నిందితుల‌ను కాపాడ‌టమే ల‌క్ష్యంగా సిట్ విచార‌ణ‌

అందులో భాగంగానే కృష్ణ‌లంక‌ పీఎస్ సీసీ టీవీ ఫుటేజ్‌లు మాయం 

అనుమానాలు వ్య‌క్తం చేసిన‌ మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు  

గుంటూరు లోని త‌న క్యాంప్ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు 

సీఐ నాగ‌రాజును ఇంత‌వ‌ర‌కు ఎందుకు అరెస్ట్ చేయ‌లేదు

కేసు న‌మోదైన మ‌రుక్ష‌ణ‌మే ఆయ‌న్ను అరెస్ట్ చేయాలి క‌దా

సీఐ నాగ‌రాజును అరెస్ట్ చేయ‌కుండా జ‌న‌సేన అడ్డుకోవ‌డం ఏంటి? 

నేర‌స్తుల‌ను నేర‌స్తులుగానే చూడాల‌ని చెప్పే ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేస్తున్న‌దేమిటి? 

పోలీసులే నేర‌స్తుల‌ను చంపేస్తుంటే న్యాయ‌స్థానాలు ఉన్న‌ది దేనికి?  

సీఐని అరెస్ట్ చేయ‌క‌పోతే సాక్ష్యాధారాలు మాయం చేస్తాడ‌ని చెబుతూనే ఉన్నాం

చివ‌రికి మేం అనుమానించిన‌ట్టుగానే ఫుటేజ్‌లు మాయం చేశారు  

సీబీఐ విచార‌ణ చేస్తే త‌ప్ప అస‌లైన నిందితుల‌కు శిక్ష ప‌డ‌దు

స్ప‌ష్టం చేసిన మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు

గుంటూరు: కాపు యువ‌కుడు గాదె సాయికృష్ణ లాక‌ప్‌డెత్ కేసులో నిందితులైన పోలీస్ అధికారుల‌ను కాపాడ‌ట‌మే ల‌క్ష్యంగా విచార‌ణ న‌త్త‌న‌డ‌క‌న సాగుతోంద‌ని, కృష్ణ‌లంక పోలీస్ స్టేష‌న్‌ సీసీ టీవీ ఫుటేజీ మాయం కావ‌డమే దీనికి నిద‌ర్శ‌న‌మ‌ని గుంటూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గుంటూరులోని త‌న క్యాంప్ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో ఆరోప‌ణలు ఎదుర్కొంటున్న సీఐ నాగ‌రాజు మీద కేసు న‌మోదు చేసిన మ‌రుక్ష‌ణ‌మే అరెస్ట్ చేయ‌కుండా ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్ర‌కారం పోలీస్ స్టేష‌న్‌ల‌లో 18 నెల‌ల పాటు సీసీటీవీ ఫుటేజీలను నిల్వ చేసి ఉంచాల‌న్న నిబంధ‌న ఉల్లంఘించార‌ని, సీఐ నాగ‌రాజును అరెస్ట్ చేసి ఉంటే ఆ ఫుటేజీ మాయమయ్యేదే కాద‌న్నారు. ఒక ప‌ద్ద‌తి ప్ర‌కారం పోలీసుల‌ను పోలీసులే కాపాడే కుట్ర‌లో భాగంగా స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతున్నార‌ని ఆరోపించారు. నేర‌స్తుల‌ను నేర‌స్తులుగానే చూడాల‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్య‌లతో నేను ఖ‌చ్చితంగా ఏకీభ‌విస్తున్నాన‌ని, అలాంట‌ప్పుడు లాక‌ప్‌డెత్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న సీఐని కాపాడ‌టానికి ధ‌ర్నాలు చేస్తున్న జ‌నసేన నాయ‌కుల‌ను ఎందుకు అడ్డుకోలేద‌ని ప్ర‌శ్నించారు. సాయికృష్ణ‌ను లాక‌ప్‌లో చంప‌డ‌మే కాకుండా శ‌వాన్ని ఇవ్వ‌కుండా కాల్చేసి బూడిద కూడా దొర‌క్కుండా మాయం చేయ‌డం, సీసీటీవీ ఫుటేజీలు తుడిచేయ‌డం, ఇలా వ‌రుస‌పెట్టి త‌ప్పుల మీద త‌ప్పులు చేస్తూనే ఉన్నారని ధ్వ‌జ‌మెత్తారు. ఈ కేసు సీబీఐ విచార‌ణ చేస్తే త‌ప్ప నిందితుల‌కు శిక్ష పడ‌ద‌ని మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు స్ప‌ష్టం చేశారు. 

ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే...

- మేం ఊహించిందే జ‌రిగింది

గాదె సాయికృష్ణ లాక‌ప్‌డెత్ పై ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచార‌ణ న‌త్త‌న‌డ‌క‌న, నిందితులైన పోలీస్ అధికారుల‌ను కాపాడ‌టానికి సాగుతున్న‌ట్టుగా ఉంది. గ‌త నెల 9 నుంచి కృష్ణ‌లంక పోలీస్ స్టేష‌న్ సీసీ టీవీ ఫుటేజీలు మాయ‌మ‌య్యాయ‌ని కేవ‌లం రెండు రోజుల ఫుటేజీలు మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయ‌ని ప్ర‌భుత్వ అనుకూల ప‌త్రిక ఈనాడులోనే రాశారు. మొద‌ట్నుంచి క‌మిష‌న‌ర్ పాత్ర‌పై అనుమానాలు వ్య‌క్తం  చేస్తున్నా ప్ర‌భుత్వం ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. చివ‌రికి మేం చెప్పిందే జ‌రిగింది. కేసు న‌మోదు చేసిన మ‌రుక్ష‌ణ‌మే నేరారోప‌ణ‌లు ఎదుర్కొంటున్న సీఐ నాగ‌రాజును అరెస్ట్ చేయాల్సింది. అది జ‌ర‌గ‌లేదు కాబ‌ట్టే  ఆధారాల‌ను తుడిచేసే కార్య‌క్ర‌మాలు నిర్విఘ్నంగా సాగిపోతున్నాయి. పోలీసులే పోలీసుల్ని కాపాడటం కోసం స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నారు. ఈ కేసును సీబీఐ విచార‌ణ‌కు ఆదేశిస్తే త‌ప్ప బాధిత కుటుంబానికి న్యాయం జ‌రిగే అవ‌కాశం ఉండ‌దు. 

- సీఐ నాగ‌రాజును జ‌న‌సేన ఎందుకు కాపాడుతోంది ?
  
నేర‌స్తులు ఏ కులం వారైనా శిక్షించాలి, నేర‌స్తుల‌ను నేర‌స్తులుగానే చూడాల‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్య‌లతో నేను ఖ‌చ్చితంగా ఏకీభ‌విస్తున్నా. కాకపోతే నేర‌స్తుల‌ను శిక్షించ‌డం అంటే చ‌ట్టాల‌ను ఉల్లంఘించి లాక‌ప్‌లో చంపేసి శ‌వాలను కాల్చేసి బూడిద దొరక్కుండా మాయం చేయ‌డ‌మా?  చ‌ట్టానికి దొర‌క్కుండా సీసీ టీవీ ఫుటేజీలను మాయం చేయ‌డ‌మా?  నేర‌స్తుల‌ను శిక్షించ‌డానికి న్యాయ‌స్థానాలు ఉన్నాయ‌నే సంగ‌తి మ‌రిచిపోతే ఎలా? గాదె సాయికృష్ణ‌పై రెండు కేసులు న‌మోదై ఉన్నాయి. వాటిలో ఆ యువ‌కుడికి నాన్ బెయిలబుల్ వారెంట్లు మాత్ర‌మే ఉన్నాయ‌నే విష‌యాన్ని దాచిపెట్ట‌డం స‌బ‌బు కాదు. సాయికృష్ణ‌ను లాక‌ప్‌లో చిత్ర‌హింస‌ల‌కు గురిచేసి చంపేశారని, బూడిద కూడా దొరక్కుండా మాయం చేశార‌ని చెబితే.. దానికి స‌మాధానం చెప్పకుండా అంబ‌టి రాంబాబు చూపించిన ఫొటోలు సాయికృష్ణ‌వి కాదంటారు. సాయికృష్ణ త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మి కొడుకు ఆచూకీ చెప్పాల‌ని 40 రోజులుగా తిరుగుతున్నారు. త‌న కొడుకు బ‌తికున్నాడో లేదో చెప్పాల‌ని కోరుతున్నారు. దానికి సమాధానం చెప్ప‌రే? సాయికృష్ణ‌ను లాక‌ప్‌లో చంప‌డ‌మే కాకుండా శ‌వాన్ని ఇవ్వ‌కుండా కాల్చేసి బూడిద కూడా దొర‌క్కుండా మాయం చేయ‌డం, సీసీటీవీ ఫుటేజీలు మాయం చేయ‌డం.. ఇలా వ‌రుస‌పెట్టి త‌ప్పుల మీద త‌ప్పులు చేస్తూనే ఉన్నారు. నేర‌స్తుడు కాబ‌ట్టి సాయికృష్ణ‌ను చంపేశామ‌ని చంద్ర‌బాబు, తెలుగుదేశం నాయ‌కులు మాట్లాడటం లేదు. కానీ కాపు యువ‌కుడి లాక‌ప్ డెత్ కి కార‌ణ‌మైన సీఐ నాగరాజును అరెస్ట్ చేయొద్ద‌ని జ‌న‌సేన నాయ‌కులు ధ‌ర్నాలు చేయ‌డం సిగ్గుచేటు. కాకినాడ వెళ్లి ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెచ్చ‌గొట్టే వ‌ర‌కు జ‌న‌సేన కాపు నాయ‌కులు బ‌య‌ట‌కొచ్చిన పాపాన‌పోలేదు. ఇప్పుడు నేర‌స్తుడికి వంత‌పాడుతూ క‌ల్లు తాగిన కోతులు మాదిరిగా డ్యాన్సులేస్తున్నారు. పోలీసుల అప్ర‌జాస్వామిక విధానాల‌కు వంత‌పాడుతున్నారు. 

- సాయికృష్ణ కేసుకి మేక‌ప్ వేసే కార్యక్ర‌మం

సాయికృష్ణ కేసుకి మేక‌ప్ వేసే కార్యక్ర‌మం జ‌రుగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్ర‌కారం దేశంలోని ప్ర‌తి పోలీస్‌స్టేష‌న్‌లో సీసీటీవీ ఫుటేజీలు క‌నీసం 18 నెల‌లు దాచి ఉంచాలి. కానీ కృష్ణ‌లంక పోలీస్ స్టేష‌న్ పోలీసులు ఆ నిబంధ‌న‌లు కూడా ఉల్లంఘించారు. రాష్ట్రంలో 70 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామ‌ని, నేరం జ‌రిగిన 5 నిమిషాల్లో నిందితుల‌ను ప‌ట్టుకుంటామ‌ని హోంమంత్రి అనిత చెప్పారు. కానీ వాస్తవం చూస్తే పోలీస్ స్టేష‌న్‌లో సీసీ కెమెరాలు కూడా మాయం చేశారు. అందుకే డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోరిన‌ట్టు ఆయ‌న‌కు హోంమంత్రి ప‌ద‌వి ఇస్తే బాగుటుంద‌ని నా అభిప్రాయం. తూతూమంత్రంగానే సిట్ విచార‌ణ జ‌రుగుతోంది. కేసు నమోదు చేసిన నాటి నుంచే ఎక్క‌డా ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో వ్య‌వ‌హ‌రించ‌డం లేదని అంబ‌టి రాంబాబు ఆరోపించారు.

Back to Top