హామీలు అమలు చేయాలని అడిగితే కేసులా

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్టులా

సోషల్ మీడియా గొంతు నొక్కుతున్న ప్రభుత్వం

కూటమి ప్రభుత్వ తీరుపై మాజీ ఎంపీ మార్గాని భరత్ ఫైర్.

కేసులు పెట్టినా, అరెస్టు చేసినా ప్రశ్నిస్తూనే ఉంటాం.

ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు పోరాడతాం.

ప్రజల గొంతుకై నిలబడతాం.

ప్రభుత్వానికి మార్గాని భరత్ స్పష్టీకరణ.

రాజమండ్రి: ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు దాటినా... సూపర్ సిక్స్ పేరుతో మీరు ప్రజలకిచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తే... కేసులు పెడుతున్నారని మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టుకున్న తాను ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటామని, అరెస్టు చేసినా అందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తేల్చిచెప్పారు. బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా తాము ప్రజలపక్షాన గొంతెత్తడంలో తప్పేముందని సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

సోషల్ మీడియాలో ప్రభుత్వం చేసే తప్పిదాలను ప్రశ్నిస్తే గొంతునొక్కుతున్నారని ఇదెక్కడి న్యాయమని నిలదీశారు. వైయస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ ను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఉగ్రవాదా అని ప్రశ్నించారు.  సోషల్ మీడియా ప్రజల పక్షాన ఉంటుందని, అక్రమంగా కేసులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికీ వైయస్.జగన్ మోహ‌న్ రెడ్డి అండగా ఉంటారని తెలిపారు. 

తల్లికి వందనం పేరుతో ప్రతి తల్లికి, ఎంత మంది పిల్లలుంటే అందరికీ ఇస్తామన్న హామీని ఎందుకు అమలు చేయడం లేదన్నారు. కాలేజీలకు వెళ్లే పిల్లలకు ఫీజులు చెల్లించని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైల్లో పెడతారా అని నిలదీశారు.
మరోవైపు వాలంటీర్లకు రూ.10వేలు ఇస్తామని ఆశ కల్పించి కూటమి ప్రభుత్వం వారిని గాలికొదిలేయడం మోసం, అన్యాయం కాదా దీనిపై మాట్లాడితే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. 
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నాకు వైన్ షాపుల్లో 30శాతం వాటా ఇవ్వాలని బహిరంగంగా మాట్లాడితే ఆయనపై ఏం కేసులు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. లోకేష్ తో సహా టీడీపీ నేతలు గతంలో అమ్మకు ఒడి, నాన్నకు బుడ్డి అని ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెట్టడంతో పాటు, సైకో జగన్ అని నోటికొచ్చినట్లు మాట్లాడిన వీళ్లనేం చేయాలని నిలదీశారు. అధికారం శాశ్వతం కాదన్న విషయం గుర్తుంచుకోవాలని కూటమి నేతలకు సూచించారు. 
డ్రైనేజీ వాటర్ నేరుగా గోదావరి  నదిలోకి విడుదల చేయడంపై ప్రశ్నిస్తే, బాధ్యులైన వారిపై కాకుండా నాపై తిరిగి దొంగ కేసులు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ కండువాలతో వచ్చి నేరుగా దాడులకు దిగితే.. వీడియో సాక్ష్యాలున్నా వారినిమాత్రం అరెస్టు చేయడం లేదన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ నేతలను అన్యాయంగా అరెస్టులు చేస్తే న్యాయస్ధానాల్లో పోరాటం చేస్తామని, ఎన్ని కేసులు పెట్టుకున్నా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు.

Back to Top