అమ‌ర్నాథ్ కుటుంబానికి ప్ర‌భుత్వం అండ‌

సీఎం ఆదేశాల మేర‌కు రూ.10 ల‌క్ష‌లు ఆర్థిక‌సాయం

బాప‌ట్ల‌: బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఉప్పలవారి పాలెం గ్రామానికి చెందిన అమర్నాధ్ కుటుంబానికి అండగా ప్రభుత్వం నిలిచింది.  ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ ఆదేశాల ప్రకారం ఆ కుటుంబానికి10 లక్షలు ఆర్థిక సాయాన్ని మంత్రి జోగి రమేష్. ఎంపీ మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ చేతుల మీదుగా అంద‌జేశారు. అలాగే బాధిత కుటుంబానికి పక్కా ఇళ్లు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించే విధంగా అధికారులను ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. కుల రాజకీయాలు చేసి లబ్ధిపొందేందుకు కుట్రలు చేయడం టీడీపీ అధినేత చంద్రబాబుకు, ఆ పార్టీ ఎమ్మెల్యేలకు అలవాటేనని  తీవ్ర స్థాయిలో విమర్శించారు.  అమర్‌నాథ్‌ మృతిని అడ్డుపెట్టుకుని రాయకీయ లబ్ధిపొందేందుకు చంద్రబాబు కుట్రలకు తెరతీయడం, ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ప్రవర్తన సిగ్గు చేటని పేర్కొన్నారు. గౌడ కులస్తులను, బీసీలను చంద్రబాబు గతంలో ఎలా మోసం చేశారో అందరికీ తెలుసని ధ్వజమెత్తారు. సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పథకాల అమలులో కులాలు చూడడం లేదని స్పష్టం చేశారు. సంక్షేమ ప్రభుత్వంపై చంద్రబాబు అండ్‌ కో బురద జల్లేందుకు యత్నిస్తోందని, ఇందులో కుల సంఘాల నాయకులు పావులుగా మారకూడదని హితవుపలికారు. బీసీలకు సీఎం వైయ‌స్ జగన్‌ అధిక ప్రాధాన్యమిస్తున్నారని, అందరూ జగనన్నకు అండగా నిలవాలని కోరారు. అమర్‌నాథ్‌ మృతి తర్వాత ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు ఆ కుటుంబానికి అండగా నిలిచారని గుర్తు చేశారు.

కుట్రలకు ప్రతిరూపం అనగాని : మోపిదేవి

టీడీపీ అధికారంలో ఉండగా గుడ్డికాయలంకకు చెందిన గౌడ కులానికి చెందిన వ్యక్తిని పోలీసులు లాకప్‌ డెత్‌ చేస్తే అప్పటి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌కు తొత్తుగా పనిచేస్తున్న సీఐని రక్షించి బాధిత కుటుంబానికి అన్యాయం చేయటం రేపల్లె నియోజకవర్గ ప్రజలు మరువలేదని ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు విమర్శించారు. పేటేరులో గౌడ కులానికి చెందిన వ్యక్తిని హత్య చేస్తే నేరస్తులకు అండగా నిలిచిన చరిత్ర అనగాని సత్యప్రసాద్‌దని గుర్తు చేశారు. అడవులదీవిలో గౌడ కులానికి చెందిన వ్యక్తిని హత్య చేస్తే బాధ్యులైన వారికి సహకరించింది అనగాని కాదా అని ప్రశ్నించారు. అలాగే ఇటీవల పట్టణంలో టీడీపీకి చెందిన కౌన్సిలర్‌ను ఆపార్టీ నాయకులే హత్య చేస్తే హంతకులకు వెన్నుదన్నుగా నిలిచిన నీచ సంస్కృతి అనగానిదని ధ్వజమెత్తారు. కుట్రలకు ప్రతిరూపం అనగాని అని దుయ్యబట్టారు. అమర్‌నాథ్‌ హత్య పాశవిక చర్యని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాగాన్ని కోరినట్టు మోపిదేవి వివరించారు. కార్యక్రమంలో బాపట్ల అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌ దేవినేని మల్లికార్జునరావు, నేతలు కామినేని కోటేశ్వరరావు, బొర్రా శ్రీనివాసరావు, చెన్ను కోటేశ్వరరావు, తాతా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Back to Top