విశాఖపట్నం: సముద్రంలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి వారికి భరోసా కల్పించేందుకు వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విశాఖపట్నం చేరుకున్నారు. జబ్బార్‌పేటలోని బాధిత కుటుంబాలను కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు, ప్రమాదం నుంచి ప్రాణాపాయ స్థితిలో బయటపడిన కారి చిన్నాను కూడా పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు. వైయస్ జగన్ పర్యటన నేపథ్యంలో విశాఖ విమానాశ్రయం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను పలుచోట్ల అడ్డుకోవడంపై పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలను, పార్టీ నాయకులను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. గాజువాక నియోజకవర్గ ఇన్‌చార్జి తిప్పల దేవన్‌రెడ్డి మాట్లాడుతూ, బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వస్తున్న నాయకుడిని అడ్డుకునే ప్రయత్నాలు తగవని అన్నారు. ప్రజలను ఇబ్బంది పెడితే భవిష్యత్తులో ప్రభుత్వం కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటుందని హెచ్చరించారు. విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ, ఎయిర్‌పోర్టులో పోలీసులు అనవసర ఆంక్షలు విధిస్తూ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజల్లో అపార ఆదరణ కలిగిన వైయస్ జగన్‌ను ఎంత అడ్డుకున్నా ప్రజల స్పందనను ఆపలేరని అన్నారు. మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ, బోటు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వస్తున్న వైయస్ జగన్ పర్యటనపై ప్రభుత్వం అనవసర ఆంక్షలు విధించడం దుర్మార్గమన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలను పరామర్శించకపోవడం విచారకరమని పేర్కొన్నారు. వైయస్ జగన్ పర్యటన సందర్భంగా బాధిత కుటుంబాలను ప్రత్యక్షంగా పరామర్శించి వారికి ధైర్యం చెప్పడంతో పాటు, వారి సమస్యలను తెలుసుకుని వైయస్ఆర్‌సీపీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు.