కాశీబుగ్గ ఘటన ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే

భక్తుల మరణానికి బాధ్యత ప్రభుత్వానిదే 

చంద్రబాబు హిందూ ధర్మ వ్యతిరేకి

తీవ్రంగా మండిపడ్డ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

తాడేపల్లి వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.

కాశీబుగ్గ ఘటనలో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం

ఘటన జరిగింది ప్రైవేటు ఆలయమంటూ సీఎం సహా మంత్రుల ప్రకటన

ఇది ముమ్మాటికీ బాధ్యతారాహిత్యం

ప్రైవేటు ఆలయాలైతే భక్తులకు రక్షణ కల్పించరా? 

సూటిగా ప్రశ్నించిన  వెల్లంపల్లి శ్రీనివాస్

కూటమి పాలనలో ఆలయాలలో వరుస అపచారాలు

తిరుపతిలో ముక్కోటి ఏకాదశి రోజు ఆరుగురు మృతి

సింహాచలంలో గోడ కూడి ఏడుగురు  మృతి

2015 లో గోదావరి పుష్కరాల్లోనూ 29 మంది మృతి 

చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చే తొక్కిసలాటకు కారణం 

వెల్లంపల్లి ఫైర్

చంద్రబాబు బూట్లు వేసుకుని పూజలు చేస్తారు

విజయవాడలో 40 ఆలయాలను కూల్చిన ఘనుడు బాబు

విగ్రహాలను చెత్తలారీలో తరలించిన చంద్రబాబు ప్రభుత్వం

ఇదేనా ఆయనకు హిందూ ధర్మం మీద ఉన్న భక్తి?

నిలదీసిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

తాడేపల్లి: కాశీబుగ్గ ఘటన ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... కాశీబుగ్గ ఘటనలో తొమ్మిది మంది భక్తులు మృతికి భత్రత కల్పించని ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని స్పష్టం చేశారు. అది ప్రైవేటు దేవాలయం, ప్రభుత్వానికి సంబంధం లేదంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులందరూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడ్డంపై వెల్లంపల్లి తీవ్రంగా మండిపడ్డారు.  ప్రైవేటు ఆలయాలైతే భక్తులకు రక్షణ కల్పించరా అని  ప్రభుత్వాన్ని నిలదీశారు. చంద్రబాబు హిందూ వ్యతిరేకి అని...  ఈ  ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన తిరుపతి, సింహాచలంలో భక్తుల మృతి, కాశీనాయన క్షేత్రం కూల్చివేత వంటి వరుస అపచారాలే ఇందుకు నిదర్శనమన్నారు. హిందూ దేవాలయాలకు, భక్తులకు రక్షణ కల్పించడంలో చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. ఇంకా ఏమన్నారంటే...
 

కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లో దేవాలయాల్లో వరుసగా అనేక అపచారాలు చోటుచేసుకున్నాయి.
ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో ఎప్పుడూ భక్తులు మృతి చెందిన దాఖలాలు లేవు. ముక్కోటి ఏకాదశినాడు ఏకంగా 6గురు చనిపోయారు. సింహాచలం చరిత్రలో అనేక ఉత్సవాలు జరిగినా దేవస్థానం చరిత్రలో భక్తులు చనిపోయిన ఘటనలు చోటుచేసుకోలేదు. కూటమి ప్రభుత్వ హయాంలోనే గోడ కూలిన ఘటనలో ఏడుగురు చనిపోయారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి హిందువులన్నా.. హిందూ దేవాలయాలన్నా ప్రేమ లేదు.  వాటిని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్ష కూడా లేదు. భక్తుల రక్షణ మీద అయితే కనీస శ్రద్ధ లేదు. చంద్రబాబు, కూటమి నేతలకు ప్రచారం మీద ఉన్న యావ భక్తుల మీద లేదు. ఇదే ప్రచార పిచ్చితో, తన ఈవెంట్ షూటింగ్ కోసం చంద్రబాబు 2015 లో రాజమండ్రి పుష్కరాల్లో 29 మంది భక్తుల ప్రాణాలను బలిగొన్నాడు. 
ఇంతమంది చనిపోతున్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తోపాటు దేవాదాయ, హోం శాఖ మంత్రులకు భక్తుల మీద ప్రేమ లేదు. దేవాలయాల్లో భక్తులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు, వారికి తగిన రక్షణ ఇవ్వాలన్న ఆలోచన కానీ లేదు. నిత్యం ఏదోఒక విధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద రాజకీయ విమర్శలు చేయడం మినహా కూటమి నేతలకు మరో పని లేదు. 

● ప్రైవేటు ఆలయమంటూ తప్పించుకుంటున్న ప్రభుత్వం...

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దేవాదాయశాఖ మంత్రి, హోంమంత్రి సహా అందరూ ఈ దేవాలయానికి ప్రభుత్వానికి సంబంధం లేదు, అది ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉందంటూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. కార్తీక మాసంలో శివకేశవులు దేవాలయాల్లో విపరీతంగా రద్దీ ఉంటుందన్న విషయం ఈ ప్రభుత్వానికి తెలియదా ? ఆయా పోలీస్ స్టేషన్ ల పరిధిలో ఉన్న ఆలయాలు, కార్తీకమాసంలో వచ్చే భక్తుల సంఖ్య అక్కడ కల్పించాల్సిన భద్రత హోంశాఖకు లేదా ? హోం, దేవాదాయశాఖలు ఎవరికి వారు తమకు సంబంధం లేదంటూ చేతులు దులుపుకుంటున్నారు. 

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే భక్తులు చనిపోవడం దురదృష్టకరమంటూనే ఆ దేవాలయానికి ప్రభుత్వానికి సంబంధం లేదంటూ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మరో అడుగు ముందుకు వేసి.. కొంతమంది వ్యక్తులు ప్రభుత్వానికి చెడ్డపేరు తేవడానికే ఇలాంటి దేవాలయాలు కడుతున్నారంటూ ప్రైవేటు దేవాలయాలు కడుతున్న వ్యక్తుల మీద నింద వేసే ప్రయత్నం చేశారు. ఇది ఎంత వరకు సమంజసం? కార్తీక మాసంలో ప్రతి రోజూ 2-3 వేల మంది, ప్రతి శనివారం 5-10 వేల మంది భక్తులు వస్తుంటారు. అలాంటిది కార్తీకమాసం, శనివారం ఏకాదశి పర్వదినాన ఎంతమంది భక్తులు వస్తారన్నది విషయాన్ని పోలీస్ యంత్రాంగం ఎందుకు అంచనా వేయలేకపోయారు? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు?  అంటే కేవలం వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉపయోగపడుతుందా?  

● బాధ్యత లేని ప్రభుత్వమిది...

హోం మంత్రి అనిత మాకు సంబంధం లేదంటూ అత్యంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. ప్రజలు భారీగా వచ్చే చోట్ల పోలీసు బందోబస్తు పెట్టాలని తెలియదా? రాష్ట్రంలో అసలు ప్రైవేటు ఆలయాలు లేవా?  ఆలయాన్నీ దేవాదాయశాఖ పరిధిలోనే ఉంటాయా?  రాష్ట్రంలో చాలాచోట్ల ప్రైవేటు వ్యక్తులు ఆలయాలను నిర్వహిస్తున్న విషయం తెలియదా? ఉత్సవాల పేరుతో విజయవాడలో సినిమా పాటల డ్యాన్స్ కార్యక్రమాలకు మాత్రం పూర్తిస్ధాయిలో పోలీసు బందోబస్తు కల్పిస్తున్న ప్రభుత్వం.. హిందూ దేవాలయాలకు వచ్చే భక్తులకు మాత్రం భద్రత కల్పించలేరా?  ఇదేనా మీ పరిపాలన చంద్రబాబునాయుడు గారూ? 
కాశీబుగ్గ దుర్ఝటన చూస్తే మనసు తరుక్కుపోతుంది. ఏకాదశి రోజున దేవుడికి దండం పెట్టుకుంటే మంచి జరుగుతుందని వచ్చిన అమాయక ప్రజలు.. ప్రాణాలు కోల్పోయి విగతజీవులుగా పడి ఉన్నారు. మునుపెన్నడూ ఈ తరహా ఘటలు లేవు. వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో  తెలుగుదేశం పార్టీ  చేసిన కుట్రలన్నింటినీ మేం ఆరోజు సమర్ధవంతంగా ఎదుర్కోగలిగాం. 

● కూటమి పాలన- ఆలయాల్లో అపచారాలు..

కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ఇన్ని ఘటనలు జరుగుతున్నా.. ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కనీస మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ నేత డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి బాధితులను ఆదుకునే, వారికి వైద్యం అందించే ప్రయత్నం చేశారు. పోలీసులకు పోన్ చేసినా సరైన స్పందన లేదని చెబుతున్నారు. హోంమంత్రి అనిత ఇలాంటి సమస్యలపై దృష్టి పెట్టాలి. అంతే తప్ప  వైయస్సారీపీ నేతలపై ఎలా కక్ష సాధింపు చర్యలుచేపట్టాలి ? ఎవరి మీద కేసులు పెట్టాలన్న విషయాల మీద దృష్టి తగ్గించాలి.
కొత్తగా దేవాలయం ప్రారంభమైందని చెబుతున్న హోం మంత్రికి అక్కడకి ఎంత మంది భక్తులువస్తారు? ఎంత మంది బందోబస్తు పెట్టాలన్న విషయం కూడా తెలియదా?  ఇదేం పరిపాలన?  హిందూ దేవాలయాల మీద, భక్తుల మీద శ్రద్ద ఇదేనా?  మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుస అపచారాలు జరుగుతూనే ఉన్నాయి. శ్రీకూర్మంలో నక్షత్ర తాబేల్లు  చనిపోతే పట్టించుకోలేదు. చిన్న తిరుపతి గోశాలలో ఆవుదూడ చనిపోతే పట్టించుకోలేదు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే భగవద్గీత గురించి చులకనగా మాట్లాడుతున్నారు. 
తిరుపతి కొండమీద కోడిగుడ్లు, పలావు ప్యాకెట్లు దొరుకుతున్నాయి. చెప్పులతో తిరుపతిలో స్వామి వారి దర్శనంచేసుకుంటున్నారు. కాశీనాయన క్షేత్రం అటవీశాఖ పరిధిలో ఉంటే  గతంలో వైయస్.జగన్ ముఖ్యమంత్రి హోదాలో కాశీనాయన క్షేత్రాన్ని అటవీశాఖ పరిధి నుంచి  తప్పించాలని కేంద్రానికి లేఖ రాశారు. 

కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత దుర్మార్గంగా కాశీనాయన క్షేత్రాన్ని కూల్చి వేసింది. భక్తులు తిరగబడితే మా డబ్బులతో కడతామని నారా లోకేష్ కల్లబొల్లి  కబుర్లు చెప్పారు. చంద్రబాబు శ్రీ వేంకటేశ్వరస్వామి మా కులదైవం అంటూనే.. చెప్పులు, బూట్లుతో పూజలు చేస్తాడు. గతంలో మనం పలుసందర్భాల్లో చూశాం. చంద్రబాబు ఈనాడు రామోజీరావుని కలిస్తే.. చెప్పులు తీసేస్తాడు. దేవుడి పూజ మాత్రం చెప్పులతోనే చేస్తాడు. 
ప్రభుత్వానికి ఒక్కటే చెబుతున్నాం. ప్రభుత్వ పరిధిలోనివి అయినా ప్రైవేటు దేవాలయాలైనా వాటికి, అక్కడకి వచ్చే భక్తులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కొత్తగా దేవాలయాలు నిర్మించే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఎలాగూ లేదు... కనీసం ప్రైవేటు వ్యక్తులు దేవాలయాలు కడితే చంద్రబాబు వాళ్లమీద నిందలు మోపడం సరికాదు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడ నగరనడిబొడ్డులో పుష్కరాల పేరుతో 40 కు పైగా దేవాలయాలను కూల్చివేసి, ఆ విగ్రహాలను మున్సిపల్ చెత్త వాహనంలో తరలించిన మాట వాస్తవం కాదా?  తిరిగి వైయస్.జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ దేవాలయాలన్నింటినీ తిరిగి అదే ప్రదేశంలో నిర్మించి ప్రారంభించారు.

● ఇప్పుడు ఏ దీక్ష పవన్ కళ్యాణ్...

హిందువు అని చెప్పుకునే హిందూ ద్రోహి చంద్రబాబు అయితే, జరగని తప్పులకు పశ్చాత్తాప దీక్షలు చేసే పవన్ కళ్యాణ్.. ఇప్పడు ఇంత పెద్ద తప్పు జరిగితే ఎందుకు దీక్షలు చేయడం లేదు? ఈ దుర్ఘటనకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణం. భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. హిందూ దేవాలయాలకు, దేవాలయాలకు వచ్చే భక్తులకు భద్రత కల్పించడంలోనూ ప్రభుత్వం విఫలమైంది. గుడికి వెళ్ళే భక్తులు తిరిగి వచ్చే పరిస్థితి లేదన్న విధంగా కూటమి పాలన కనపడుతోంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తప్పులను సరిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని వెల్లంపల్లి డిమాండ్ చేశారు.  తొక్కిసలాటలో మృతి చెందిన భక్తులవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలని తేల్చి చెప్పారు.

Back to Top