు కొనియాడారు. మైలవరంలోని ఎస్.వి.ఎస్ కళ్యాణమండపంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు హాజ‌ర‌య్యారు. జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దివంగత మహానేత వైయ‌స్ రాజశేఖరరెడ్డి   ప్రతిమకు పూలమాల వేసి ఘననివాళులర్పించారు.

జి.కొండూరు, రెడ్డిగూడెం, మైలవరం మండలాలకు చెందిన వాలంటీర్లకు సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర అవార్డులను ప్రదానం చేసి వారిని ఘనంగా సత్కరించారు.

ఈ సంద‌ర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ.. వాలంటీర్ వ్యవస్థతో పాలనలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. దాదాపుగా అందరూ నిబద్ధతతో పనిచేయబట్టే సత్ఫలితాలు వస్తున్నాయన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు. కోవిడ్ సమయంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి వాలంటీర్లు సేవలందించారని గుర్తు చేశారు.

జగనన్న సంక్షేమ పాలనకు సారథులు వాలంటీర్లేనన్నారు. క్షేత్రస్థాయిలో వాలంటీర్లు అందిస్తున్న సేవలు అజరామరమన్నారు. జగనన్న తలపెట్టిన పేదరిక నిర్మూలన అనే యజ్ఞంలో వాలంటీర్ల పాత్ర ఎంతో కీలకం అన్నారు. సేవలను బాధ్యతగా అందిస్తున్న వాలంటీర్లకు సలాం అన్నారు.

సీఎం జగనన్న మానసపుత్రిక వాలంటీర్ వ్యవస్థ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా, ఒక్క మన రాష్ట్రంలోనే ఉన్న గొప్ప వ్యవస్థ ‘గ్రామ, వార్డు వాలంటీర్ వ్యవస్థ’ అన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నారనే వాలంటీర్లపై ప్రతిపక్షాలు దుష్ప్రచారాలు చేస్తున్నాయన్నారు.

గతంలో జన్మభూమి కమిటీ పేరుతో దోపిడీ జరిగిందన్నారు. గత జన్మభూమి కమిటీలకు, వాలంటీర్ వ్యవస్థకి మధ్య తేడాను ప్రజలంతా గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Back to Top