ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడం అత్యంత దురదృష్టకరం

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌ వైయస్ జగన్

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అమలు దాదాపు నిలిచిపోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు వైద్యులు మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్‌ను నరసరావుపేట, గుంటూరు ప్రాంతాలకు చెందిన పలువురు వైద్యులు కలిసి రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగ పరిస్థితులు, రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.

ఈ సమావేశంలో మాట్లాడిన వైద్యులు ఆరోగ్యశ్రీ పథకం సక్రమంగా అమలు కాకపోవడం వల్ల వేలాది మంది పేద రోగులు చికిత్సకు నోచుకోలేకపోతున్నారని తెలిపారు. ఆసుపత్రులకు మంజూరు చేసే ఎల్వోసీలు కూడా పారదర్శకంగా ఇవ్వకుండా, అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న కొన్ని ఆసుపత్రులకే ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించారు. ఆరోగ్యశ్రీ పరిధిలో చికిత్స అందించాల్సిన వ్యాధులకు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా నిధులు కేటాయిస్తూ, అందులో అవినీతి, కమీషన్లకు అవకాశం కల్పిస్తున్నారని వైయస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా స్పందించిన వైయస్ జగన్, పేదవాడికి కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలన్న మహోన్నత లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయడం అత్యంత బాధాకరమని అన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించి, మరిన్ని వ్యాధులను చేర్చడంతో పాటు చికిత్స అనంతరం విశ్రాంతి కాలానికి ఆర్థిక సహాయం, రోగులకు మెరుగైన సేవలు అందించేలా అనేక సంస్కరణలు చేపట్టామని గుర్తు చేశారు.

అలాగే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడం, కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, గ్రామ స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు, నాడు-నేడు ద్వారా ఆసుపత్రుల అభివృద్ధి వంటి కార్యక్రమాలతో వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని తెలిపారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ తరఫున ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు బాధితులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

వైయ‌స్ఆర్‌సీపీ డాక్టర్స్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వైద్యులు కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి, శేషిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, హనిమిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, చంద్రకిరణ్, వసంత, చెన్నారెడ్డి, కొండారెడ్డి, జయభారత్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, క్రాంతికుమార్, వెంకట లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Back to Top