డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి

లోకేష్‌ రాజీనామా చేసి విచారణను ఎదుర్కోవాలి

శింగనమలలో వైయస్సార్‌సీపీ టౌన్‌హాల్‌ సమావేశంలో మాజీ మంత్రి డాక్టర్‌ సాకే శైలజానాథ్‌ డిమాండ్‌

శింగనమల: డీఎస్సీ–2025 నియామకాలలో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ సాకే శైలజానాథ్‌ డిమాండ్‌ చేశారు. శింగనమల మండల కేంద్రంలోని శ్రీ వాసవి కళ్యాణ మండపంలో నిర్వహించిన వైయస్సార్‌సీపీ టౌన్‌హాల్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాలపై అభ్యర్థుల్లో తీవ్ర అనుమానాలు నెలకొన్నాయని, ప్రభుత్వం పారదర్శక విచారణకు సిద్ధం కాకపోవడం మరిన్ని సందేహాలకు తావిస్తోందని విమర్శించారు.

డీఎస్సీలో పారదర్శకత ఎక్కడ?

ఉద్యోగాల పేరుతో యువతకు హామీలు ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను మోసం చేసిందని సాకే శైలజానాథ్‌ ఆరోపించారు. డీఎస్సీ నియామకాలలో చోటుచేసుకున్న అవకతవకలపై ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరిస్తే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. స్పోర్ట్స్‌ కోటా నియామకాలతో పాటు మొత్తం ఎంపిక ప్రక్రియపై స్వతంత్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.

విద్యార్థులు, నిరుద్యోగులకు న్యాయం చేయాలి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల కాక వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాలేజీలు సర్టిఫికెట్లు నిలిపివేస్తున్నాయని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3,000 భృతి ఇస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. పెండింగ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేసి, ఎన్నికల హామీ ప్రకారం నిరుద్యోగ భృతిని అమలు చేయాలని కోరారు.

ఉద్యమం మరింత ఉధృతం చేస్తాం

డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ, లోకేష్‌ రాజీనామా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదల, నిరుద్యోగ భృతి అమలు వంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని సాకే శైలజానాథ్‌ డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులు, నిరుద్యోగ యువతతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి వంశి గోకుల్‌ రెడ్డి, ఐటీ వింగ్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మంజునాథ్ యాద‌వ్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.
 

Back to Top