రాష్ట్ర సమగ్రాభివృద్ధే సీఎం వైయస్‌ జగన్‌ ధ్యేయం

ప్రజా శ్రేయస్సుకు అడుగడుగునా అడ్డు తగిలే మండలి అవసరమా..?

రాష్ట్ర అభివృద్ధికి ‘వికేంద్రీకరణ’ ఒక్కటే శరణ్యం

డిప్యూటీ సీఎం ఆళ్ల నాని

 

అసెంబ్లీ: ప్రజాశ్రేయస్సు కోసం ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే.. శాసనమండలి అడుగడుగునా అడ్డు తగులుతుందని, మండలిలో టీడీపీ సభ్యులు స్వార్థ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అన్నారు.  మండలిలో మేధావులు ఉన్నప్పటికీ.. టీడీపీ సభ్యులు మాత్రం ప్రతీ అంశాన్ని రాజకీయం చేస్తున్నారన్నారు. మండలిపై స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మాట్లాడుతూ.. ‘గత కొద్ది రోజులుగా శాసనసభ, మండలిలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్నాం. రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు రాకూడదు. ప్రజలు అసంతృప్తి చెందకూడదు.. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలని సీఎం వైయస్‌ జగన్‌ మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ఆలోచన చేశారు. అమరావతి లెజిస్లేటివ్, కర్నూలు జ్యుడిషియల్, విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా చంద్రబాబు, శాసన మండలిలో టీడీపీ సభ్యులు అందరూ స్వార్థ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ..  అమరావతి పరిసర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసి రియలెస్టేట్‌ వ్యాపారం చేస్తున్న టీడీపీ నాయకుల ప్రయోజనాలు కాపాడడం ప్రధాన ధ్యేయంగా సభలో అరాచకాలు చేస్తున్నారు.

రాజధానిని ఇక్కడి నుంచి తరలించడం లేదు. అదనంగా మిగిలిన ప్రాంతాల్లో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తున్నాం. దీని వల్ల భవిష్యత్తులో ప్రాంతీయ అసమానతలు ఉండవు. అభివృద్ధి, అధికారం వికేంద్రీకరణ జరిగితే వేర్పాటు వాదం రాష్ట్రంలో ఎక్కడా వచ్చే అవకాశం ఉండదని ముందుచూపుతో సీఎం వైయస్‌ జగన్‌ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. సీఎం నిర్ణయానికి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడు. సమైఖ్యంగా ఉన్న రాష్ట్రం రెండుగా విడిపోవడానికి చంద్రబాబు ప్రధాన కారణం. రెండు కళ్ల సిద్ధాంతం వల్ల సమైఖ్యంగా ఉన్న మన రాష్ట్రం రెండుగా విడిపోయింది. సోనియాగాంధీతో కుమ్మకై అధికార దాహంతో రాష్ట్ర ప్రయోజనాలను పక్కనబెట్టి రాష్ట్రం రెండుగా విడిపోవడానికి ప్రధాన కారకుడు అయ్యాడు. రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత హైదరాబాద్‌ నగరాన్ని మనం కోల్పోయాం.  

ఆంధ్రప్రదేశ్‌ పూర్వవైభవం సంతరించుకోవాలంటే ప్రత్యేక హోదా శరణ్యమని సీఎం వైయస్‌ జగన్‌ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అనేక పోరాటాలు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులపై, వైయస్‌ జగన్‌పై అక్రమంగా కేసులు పెట్టారు. ప్రత్యేక హోదా కోసం వైయస్‌ జగన్‌ పోరాటం చేస్తుంటే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి హోదాను తాకట్టుపెట్టి ప్యాకేజీ తీసుకున్నాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అటువంటి పరిస్థితులు రాకూడదని, ప్రత్యేక హోదాపై ప్రజలంతా నిరాశ, నిస్పృహల్లో ఉన్న సమయంలో వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో ఎన్నో లక్షల మంది పేద ప్రజలు, ఎంతో మంది నిరుద్యోగులు వైయస్‌ జగన్‌ను కలిసి సమస్యలను మొరపెట్టుకున్నారు. సంవత్సరానికి కొన్ని లక్షల మంది విద్యార్థులు పట్టాలు పట్టుకొని ఉద్యోగం కోసం వస్తున్నారు. గత ఐదు సంవత్సరాలుగా ఒక్క ఉద్యోగం అయినా ఇవ్వని వ్యక్తి చంద్రబాబు.

సీఎం వైయస్‌ జగన్‌ చేసిన ఆలోచనకు శివరామకృష్ణన్‌ కమిటీ సూచనలు కూడా తోడయ్యాయి. రియలెస్టేట్‌ వ్యాపారం కోసం అమరావతిని పెంచిపోషిస్తున్నారు. కేవలం టీడీపీ నాయకుల  ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మూడు రాజధానుల ప్రయత్నానికి చంద్రబాబు అడ్డుపడుతున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి సీఎం మావాడే అంటూ లేని కులతత్వాన్ని సీఎం వైయస్‌ జగన్‌కు అంటగట్టే నీచ ప్రయత్నం చేస్తున్నాడు. అన్నదమ్ముళ్లా కలిసి ఉంటున్న సామాజిక వర్గాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు లాంటి రాజకీయ నాయకులు ఉంటే.. భవిష్యత్తులో ఈ రాష్ట్రం బాగుపడదు.

ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారానికి చంద్రబాబు ఎప్పుడైనా ప్రయత్నించారా..? అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రూ.700 కోట్లతో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసిన నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌. అభివృద్ధి, అధికారం వికేంద్రీకరణ జరిగితేనే రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచనకు రాష్ట్ర ప్రజలు మద్దతు పలుకుతున్నారు. అమరావతి రాజధాని ప్రాంతానికి అనుకూలం కాదు.. ఆ పరిస్థితులు ఎందుకు లేవో గతంలో ఫైనాన్స్‌ మినిస్టర్‌ బుగ్గన, సీనియర్‌ నేత ధర్మన వివరించారు. అంతేకాకుండా 4500 ఎకరాల దోపిడీని రికార్డులతో సహా సభ దృష్టికి తీసుకువచ్చాం. నారాయణ అనే బోగస్‌ కమిటీని వేసి  అమరావతి ఒక్కటే అనుకూలమని రిపోర్టు కూడా చంద్రబాబే రాశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నాశనం చేశారు. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని సీఎం వైయస్‌ జగన్‌కు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది.

శాసనమండలిలో ఏం జరుగుతుందో చూస్తున్నాం. శాసనసభలో ఆమోదంపొందిన∙బిల్లులో పొరపాట్లు ఉంటే సలహాలు, సూచనలు చేయడానికి మండలి వ్యవస్థ ఉండేది. ఇప్పటికీ మండలిలో చాలా మంది మేధావులు ఉన్నా.. టీడీపీ సభ్యులు మాత్రం ప్రతీ అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. రాష్ట్రం ఇంగ్లిష్‌ మీడియం బిల్లుతో టీడీపీ సభ్యులకు వచ్చిన నష్టం ఏంటీ..? ఎస్సీ, ఎస్టీకి ప్రత్యేకంగా ఒక కమిషన్‌ పెడితే ఆ కమిషన్‌ను కూడా అడ్డుకునే పరిస్థితి ఎందుకు దాపరించింది. సీఆర్‌డీఏ బిల్లుతో సహా, రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కీలకంగా సీఎం తీసుకున్న నిర్ణయాన్ని కూడా అడ్డుకునే పరిస్థితి మండలిలో తీసుకువచ్చారు. చంద్రబాబు నీచ రాజకీయాలకు ఇది నిదర్శనం కాదా..? ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, పాదయాత్రలో ప్రజల నా దృష్టికి తీసుకువచ్చిన సమస్యలు పరిష్కరించాలి. దీనితో పాటు రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ముందుకు వెళ్తున్నారు. మండలిలో పది మంది సభ్యులు ఎక్కవగా ఉన్నారని నీచంగా ప్రవర్తించడం మంచిది కాదు. చంద్రబాబు భవిష్యత్తులో ప్రజల తగిన గుణపాఠం చెబుతారు. రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగునా అడ్డు తగిలే మండలి విషయంలో స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోవాలి.

తాజా వీడియోలు

Back to Top