నంద్యాల జిల్లా : మిడుతూరు మండలం జలకనూరు గ్రామంలోని మద్దిగుండం చెరువు గండి మరమ్మతు పనులను వైయస్ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డా. సుదీర్ ధారా పరిశీలించి, పనుల్లో జరిగిన అవకతవకలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చెరువు గండి పూడ్చేందుకు ప్రభుత్వం రూ.37 లక్షలు మంజూరు చేసినప్పటికీ, కనీసం రూ.10 లక్షల విలువైన పనులు కూడా జరగలేదని ఆరోపించారు. నాసిరకంగా పనులు నిర్వహించడం వల్ల చెరువు భద్రతపై రైతుల్లో ఆందోళన నెలకొందన్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు స్వయంగా చేపట్టాల్సిన పనులను సివిల్ కాంట్రాక్టర్‌కు ఎలా అప్పగించారంటూ ప్రశ్నించారు. ఈ పనులను స్థానిక ఎమ్మెల్యే జయసూర్య వర్గానికి చెందిన కాంట్రాక్టర్‌కు అప్పగించారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతి అభివృద్ధి పనిలో టీడీపీ నేతలకు పర్సంటేజీలు వెళ్తున్నాయని వారి పార్టీ నేతలే చెబుతున్నారని విమర్శించారు. గత టీడీపీ పాలనలో ‘నీరు-చెట్టు’ పథకం కింద చేపట్టిన నాసిరకం పనుల కారణంగానే ఈ చెరువుకు గండి పడిందని, ఇప్పుడు మళ్లీ అదే తరహా పనులు చేయడం బాధాకరమన్నారు. పర్సంటేజీల కోసం నాణ్యతను పక్కనబెట్టి పనులు నిర్వహించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ప్రస్తుతం చేపట్టిన మరమ్మతు పనుల్లో ఇప్పటికే పగుళ్లు కనిపిస్తున్నాయని, భారీ వర్షాలు కురిస్తే చెరువుకు మరోసారి గండి పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. “ఇలా నాసిరకంగా కట్టిన చెరువుకు మళ్లీ గండి పడితే రైతుల పరిస్థితి ఏమిటి? పెద్ద వర్షం పడితే కొట్టుకుపోయేలా ఉన్న ఈ పనులను చూసి కూడా అధికారులు స్పందించకపోవడం విచారకరం” అని డా. సుదీర్ ధారా అన్నారు. ప్రాంత రైతుల సమస్యలు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీకి కనిపించడం లేదా అని ప్రశ్నించిన ఆయన, చెరువు మరమ్మతు పనులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల భద్రత, సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.