చిత్తూరు: టీవీ-5 ఛానల్‌లో తాను చెప్పని మాటలు చెప్పినట్లుగా బ్రేకింగ్స్ వేశారని మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఎక్స్ వేదికగా నారాయణస్వామి ఏమన్నారంటే.. టీవీ-5 ఒక తప్పుడు ఛానల్. అందుకే మా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాన్ని నిషేధించింది. తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు తప్ప, ప్రజల ప్రయోజనాలు పట్టని ఛానల్ అది. ఇవాళ మా ఇంటికి టీవీ-5 రిపోర్టర్ వచ్చారు. ఇంటికి వచ్చాడు కదా అని గౌరవించి కూర్చోబెట్టాను. అక్రమ లిక్కర్ కేసు గురించి అడిగితే కొన్ని విషయాలు మాట్లాడాను. కాని, నేను చెప్పని మాటలను చెప్పినట్టుగా ఆ ఛానల్ బ్రేకింగ్స్ వేసి నడిపించింది. నేను వెంటనే ఆ రిపోర్టర్‌కు ఫోన్‌చేసి ఇది సరికాదని, అనని మాటలు అన్నట్టుగా చూపించడం భావ్యంకాదని వారిని హెచ్చరించాను, సరిచేయమని కోరాను. ఇప్పటివరకూ వారు స్పందించలేదు. సీనియర్ దళిత నాయకుడి పట్ల కనీస మర్యాదను పాటించకుండా, నా ప్రతిష్టకు భంగం కలిగించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాను. దీనిపై న్యాయ ప్రకారం ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాను.