మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమ అరెస్టు దారుణం

కాశిబుగ్గ తోపులాట ఘటన డైవర్షన్ కోసమే ఈ అరెస్ట్

నకిలీ మద్యం కేసులో నిందితులంతా టిడిపీ నేతలే

ప్రధాన సూత్రధారులను తప్పించి, వైసిపీకి అంటగట్టే ప్రయత్నం 

అక్రమ కేసులు, అరెస్టులకు భయపడేది లేదు

తేల్చి చెప్పిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ 

నెల్లూరు లోని మేకపాటి గౌతమ్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో దివంగత మాజీ మంత్రి గౌతమ్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన వైయ‌స్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి పి అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ నేతలు. అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.

నెల్లూరు: మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్టు చేయడం పై వైయ‌స్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు లోని దివంగత మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..  కూటమి ప్రభుత్వానికి ఏదైనా ఘటన వల్ల నష్టం జరిగితే .. దాన్నుంచి వెంటనే డైవర్షన్ చేయడం అలవాటుగా మారిందని మండిపడ్డారు. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన డైవర్షన్ లో భాగమే జోగి రమేష్ అక్రమ అరెస్టని తేల్చి చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...

ఒకవైపు తుపాన్ విపత్తు వల్ల రైతులు నష్టపోతే వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మరోవైపు కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట ఘటన నుంచి దృష్టి మరల్చేదానికి జోగి రమేష్ ను అరెస్టు చేశారు. కల్తీ మద్యం తయారీలో  మీ పార్టీ తరపున పోటీ చేసిన వ్యక్తితో పాటు మీ పార్టీ నేతలే నిందితులుగా ఉన్నారు. వారెవరనీ ఇంతవరకు అరెస్టు చేయలేదు. కేవలం కక్ష సాధింపు చర్యలతోనే ఒక తప్పుడు స్టేట్ మెంట్ రాయించి, దాని ఆధారంగా అరెస్టు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే ప్రక్రియ నడుస్తోంది. ఇవాళ మా పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్ ప్రజల్లోకి వస్తుంటే...  ఆయన్ను ఎన్నుకోకపోవడం వల్ల నష్టం జరిగిందనే భావన వారిలో కనిపిస్తుంది. చంద్రబాబు అబద్దపు హామీల వల్ల మోసపోయామని ప్రజలు తెలుసుకున్నారు. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే అరెస్టులు చేస్తున్నారు. 
కల్తీ లిక్కర్ కేసుపై సీబీఐతో విచారణ చేయించండి, నా ప్రమేయం ఉంటే అరెస్టు చేయండని జోగి రమేష్ సవాల్ చేశారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐతో విచారణ చేయించాలి. అప్పుడే నిజాలు బయటపడతాయి. అవేవీ చేయకుండా.. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ తరహా అరెస్టులకు పాల్పడుతున్నారు. కాశీబుగ్గ ఘటనలో ఆలయ ధర్మకర్త మీద కేసు పెట్టిన పోలీసులు... తిరుమలలో భక్తులు చనిపోయినప్పుడు టీటీడీ చైర్మన్ మీద ఎందుకు కేసులు పెట్టలేదు ? సింహాచలంలో జరిగిన ఘటనపై ఎందుకు కేసు పెట్టలేదు? పెద్దలకు ఒక న్యాయం, సామాన్యుడికి ఒక న్యాయమా? జరుగుతున్న కక్ష సాధింపు చర్యలను రాష్ట్ర ప్రజలందరూ గుర్తించారు. మీ అక్రమాలు, అన్యాయాలపై ప్రజలందరూ ఏకమై బుద్ధి చెప్పే సమయం వస్తుందని... తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అనిల్ కుమార్ యాదవ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

Back to Top