శ్రీకాకుళం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటనను విజయవంతం చేసిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అభినందనలు తెలిపారు. పార్టీ శ్రేణుల సమిష్టి కృషి వల్లే పర్యటన ఘనవిజయం సాధించిందని పేర్కొన్న ఆయన, ప్రతిపక్షంలో ఉన్న ప్రతి నాయకుడు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ కేడర్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రతి నాయకుడి బాధ్యత అని ధర్మాన ప్రసాదరావు అన్నారు. మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అరెస్టును నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా జరిగిన నిరసనలు పార్టీ పోరాట స్ఫూర్తికి నిదర్శనమని పేర్కొన్నారు. వైయస్సార్‌సీపీ నాయకులపై నమోదైన అక్రమ కేసులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామ గ్రామాన సమావేశాలు నిర్వహించి ప్రజలకు వాస్తవాలు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ, కేంద్ర అనుమతులు, ఆర్థిక సమీకరణ, ప్రాజెక్టు మౌలిక ప్రక్రియలన్నీ వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని ధర్మాన ప్రసాదరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.1,200 కోట్లు వెచ్చించి భూసేకరణ, పరిహారం పూర్తి చేసిందని, అనంతరం శ్రీ వైయస్ జగన్ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులో ప్రస్తుత ప్రభుత్వ పాత్ర ఏమిటో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని సవాల్ విసిరారు. ప్రస్తుతం పార్టీకి అనుకూలంగా ప్రధాన మీడియా సంస్థలు లేని పరిస్థితిలో సోషల్ మీడియానే పార్టీ శ్రేణులకు ప్రధాన ఆయుధమని ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త తన సెల్‌ఫోన్ ద్వారా వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారం జరుగుతోందని విమర్శించిన ఆయన, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం పార్టీ శ్రేణులు మరింత చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.