తాడేపల్లి: విజన్ 2047 పేరుతో చంద్రబాబు డ్రామాలాడుతున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఇలాంటి తొండాట ఆడటం ఆయనకు కొత్తేమి కాదన్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇష్టం వచ్చినట్లు హామీలు ఇస్తారు..అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోను పక్కన పెట్టేస్తారని విమర్శించారు. వృద్ధిరేటు విషయంలో చంద్రబాబు చెప్పిన అబద్ధాలను కాకాణి తిప్పికొట్టారు. శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నోటికొచ్చినట్లు పచ్చి అబద్దాలు: సంక్రాంతి పండుగ సందర్భంగా చంద్రబాబు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాధించిన ప్రగతిని గురించి మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. దీనికి రుజువుగా స్వయంగా ఆయనే కొన్ని గణాంకాలను కూడా ప్రకటించారు. తనకు వంతపాడే మీడియాలో తానే ఈ దేశంలో అతిపెద్ద విజనరీని అని చాటుకునేందుకు ప్రయత్నం చేశారు. వైయస్‌ఆర్ సీపీ హయాంలో దారితప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్న ఆర్థిక వేత్తగా తనను తాను అభివర్ణించుకున్నారు. తన వాదనకు అనుగుణంగా గణాంకాలను మార్చి, ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేశారు. కనీసం ఈ గణాంకాలను చెబుతున్నప్పుడు అయినా అవి వాస్తవాలా? కాదా? అనే విషయం ప్రజలు నిర్ధారించుకుంటారనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా నోటికి వచ్చిన అబద్దాలను గొప్పగా ప్రకటించారు. 2024–25 ఆర్ఠిక సంవత్సరానికి సంబధించి జీఎస్డీపి వృద్ధికి సంబంధించి అడ్వాన్స్ ఎస్టిమేట్ గణాంకాలను చంద్రబాబు వెల్లడించారు. దానిలో పూర్తిగా తన మార్క్ తెలివితేటలను ప్రదర్శించారు. వైయస్ జగన్ గారి హయాంలో కోవిడ్ సంక్షోభంను అధిగమించి రాష్ట్రం సాధించిన వృద్ధి రేటును పూర్తిగా మరుగున పరిచారు. తనకు అనుకూలంగా అంకెల గారడీని చూపించారు. చంద్రబాబు–అంకెల గారడీ: ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జీఎస్డీపీలో బ్రహ్మండంగా వృద్ధి సాధించినట్లు చంద్రబాబు ప్రకటించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాల్లో వృద్ధి సాధించినప్పుడే జీఎస్డీపీ పెరుగుతుంది. రాష్ట్ర జీఎస్డీపీ చూస్తే ఈ ఏడాది 0.17 శాతం మాత్రమే నమోదయ్యింది. ఇక స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్‌లో ఆదాయం 10.81 శాతం తగ్గింది. అమ్మకం పన్ను ద్వారా వచ్చిన ఆదాయంలో 10.03 శాతం తగ్గుదల నమోదైంది. మొత్తం మీద ఈ ఆరునెలల్లో రాష్ట్రప్రభుత్వ పన్ను ఆదాయంలోని వార్షిక వృద్ధిరేటులో 1.15 శాతం తగ్గుదల నమోదయ్యింది. రాష్ట్రప్రభుత్వ పన్ను ఆదాయం తగ్గితే జీఎస్డీపీ ఎలా పెరిగిందో దేశంలోనే గొప్ప విజనరీ అయిన చంద్రబాబు వివరించాలి. ఈ ఆరు నెలల్లో రాష్ట్రప్రభుత్వం ఖర్చు చేసిన మూలధన వ్యయం కూడా చాలా స్వల్పంగా నమోదయ్యింది. ఏకంగా 18.44 శాతంకు పడిపోయింది. ఒకవైపు వినియోగం తగ్గింది, మరోవైపు పెట్టుబడి తగ్గింది. ఇలాంటి సందర్భంలో జీఎస్డీపీ ఎలా పెరిగిందో ఆర్థిక నిపుణుడు చంద్రబాబే చెప్పాలి. వ్యవసాయంలో వృద్ధిరేటుపై వక్రీకరణ: రాష్ట్రంలో వ్యవసాయంలో వృద్ధి రేటు 15.86 శాతం పెరిగినట్లు చంద్రబాబు తన గణాంకాల్లో పేర్కొన్నారు. ఒకరైతు పంట పండించినప్పుడు దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని పెట్టుబడి కోసం అయినా లేదా వినియోగం కోసం అయినా ఉపయోగించాలి. ఇటు పెట్టుబడి లేదు, మరోవైపు వినియోగం లేదు అంటే చెబుతున్న ఆదాయం వాస్తవంగా లేదనే దాని అర్థం. అలాంటప్పుడు జీఎస్టీడీపీ పెరిగిందని ఎలా చూపిస్తారు? కానీ గడిచిన ఈ ఏడు నెలల్లో రాష్ట్రంలో రైతులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలిసిందే. అన్నదాత సుఖీభవ రెండు సీజన్లలో ఇవ్వలేదు. రైతులకు కనీస మద్దతు ధర దక్కలేదు, రైతులకు పంటల బీమా వర్తింపచేయలేదు. అలాంటిది గణనీయంగా వృద్ధి సాధించానని చెబుతున్న చంద్రబాబు ఈ మాటలు రైతుల వద్దకు వెళ్ళి చెప్పాలి. చంద్రబాబు హయాంలో ఎప్పుడూ అతివృష్టి, అనావృష్టి తప్ప రైతులు ఏనాడు సంతోషంగా లేరు. జీఎస్డీపీలో అంకెల గారడీలో మీ డొల్లతనం బయటపడింది. రాష్ట్రంలో ఏడాదికి 15 శాతం వృద్ధిరేటు సాధించాలనేది తన లక్ష్యంగా చెప్పుకుంటున్నాడు. ప్రపంచంలోని ఏ దేశంలోనూ, మన దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో వృద్ధి రేటు సాధ్యం కాలేదు. కానీ చంద్రబాబు తప్పుడు గణాంకాలతో తాను ఎంత ఎక్కువగా జీఎస్డీపీని సాధించానని చెప్పుకుంటూ పోవడం ద్వారా రాష్ట్రంలోని వెనుకబాటుతనం, పేదరికాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది చంద్రబాబుకు అలవాటు. ఆనాడు బిల్ క్లింటన్ వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో పేదరికం లేదు అని చెప్పడానికి హైదరాబాద్ లో బిక్షగాళ్లను తరిమేశారు. మా రాష్ట్రం సుభిక్షంగా ఉందని చెప్పేందుకు ప్రయత్నించాడు. వాస్తవాలను దాచిపెట్టి చెప్పే ప్రయత్నం చేశాడు. తలసరి ఆదాయంలోనూ తప్పుడు లెక్కలు: వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అత్యంత నష్టం జరిగిందని చంద్రబాబు ఒక అడ్డగోలు ప్రకటన చేశారు. 2018–19కి సంబంధించి కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ విభాగం ఇచ్చిన లెక్కల ప్రకారం దేశంలోనే తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో ఉంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఇది 15వ స్థానంకు చేరుకుంది. దీనిని గమనిస్తే చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికన్నా, వైయస్‌ఆర్ సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర తలసరి ఆదాయంలో రాష్ట్రం పురోగతిని సాధించింది. అంటే ఎవరి హయాంలో వృద్ది సాధించినట్లు? దీనికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు? ఈ వాస్తవాలను దాచిపట్టి, పచ్చి అబద్దాలతో ప్రజలను మోసం చేయాలని ప్రయత్నించడం దారుణం. పారిశ్రామిక వృద్ధిపైనా చంద్రబాబు అబద్దాలు: 2018–19లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో పారిశ్రామిక ఉత్పత్తుల నికర విలువ రూ.1,88,600 కోట్లతో దేశంలోనే 11వ స్థానంలో ఉంది. అదే 2022–23లో వైయస్‌ఆర్ సీపీ హయాంలో ఇది రూ.3,19,869 కోట్లతో 9వ స్థానంలో నిలిచింది. చంద్రబాబు తాజాగా చెప్పిన గణాంకాలు తప్పు అని వీటిని పరిశీలించిన ఎవరికైనా అర్థమవుతుంది. చంద్రబాబు హయాంలో పారిశ్రామిక వృద్ధిని ఏ రకంగా నాశనం చేశారు, జగన్ గారి హయాంలో దానిని ఎలా గాడిలో పెట్టారో చాలా స్పష్టంగా అవగతం అవుతుంది. కోవిడ్ సంక్షోభంలో కూడా వైయస్ జగన్ గారు రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేశారు. రాష్ట్రంలో ఏదైనా పెట్టుబడులు పెట్టాలంటే మళ్ళీ వైయస్ జగన్ అధికారంలోకి రాకూడదని బాండ్ రాసి ఇవ్వాలని తమను పారిశ్రామిక వేత్తలు అడుగుతున్నారని చంద్రబాబు, లోకేష్ లు ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబు పాలనలో పారిశ్రామిక వృధ్దిలో రాష్ట్రం 11వ స్థానంలో ఉంటే, జగన్‌గారు దానిని తన విధానాలతో 9వ స్థానంలోకి తీసుకువచ్చారు. అంటే చంద్రబాబు తన పాలనలో ఎంత విధ్వంసకరంగా వ్యవహరించారు?. జగన్ గారు ఎంత నిర్మాణాత్మకంగా పని చేశారు అన్నది తెలుస్తుంది. అదీ వైయస్‌ఆర్‌సీపీ హయాంలోనే ఎక్కువ: 2019–24కి సంబంధించి ఏపీ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్) 10.16 ఉంది. దేశం గ్రోత్ రేటు 9.29 శాతం ఉంది. అలాగే సెకండరీ సెక్టార్ లోని జీఏవీ లో ఏపీ 11.14 శాతం సాధిస్తే, జాతీయ పెరుగుదల శాతం 8.1 మాత్రమే. అలాగే టెరిటరీ సెక్టార్ జీఎవిలో ఏపీ 10.43 శాతం సాధిస్తే, జాతీయ రేటు 9.85 శాతం నమోదయ్యింది. దేశంలోని జీడీపీ 9.34 శాతం ఉంటే, ఏపీ 10.23 శాతంగా నమోదయ్యింది. అంటే 2014–19లో చంద్రబాబు హయాంలో దేశ జీడీపీలో రాష్ట్ర భాగస్వామ్యం 4.4 శాతం అయితే వైయస్‌ఆర్సీపీ హయాంలో ఇది 4.82 శాతం. జాతీయ స్థాయిలో ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో కేంద్ర స్థూల పన్ను ఆదాయం గత ఏడాది కన్నాదాదాపు 10.72 శాతం పెరిగింది. అందువల్ల దేశ జీడీపీలో 9.74 శాతం పెరిగింది. కానీ చంద్రబాబు ప్రకటించిన గణాంకాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో రాష్ట్రంలో పన్ను ఆదాయం 1.1శాతం తగ్గితే, రాష్ట్ర జీడీపీ వృద్ది దేశ జీడీపీ కన్నా మెరుగ్గా ఉందని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ ఆదాయం తగ్గితే జీఎస్డీపీ ఎలా పెరిగింది?: అయిదేళ్ళ వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో పన్ను ఆదాయంలో వృద్ధి రేటు 9.96 శాతం నమోదయ్యింది. దానివల్ల జీఎస్డీపీ దాదాపు 10 శాతం నమోదయ్యింది, అంటే ఎక్కువగా పెరిగింది. కానీ చంద్రబాబు హయాంలో ఇది 1.1 శాతం తగ్గింది. అలాంటప్పుడు జీఎస్డీపీ ఎలా పెరుగుతుంది? పన్నుద్వారా వచ్చే ఆదాయం తగ్గితే, ఏపీ ఎలా వృద్ధి సాధిస్తుందో చంద్రబాబు వివరించాలి. చంద్రబాబు ఆర్థిక రంగ నిపుణుడిగా తనను తాను చెప్పుకుంటుంటాడు. ఆయనను చూసి ఆర్థిక పాఠాలు నేర్చుకోవాలనడం అంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. ఒకవైపు ఏడాదికి 15 శాతం వృద్ది రేటు సాధిస్తానని చెబుతున్నాడు, మరోవైపు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. ఇలాంటి అబద్దాలు ఇంకెవరూ చెప్పలేరు. ఆర్థిక అంశాలపై అవగాహన ఉన్నవారు, పరిపాలనపై పట్టు ఉన్నవారు ఎవరూ ఇలాంటి అబద్దాలు చెప్పరు. ఇది ఆయనకు మాత్రమే సాధ్యం. స్విజ్జర్ ల్యాండ్‌కు చెందిన మంత్రి పాస్కల్ గతంలో చంద్రబాబు లాంటి వ్యాఖ్యలు చేసే వారిని మా దేశంలో అయితే జైలులో పెడతారని చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఇద్దరు పిల్లలపై చంద్రబాబు ద్వంద వైఖరి: కనీసం ఇద్దరు పిల్లలు లేకపోతే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అనర్హులు అని సీఎం చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉంది. ఆయనకు ఒకరే సంతానం, ఆయన కుమారుడికి కూడా ఒక్కరే సంతానం. అంటే ఎదుటి వారు మాత్రం ఇద్దరు బిడ్డలను కనాలి, నా కుటుంబం మాత్రం ఒక్కరినే కంటుంది అని చెబుతున్నాడా? తాను చెప్పేది ఎదుటి వారికే తప్ప తనకు వర్తించదని చంద్రబాబు చాటుకుంటున్నారు. దీనితోనే మీ ద్వంద వైఖరి అర్థమవుతోంది. కేబినెట్‌లో చర్చ అంటూ మళ్ళీ మళ్ళీ మోసం: ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో నిషేద జాబితా నుంచి తొలగించిన భూములపై పరిశీలనకు మంత్రుల కమిటీ వేయాలని నిర్ణయించారు. దీనిపై గత ఏడు నెలలుగా రకరకాల విచారణలు జరిపిస్తున్నారు. మీ అధికారులను పంపారు, తరువాత ఇప్పుడు మంత్రులతో కమిటీ వేస్తామని చెబుతున్నారు. అంటే మీ అధికారుల విచారణలోనే ఏ తప్పులు జరగలేదని తేలినా, ఏదో ఒక రకంగా తప్పు జరిగిందని నిరూపించేందుకు మంత్రుల కమిటీ అంటున్నారు. తల్లికి వందనం, మత్స్యకారుల భరోసా, అన్నదాత సుఖీభవ పథకాల అమలుకు సిద్దం కావాలని కేబినెట్ లో చర్చించారు. ఏడు నెలలుగా ఈ పథకాలను అమలు చేయకుండా, వాటిని ఇవ్వకుండా, ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామంటూ ప్రజలను మభ్య పెట్టేందుకు కేబినెట్‌లో దీనిని చర్చించామని చెబుతున్నారు. ఈ ఏడు నెలల్లోనే ప్రజలకు ఇచ్చిన హామీలకు గానూ దాదాపు రూ.60వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది. దానిని తప్పించుకున్నారు. జగన్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హమీల అమలును ప్రారంభించారు. చంద్రబాబుకు, వైయస్ జగన్ గారికి నక్కకు, నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. వైయస్ జగన్ గారి పాలనను ఉచ్ఛరించే అర్హత కూడా చంద్రబాబుకు లేదు. పేదల ఇళ్ళస్థలాలపై పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తామని చెప్పారు. జగన్ గారి హయాంలో లేఅవుట్లు వేస్తే, వాటిని రీ లేఅవుట్లుగా చేసి కూటమి శాసనసభ్యులు తమ పార్టీ వారికే ఇచ్చేందుకు సిద్దమయ్యారు. జగన్ గారు దాదాపు రూ.14వేల కోట్లు ఖర్చు పెట్టి భూములను కొనుగోలు చేసి లేఅవుట్లు వేశారు. రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా స్థలాలను పంపిణీ చేశారు. ఇప్పుడు చంద్రబాబు అదే లే అవుట్లను తన పార్టీ కార్యకర్తలకు దారాదత్తం చేసేందుకు సిగ్గు లేకుండా సిద్దమయ్యారు.