ఎమ్మెల్యే సోమిరెడ్డి అక్రమాలపై మాజీ మంత్రి కాకాణి ధర్మపోరాటం

జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయం వద్ద ఆందోళన

శ్రీ‌పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు జిల్లా: దేవాలయ భూములపై జరుగుతున్న అక్రమాలపై మాజీ మంత్రి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్య‌క్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధర్మపోరాటం మొదలుపెట్టారు. శ‌నివారం ఆయన జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టి, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్‌ను కలిసి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అక్రమాలపై అధికారికంగా ఫిర్యాదు అందజేశారు. ఈ సంద‌ర్భంగా 
కాకాణి మాట్లాడుతూ.. కాకుటూరు గ్రామంలో సర్వే నెంబర్ 63-A1 లోని 0.48 సెంట్ల దేవాలయ భూమిని ప్రైవేటు రియల్‌ఎస్టేట్ యజమానులకు లబ్ధి చేకూరేలా రోడ్డు నిర్మాణం పేరిట అక్రమంగా ఆక్రమించార‌ని విమ‌ర్శించారు.
డాక్యుమెంట్ నెంబర్ 23/1980 ప్రకారం ఆ భూమి శ్రీ రాజా రాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం పేరిట రిజిస్టర్డ్‌గా ఉండగా, ఎమ్మెల్యే సోమిరెడ్డి ఒత్తిడి, ప్రైవేటు ప్రయోజనాల కోసం ఈ భూమిని అక్రమంగా వాడుకున్నట్లు ఆరోపించారు. సుమారు ఆరు కోట్ల విలువైన ఈ దేవుని భూమిని కోటి రూపాయల లావాదేవీలతో అక్రమ ప్రయోజనాలకు వాడుకున్నట్టు ఆయన విమర్శించారు.

కూటమి ప్రభుత్వం వచ్చాక దేవాలయాల భూములకు రక్షణ లేదని, అవినీతి పాలన పెచ్చరిల్లిందని కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయ భూములను దోచుకునే ప్రయత్నాలపై తాను న్యాయపోరాటం చేస్తానని స్పష్టంచేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రావెల్, ఇసుక, బూడిద..ఇలా ఎలాంటి సంపదలను టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి వదిలిపెట్ట‌డం లేద‌ని. ఆయ‌న అక్ర‌మాల‌న్నీ ప్ర‌జ‌లు చూస్తూనే ఉన్నారని చెప్పారు.
“సనాతన ధర్మం గురించి నిత్యం ఉపన్యాసాలు ఇచ్చే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ఈ దేవాలయ భూ ఆక్రమణలపై పరిశీలనకి ముందుకు వస్తారా?” అని ఆయన ప్రశ్నించారు. తమపై ఇరిగేషన్‌ గురించి అవగాహన లేదని సోమిరెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమని విమ‌ర్శించారు. మీడియా సమక్షంలో ఇరిగేషన్ సబ్జెక్ట్‌పై ఓపెన్ డిబేట్‌కు రావడానికి సిద్ధమా అంటూ సోమిరెడ్డికి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి స‌వాల్ విసిరారు.  దేవాలయ భూముల రక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని, ఈ అక్రమాలన్నింటినీ వెలికితీసి ప్రజల ముందుకు తీసుకురావ‌డ‌మే త‌న ధ్యేయ‌మ‌ని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు.

Back to Top