వైయ‌స్ఆర్‌సీపీకి పెరుగుతున్న ఆదరణ

మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం:  కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనతో ప్రజలు విసిగిపోయారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు, క్షేత్రస్థాయిలో అమలవుతున్న పరిస్థితులకు పొంతన లేకపోవడంతో ప్రజలు వాస్తవాలను గుర్తిస్తున్నారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న వైయ‌స్ఆర్‌సీపీ వైపు ప్రజల ఆదరణ మళ్లీ పెరుగుతోందని పేర్కొన్నారు. గార మండలం తూలుగు పంచాయతీ ఉప్పరపేట గ్రామంలో టీడీపీకి చెందిన నాలుగు కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో గార మండలం ఎంపీపీ గొండు రఘురామ్, మాజీ సర్పంచ్ కొయ్యనా నాగభూషన్, ఎస్‌ఈసీ సభ్యులు గొండు కృష్ణమూర్తి, మండల పార్టీ అధ్యక్షుడు పీస గోపి తదితర నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ఎన్నికల తర్వాత తొలిసారి గ్రామానికి వచ్చానని, ఎన్నికల సమయంలో మోసపోయామని బయటకు చెప్పుకోలేకపోయిన వారు ఇప్పుడు ధైర్యంగా బయటకు వస్తున్నారని అన్నారు. గ్రామంలో మార్పు రావాలంటే బలమైన నాయకత్వం అవసరమని, అందుకే నాలుగు కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరుతున్న విషయం తెలుసుకుని వారిని ఆహ్వానించేందుకు వచ్చానని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో వాస్తవం లేదని ప్రజలు అర్థం చేసుకుని విసిగిపోయారని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించి కూడా ఆ ధరకు పంట కొనుగోలు చేయడం లేదని, రూ.2,400 ధర ప్రకటించి రూ.1,700కే కొనుగోలు చేస్తే రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఎరువులు అందుబాటులో లేకపోవడం, బ్లాక్‌ మార్కెట్‌లో అదనంగా ధర చెల్లించాల్సి రావడం రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందన్నారు.

రాష్ట్రంలో ఇసుక, మట్టి సహా అందుబాటులో ఉన్న వనరుల దోపిడీ జరుగుతోందని ధర్మాన ప్రసాదరావు అన్నారు. గార ప్రాంతంలో మంచినీటి ప్రాజెక్టులు దెబ్బతిని గ్రామాలకు ఉప్పునీరు వచ్చే పరిస్థితి ఏర్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం మోసాలు, దోపిడీ, లంచాలు, అవినీతికే ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో చేపట్టిన కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం తమవిగా చెప్పుకుంటోందని, భోగాపురం విమానాశ్రయానికి సంబంధించిన పనులు, టెక్కలి సమీపంలోని పోర్టుకు సంబంధించిన చర్యలు గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని తెలిపారు.

పేదల సొంతింటి కల కోసం గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం సుమారు రూ.12 వేల కోట్లు వెచ్చించి భూములు కొనుగోలు చేసిందని ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రతి గ్రామంలో కనిపిస్తున్న పెద్ద లేఅవుట్లు గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినవేనని తెలిపారు. కొత్త పెన్షన్లు ఇవ్వడానికి కూడా ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారిలో ఎవరో ఒకరు తొలగిపోవాలని ఎదురుచూసే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రైతులు, కూలీలు, పేదలు, మధ్యతరగతి ప్రజలు రెండేళ్ల పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నిత్యావసర ధరలు, విద్యుత్‌ బిల్లులు పెరిగిపోయాయని పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలిచే రైతుల, పేదల ప్రభుత్వం రావాలంటే అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉప్పరపేటలో ప్రారంభమైన చేరికలు మరింత పెరిగి, వైయ‌స్ఆర్‌సీపీ బలోపేతం కావాలని, టీడీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజు వస్తుందని ధర్మాన ప్రసాదరావు అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు ముంజెటి కృష్ణ, శ్రీకాకుళం నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షులు పీస శ్రీహరి, బారటం నాగేశ్వరరావు, వైస్‌ ఎంపీపీ బాలకృష్ణ, యాళ్ల నారాయణ, రాష్ట్ర పోలినాటి వెలమ విభాగం అధ్యక్షుడు అంబటి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ సురేష్, వైస్‌ ఎంపీపీ రామకృష్ణ, మహేష్, తమ్మిన రాజు, నాగరాజు, గార మండల వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పాల్గొన్నారు.

 

Back to Top