వైయస్‌ఆర్ జిల్లా: ప్రజాభిప్రాయంపై చంద్రబాబుకు గౌరవం ఉంటే మూడు రాజధానులకు సహకరించాలని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ కంచుకోటల్లోనూ వైయస్‌ఆర్ సీపీ హవా కొనసాగిందన్నారు. మూడు ప్రాంతాల ప్రజలు వైయస్‌ఆర్ సీపీకి పట్టం కట్టారన్నారు. ప్రజల తీర్పు తమలో మరింత బాధ్యతను పెంచిందని గడికోట చెప్పారు. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్, చంద్రబాబు బొమ్మలపై ఎన్నికలు జరిగితే 99 శాతం మంది ప్రజలు సీఎం వెంటే నడుస్తారన్నారు. అందుకు కారణం సీఎం వైయస్ జగన్ చేస్తున్న మంచి పనులు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ఆయన వ్యక్తిత్వమేనని చెప్పారు. కేవలం 21 నెలల పాలనలోనే సీఎం వైయస్ జగన్ తను అనుకున్న దానికంటే ఎక్కువ సాధించారని చీఫ్ విప్ గడికోట అన్నారు. ప్రతిపక్షాలు దారుణమైన విమర్శలు చేస్తున్నా, పత్రికలు, టీవీలు మంచిని చెడుగా చూపిస్తున్నా.. ఇన్ని చేసినా కూడా ప్రజలు వైయస్‌ఆర్ సీపీని ఎలా ఆదరించారనేది మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. సర్పంచ్, మున్సిపల్ ఏ ఎన్నికల్లోనూ సీఎం వైయస్ జగన్ నాకు ఓటేయండి అని ఒక్క మాట మాట్లాడలేదని, రోడ్‌షోలు, ర్యాలీలు చేపట్టలేదని, సీఎం ఆలోచనను ప్రజలు బ్యాలెట్ పేపర్‌పై నిరూపించారన్నారు. వ్యక్తిగత అజెండా, రియలెస్టేట్ వ్యాపారం కోసం కృత్రిమ ఉద్యమాలు చేసే చంద్రబాబుకు ప్రజలు రెండు సార్లు తగిన గుణపాఠం చెప్పారన్నారు.