అనంతపురం జిల్లా: కూటమి ప్రభుత్వంలో ప్రజలకు, ప్రజల పక్షాన నిలిచే జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోతుందని, జరుగుతున్న అక్రమాలను నిర్భయంగా వార్తలు రాసే విలేకరులకు రక్షణ లేకుండా పోతుందని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ మండిపడ్డారు. బుక్కరాయసముద్రం మండలం పసులూరు గ్రామంలో ఎర్రమట్టి అక్రమ దందాదారుల చేతిలో బెదిరింపులకు గురైన ప్రజాశక్తి విలేకరి పెద్దన్నను శైలజానాథ్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు. జరిగిన సంఘటనపై బుక్కరాయసముద్రం ఎస్సై రామ్‌ప్రసాద్‌తో చరవాణిలో మాట్లాడి, భౌతిక దాడికి పాల్పడి కులం పేరుతో దూషించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. అనంతరం జగనన్న కాలనీలో టిడీపీ కార్యకర్తలు అక్రమంగా ఎర్రమట్టిని తరలించిన లేఔట్స్‌ను ఆయన పరిశీలించారు. శైలజానాథ్ మాట్లాడుతూ…దళిత కులానికి చెందిన ప్రజాశక్తి విలేకరి పెద్దన్నపై టిడీపీ కార్యకర్తలు హరి, పవన్ అర్ధరాత్రి దారుణంగా ఇంటిలోకి చొరబడి దాడికి యత్నించి, కులం పేరుతో దూషించడంతో పాటు, అక్కడ ఉన్న మహిళలను అనుచిత పదజాలంతో మాట్లాడారు. దీంతో కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. జగనన్న కాలనీలో నెలలుగా జరుగుతున్న ఎర్రమట్టి అక్రమ రవాణాపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ లేఔట్స్‌లో యథేచ్ఛగా జరుగుతున్న ఈ దందాపై కనీసం ఎమ్మెల్యేకు తెలియదా అని వారు ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతూ సమాజానికి అన్యాయం జరుగుతుంటే, దానిపై స్పందించాల్సిన ప్రజా ప్రతినిధులు మౌనం పాటించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ అక్రమాలపై పత్రికల్లో వాస్తవాలు బయటపెడుతున్న విలేకరులను బెదిరించడం, దాడులకు పాల్పడడం వంటి ఘటనలు సహించదగినవి కావని ఆయన హెచ్చరించారు.ప్రభుత్వ ఆస్తులను రక్షించేందుకు అధికార యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో టిడీపీ నాయకుల ఇసుక, ఎర్రమట్టి అక్రమ దందాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, ప్రభుత్వ ఆస్తులను దోచుకుంటూ కొనసాగుతున్న ఈ అక్రమాలను అరికట్టేందుకు వైయస్ఆర్‌సీపీ తరఫున రానున్న రోజుల్లో సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అక్రమ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ మండల అధ్యక్షుడు, నియోజకవర్గ ఎస్సీ సెల్ నాయకులు, మండల–జిల్లా ఎస్సీ సెల్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.