ఆ 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు జంతువులేనా?  

హరికృష్ణ శవం పక్కన సంప్రదింపులు జరపలేదా?

కేటీఆర్‌తో మాట్లాడితే అంత ఉలుకెందుకు ?

ప్రత్యేక హోదా సాధించడమే వైయ‌స్ఆర్‌సీపీ లక్ష్యం

ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి

కర్నూలు :  కోల్‌కతా సభలో బీజేపీ వాళ్లు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను జంతువులను కొనుగోలు చేసినట్లు కొంటున్నారని చంద్రబాబు ప్రసంగించారని, రాష్ట్రంలో  వైయ‌స్ఆర్‌సీపీ నుంచి చేర్చుకున్న 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు కూడా జంతువులు అవునో.. కాదో చెప్పాలని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి నిల‌దీశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  ‘ఆంధ్రుల ఆత్మగౌరవం అంటూ గగ్గోలు పెడుతున్న రాష్ట్ర మంత్రులు, టీడీపీ నాయకులు ఆనాడు హరికృష్ణ శవాన్ని పక్కన పెట్టుకుని చంద్రబాబునాయుడు.. టీఆర్‌ఎస్‌తో పొత్తుల గురించి మాట్లాడినప్పుడు ఎక్కడికి పోయారని ఆయ‌న‌ ప్రశ్నించారు.

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇటీవల వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని కలిస్తే టీడీపీ నాయకులు ఎందుకు అంత ఉలికి పాటుకు గురవుతున్నారో అర్థం కావడం లేదని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రావాలంటే తెలుగు రాష్ట్రాల ఎంపీలందరూ కలిసి పోరాటం చేస్తామని కేటీఆర్‌ హామీ ఇవ్వడంతో ఫెడరల్‌ ఫ్రంట్‌పై తమ పార్టీ నాయకులతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని మాత్రమే జగన్‌ చెప్పారన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌లో చేరుతున్నామని ఎక్కడా ప్రకటించ లేదన్నారు.

ఇదే విషయం కేటీఆర్‌ కూడా ప్రకటించారన్నారు. ఏపీలో టీఆర్‌ఎస్‌తో  వైయ‌స్ఆర్‌సీపీ పొత్తు పెట్టుకుందని తప్పుడు ప్రచారం చేయడం సిగ్గు చేటన్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం పాకులాడి, చివరకు కాంగ్రెస్‌ తో కలిసి పోటీ చేసినట్లు చంద్రబాబే బహిరంగంగా ఎన్నో సార్లు చెప్పారని, ఆ విషయం ప్రజలకు తెలుసునన్నారు. అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్‌ను ఆహ్వానించి అక్కడ శిలాఫలకంపై పేరు కూడా వేయించు కోలేదా అని గుర్తు చేశారు. అధికారం కోసం విలువలు లేని రాజకీయాలు చేయడం చంద్రబాబు నైజమన్నారు. ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు ఘనత ఆయనకే దక్కిందన్నారు. విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత టీడీపీ నాయకులకు లేదన్నారు. 

 
 

Back to Top